ప్రాజెక్టులపై టీడీపీ నేతలు ఎందుకు నోరుమెదపడం లేదు  

చరిత్రలో మొదటిసారిగా సోమశిలలో 78 టీఎంసీల నీరు నిల్వ 

పోతిరెడ్డిపాడు ద్వారా ఎంత నీరు తీసుకువచ్చారో తేలుద్దామా 

దేవినేని ఉమాకు మంత్రి మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సవాల్‌

నెల్లూరు : కృష్ణానదిపై తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యూలేటర్‌పై టీడీపీ వైఖరి ఏంటో చెప్పాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు ఎందుకు నోరుమెదపడంలేదని నిలదీశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్‌ మాట్లాడుతూ.. టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమా మంత్రిగా ఉన్న సమయంలో పోతిరెడ్డిపాడు ద్వారా ఎంత నీరు తీసుకువచ్చారో తేలుద్దామా అని సవాలు విసిరారు. దేవినేని ఉమా నిత్యం  అబద్దాలు చెబుతూనే ఉంటారని, అన్ని ప్రాజెక్టులు తామే కట్టామని గొప్పులు చెబుతున్నారని మండిపడ్డారు.  

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని తొలుత పెంచింది దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని, దానిని ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచుతున్నారని మంత్రి అనిల్‌ పేర్కొన్నారు. కృష్ణా నది వరద నీటిని పూర్తిగా ఉపయోగించుకుని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేశామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలంతా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో మొదటిసారిగా వైయస్ జగన్‌ నేతృత్వంలో సోమశిలలో 78 టీఎంసీల నీటిని నిల్వ చేసి చూపించామని తెలిపారు. టీడీపీ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్ పనులు కనీసం చేయలేదని, నిత్యం మాటలతోనే కాలయాపన చేశారని మంత్రి అనిల్‌ మండిపడ్డారు.
 

Back to Top