సచివాలయం: రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం ఏపీ అని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.2,600 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా చేయబోతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గత ప్రభుత్వాలన్నీ కేంద్రం ఇచ్చే గ్రాంట్ల మీదనే మౌలిక వసతులు కల్పించేవని, కానీ, సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం సొంత నిధులతో స్కూళ్లను అభివృద్ధి చేస్తోందన్నారు. సచివాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద ఆర్‌ఓ వాటర్ ప్లాంట్స్, డెస్కులు ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పన కోసం కంపెనీల ఎంపికను పూర్తి పారదర్శకంగా చేపట్టామన్నారు. ఒరిజినల్ ఎక్యూర్ట్‌మెంట్ మ్యానిఫ్యాక్చరింగ్ (ఓఈఎం) వారినే పోటీలో పాల్గొనే విధంగా టెండర్లను తయారు చేశామన్నారు. తుది జాబితాను నిర్ణయించేందుకు ఐఏఎస్ అధికారులు, ఇతర శాఖల్లోని ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజాధనాన్ని ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చుపెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నిబద్ధత, జవాబుదారీతనం, పారదర్శకత పరిపాలనలో స్పష్టంగా కనిపించాలని సీఎం వైయస్ జగన్ సూచించారన్నారు. సీఎం ఆదేశాల మేరకు టెండర్ ప్రక్రియను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌తో నాడు–నేడు పనుల్లో కొంత జాప్యం జరిగిందన్నారు. సివిల్ వర్క్స్‌ను ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఇంజినీర్లు కరోనా కాలంలో కూడా పాఠశాలలకు వచ్చి సూపర్‌వైజ్ చేశారన్నారు.