పర్యాట‌కుల‌కు ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌
 

విశాఖ‌:  ఆర్కే బీచ్ వంటి పర్యాటక ప్రాంతాలే కాకుండా.. చారిత్రక కట్టడాలను కూడా వీక్షించడం ద్వారా పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌ అన్నారు. తద్వారా పర్యాటకంగా ప్రభుత్వానికి ఆదాయం కూడా లభిస్తుందని అన్నారు. చరిత్ర ఇచ్చిన వారసత్వ సంపదను కాపాడుకుంటూ.. భవిష్యత్ తరాలకు అందివ్వాల్సిన అవసరం మనపై ఉందని అన్నారు. విశాఖ ప్రాంతంలోని తొట్ల కొండలోని బౌద్ధారామాల నందు పునర్నిర్మాణం చేసిన మహా స్తూపాన్ని.. ఏమినిటీ సెంటర్‌ను మంత్రి మంగళవారం  ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.43 లక్షల  ఖర్చుతో ఈ మహాస్తూపాన్ని పునఃనిర్మించామని.. 20 లక్షలతో ఎమినిటీ సెంటర్ ను అభివృద్ధి చేసి పర్యాటకులకు ఇక్కడి బౌద్ధారామాలు పర్యాటక ప్రాంతంగా, చారిత్రక ప్రదేశంగా ఆకట్టుకుంటుందని అన్నారు. తొట్లకొండకు వందల సంవత్సరాల చరిత్ర ఉందని.. బుద్ధులు ధ్యానం చేసుకున్న పవిత్ర స్థలమని అన్నారు. కొవిడ్ కారణంగా తగ్గిన టూరిజం శాఖ ఆదాయాన్ని పెంచేందుకు సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. తొట్లకొండలో మెడిటేషన్ సెంటర్‌ తాపటు.. ఇక్కడకి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. పర్యాటకుల సౌలభ్యం కోసం టూరిజం శాఖలో కొత్తగా ఒక యాప్‌ను తీసుకువస్తున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
ఈక్రమంలోనే రుషికొండ నుంచి భీమిలి మధ్య ప్రాంతంలో తొట్లకొండ, ఎర్రమట్టి దిబ్బలు వంటి ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.  

 సెప్టెంబర్ నుంచి మరో నాలుగు నెలలపాటు పర్యాటకులు ఎక్కువగా వస్తారని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. యారాడ నుంచి భీమిలి మధ్యలో దాదాపు 9 బీచ్ లు ఉన్నాయని.. చెన్నై, కేరళ, గోవా తరహాలో వీటిని కూడా అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా మార్చే ఉద్దేశముందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయాల్ని తీసుకెళ్లి విశాఖ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. తొట్లకొండలో వీఎంఆర్డీఏ ఆర్ధిక సహకారంతో మహాస్థూపం పునఃనిర్మాణంతోపాటు 64 స్థంభాల సమావేశ మందిరం, విషయ సూచిక బోర్డులు కూడా మరమ్మత్తులు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ హరి వెంకట కుమారి, జీవీఎంసీ చీఫ్ విప్, ఆరోవార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక, వీఎంఆర్డీఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, జీవీఎంసీ అధికారులు, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు...

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top