కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం

ఏపీలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదు

రాష్ట్రలో సినిమా హాళ్లు, మాల్స్‌ మూసేస్తున్నాం

పెళ్లిళ్లు వీలైతే వాయిదా వేసుకోవాలి

రవాణాశాఖ ప్రయాణికులను తక్కువగా తీసుకెళ్లాలి

ప్రజలను అనవసర భయాందోళనకు గురి చేయకండి

ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు కూడా సహకరించాలి

వైద్య, ఆరోగ్యశాఖ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలి

మంత్రి ఆళ్ల నాని

సచివాలయం: కరోనా వైరస్‌ వ్యాప్తిపై  ప్రజలెవరూ కూడా ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ఇచ్చామని చెప్పారు. ప్రముఖ ఆలయాలు, చర్చిలు, మసీదులను యథాతథంగా ఉంచుతామని,  పెద్ద దేవాలయాల్లో దర్శనాలు నియంత్రిస్తున్నామన్నారు.  కేటగిరిల మాదిరిగా గుర్తించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దశల వారీగా ఆలయాలను మూత వేయిస్తామన్నారు. ఇప్పటికే స్కూళ్లు మూత వేయించామన్నారు. ఇక సినిమా హాళ్లు, మాల్స్‌, జిమ్స్‌, క్లబ్స్‌ మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తీవ్రతను బట్టి మిగిలిన వాటిని మూత వేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.  సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. మన పొరుగు రాష్ట్రంలో 13 కేసులు నమోదు అయ్యాయి. మన ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ప్రభుత్వం ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా...ప్రజల సహకారం కూడా అవసరం. ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ ఇస్తున్న సూచనలు ప్రజలు పాటిస్తే కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ చర్యలకు అందరూ సహకరిస్తే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూడవచ్చు. నిన్న ఒంగోలులో ఒక కేసు నమోదు అయ్యింది.వైరస్‌ వ్యాప్తిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలకు, ప్రతిపక్షాలకు, మీడియాపై కూడా ఉంది. అందరం జాగ్రత్తగా ఉండాలి. ప్రధాని మోదీ కూడా ప్రజలతో మాట్లాడబోతున్నారు. కరోనా వ్యాప్తి పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విజయవాడ ఎన్టీఆర్‌ యూనివర్సిటీలో ఒక నోడల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాకు 30 మంది చొప్పున ఈ సెంటర్లో పని చేస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న వారికి జిల్లాలో ఉన్న నోడల్‌ సెంటర్లకు పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. కేంద్రం వద్ద లేని సమాచారం రాష్ట్రం వద్ద అదనంగా  6 వేలకు పైగా  మందిని గుర్తించాం. దాదాపుగా 12 వేల మందిని గుర్తించాం. వారిలో ఏదైన సిమిటమ్స్‌ ఉంటే ప్రత్యేక ఐసోలేషన్‌లో పెడుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం పైగా ఇంటింటా సర్వే నిర్వహించాం. ప్రతి ఇంటికి ఒక ఆశా వర్కర్‌, ఏఎన్‌ఎంను పంపించి విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించాం.  ప్రభుత్వ చర్యలకు సహకరించకపోతే నిర్బంధించే చర్యలు తీసుకుంటున్నాం. పెళ్లిళ్లు వీలైనంతగా వాయిదా వేసుకోవాలని, తప్పనిసరి అయితే తక్కువ మందితో నిర్వహించుకోవాలి. 

కరోనాకు సంబంధించి గతంలో రక్త పరీక్షల కోసం పూణేకు పంపించేవాళ్లం. మన రాష్ట్రంలోనే విజయవాడ, తిరుపతి, విశాఖలో ఏర్పాటు చేశాం. త్వరలో అనంతపురంలో ఏర్పాటు చేస్తున్నాం. ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేస్తున్నాం. రూమ్స్‌ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 85 వెంటిలేటర్స్‌ ఏర్పాటుచేశాం. వంద వెంటిలేటర్స్‌ అందుబాటులోకి తెస్తాం. క్రమపద్ధతిలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు సీఎం వైయస్‌ జగన్‌తో సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చిస్తున్నాం.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల భయాందోళనలను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు తీసుకుంటుంది. ప్రతిపక్ష నాయకులు కూడా ప్రజలను అనవసరమైన భయాందోళనలకు గురి చేయవద్దు. ప్రజల భయాందోళనలతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరికాదు. ఇటువంటి పనులు చేస్తే ప్రజలు కూడా క్షమించరు. ఏదైన సలహాలు, సూచనలు ఇస్తే ప్రభుత్వం స్వీకరిస్తుంది. ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలి. సహకరించే మనసు, ఉద్దేశం లేకపోతే సైలెంట్‌గా ఉండాలి. 
గత ఐదేళ్లలో చంద్రబాబు వైద్య, ఆరోగ్య శాఖను భ్రష్టుపట్టించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా అన్యాయం చేశారు. సరైన మౌలిక సదుపాయాలు, మందులు ఇవ్వకపోవడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రతిపక్షాలు అర్ధరహితంగా విమర్శలు చేయడం సిగ్గు చేటు. అందరం ఏకమై ప్రజలకు అండగా నిలవాల్సిన సమయంలో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు సిగ్గు చేటు. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డు తగలకుండా, ప్రజల ఆరోగ్యంపై చెలగాలమాడవద్దని ప్రతిపక్షాలను కోరుతున్నాం. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేయడం లేదు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రతి రోజు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి సీఎంకు ప్రజలందరూ సహకరించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు. 
 

తాజా వీడియోలు

Back to Top