బాబుకు అమ‌రావ‌తిపై ప్రేమ ఉంటే టీడీపీ ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించాలి

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

 విశాఖపట్నం: నిజంగా చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ ఉంటే విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని.. అమరావతి కావాలో, విశాఖ కావాలో అప్పుడు ప్రజలే నిర్ణయిస్తార‌ని ప‌ర్యాట‌క శాఖ ధ్వ‌జమెత్తారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో ఎంపీ గా గెలిపించిన విశాఖపట్నం ప్రజలపై పురంధేశ్వరి కృతజ్ఞత లేకుండా మాట్లాడారని ఆయన విమర్శించారు.  

ఆయన వెంట సబ్బం హరి చేరారు..
ఉత్తరాంధ్రకు చెందిన సబ్బం హరి రాజకీయ ద్వేషంతో విశాఖ కేంద్రంగా క్యాపిటల్ ను వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు జీవితాంతం కుట్ర రాజకీయాలే చేస్తారని.. ఇప్పుడు ఆయన వెంట సబ్బం హరి చేరారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌పై ఆయనకే ఎక్కువ బాధ్యత ఉన్నట్లుగా సబ్బంహరి మాట్లాడుతున్నారని, ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సారేనని గుర్తు చేశారు. 2022 లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉండరని చెప్పిన సబ్బం హరి.. దాని వెనుక ఏం కుట్ర వుందో సమాధానం చెప్పాలన్నారు. బ్రేక్ ఫాస్ట్ జపాన్...మధ్యాహ్నం చైనా అంటూ రాజధానిపై చంద్రబాబు నాయుడు భ్రమలు సృష్టించారని ఎద్దేవా చేశారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దేవుని ఆశీస్సులు

‘‘ ఏపీ లో ప్రజాస్వామ్యం లేదని చెప్పే బీజేపీ నేతలు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కోసం ఏం చేశారు. తమ సొంత పనులు మినహా ప్రజల కోసం ఏమి చేయలేదు. తప్పు చేసిన నాయకులను అరెస్ట్ చేస్తే బీసీ నాయకులు అంటారా ? అంటే హత్య చేసిన వాళ్ళని.. మోసాలు చేసిన వారిని విడిచి పెట్టాలా ?’’ అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. అన్ని వర్గాలు కలిసి దాడి చేసేందుకు కుట్ర చేసినా భారతంలో అర్జునుడికి మాదిరిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దేవుని ఆశీస్సులు ఉంటాయని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

 

Back to Top