విజయవాడ: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెలిగొండ ప్రాజెక్టు గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తి చేసిన ఘనత దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డిది మాత్రమేనని ఆయన అన్నారు. ప్రాజెక్టుల మీద చంద్రబాబు యుద్దం ప్రకటించాననటం హాస్యాస్పదమన్నారు.
రైతులను మోసం చేసిన రైతు ద్రోహి చంద్రబాబు అంటూ మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. రెండు టన్నెల్స్ త్వరలో ప్రారంభిస్తామని.. ప్రాజెక్టు నిర్వాసితులకు సమస్యలు పరిష్కరించిన తర్వాతే నీటిని విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. ప్రకాశం జిల్లాకు ఏమి చేశారో చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రజలు సీఎం వైయస్ జగన్ పక్షానే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు ఎన్ని వైపుల నుంచి తిరిగినా ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
గ్రాఫిక్స్ చూపించటం తప్ప చంద్రబాబు రాజధాని కట్టారా అంటూ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవస్థలపై దాడి చేసి అలజడి సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. డ్రోన్ కెమెరాల్లో వ్యూల కోసం ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డికి ప్రజల్లో ఉన్న జనాధరణను చూసి ఓర్వలేకనే పుంగనూరు ఘటనకు చంద్రబాబు పూనుకున్నారని ఆదిమూలపు సురేష్ అన్నారు.