టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కకూడదు

సంక్షేమానికి అడ్డుతగులుతున్న రాజకీయ దుర్యోధనుడిని శిక్షించాలి

పేదవాడి ఆరోగ్యంతో రాజకీయం చేసే దుర్మార్గుడు చంద్రబాబు

తిరుపతి ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థికి గొప్ప మెజార్టీ అందించండి

విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ధ్వజం

నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా దక్కనివ్వకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కోర్టులను అడ్డంపెట్టుకొని సంక్షేమ పథకాలకు అడ్డుతగులుతున్న రాజకీయ దుర్యోధనుడిని తప్పకుండా శిక్షించాలన్నారు. ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థిగా సీఎం వైయస్‌ జగన్‌.. ఎవరిని బరిలోకి దించిన  గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ జరుగుతుందన్నారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు సంతకం పెడితేనే పెన్షన్, రేషన్‌ వచ్చేవని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేవన్నారు. అర్హత ఉన్నవారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కులం, మతం, ప్రాంతం చివరకు పార్టీలు కూడా చూడకుండా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌.. అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను 90 శాతంపైగా పూర్తిచేశారన్నారు. 

పేదవాడి ఆరోగ్యంతో కూడా రాజకీయం చేసేంత దుర్మార్గుడు చంద్రబాబు అని మంత్రి బాలినేని మండిపడ్డారు. 1999లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ‘ఒక నిరుపేద ఆరోగ్య సమస్య నిమిత్తం సాయం కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం దరఖాస్తు పెట్టుకుంటే చంద్రబాబు సంతకం పెట్టాడు. ఆ నిరుపేదను కొన్ని రోజుల తరువాత కలిస్తే.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ రాలేదు.. నా ఇల్లు తాకట్టుపెట్టుకొని ఆపరేషన్‌ చేపించుకున్నాను అని నాతో చెప్పాడు. వెంటనే సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఆఫీస్‌కు వెళ్తే.. చంద్రబాబు నాయుడు ఇచ్చేదానికి ఒక సంతకం.. ఇవ్వనిదానికి ఒక సంతకం పెడతాడని చెప్పారు’. పేదవాడి ఆరోగ్యంతో కూడా రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు.  

2004లో వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చినా కూడా లక్షల రూపాయల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇచ్చారని మంత్రి బాలినేని గుర్తుచేశారు. అందరికంటే ఎక్కువ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఇచ్చారని.. ఇదేంటి సార్‌ అని కొండా సురేఖ అడిగితే.. పేదవాడి ఆరోగ్యంతో రాజకీయం చేయొద్దు అమ్మ. సాయం కోసం ఎవరు వచ్చినా పార్టీ చూడకుండా ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మనది అని కొండా సురేఖకు నచ్చజెప్పారని మంత్రి బాలినేని గుర్తుచేశారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top