ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో త్వరలో  స్కిల్ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

విజ‌య‌వాడ‌:  ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో త్వరలో  స్కిల్ డెవలప్‌మెంట్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఆదిమూల‌పు సురేష్‌ తెలిపారు.  గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో సోమవారం ఉదయం జనరల్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎంట్రన్స్ పరీక్షల్లో 1,2,3, స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంత్రి సురేష్, స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, ఛాన్స్‌లర్ కేసీరెడ్డి అడ్మిషన్ సర్టిఫికేట్లు అందజేశారు 

చంద్ర‌బాబు పాల‌న‌లో ట్రిపుల్ ఐటీలు నిర్వీర్యం 
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలను నిర్వీర్యం చేశారని మంత్రి ఆదిమూల‌పు సురేష్ విమ‌ర్శించారు.  ట్రిపుల్ ఐటీలకు చెందిన రూ.188 కోట్ల నిధులను పసుపు-కుంకుమ పథకానికి మళ్లించి చంద్రబాబు రాక్షస ఆనందం పొందారన్నారు.   గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విలువలతో కూడిన విద్యనందించేందుకు ట్రిపుల్ ఐటీ లకు ఏడాదికి 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అధ్యాపక సిబ్బంది సమస్యలపై గవర్నింగ్‌ కౌన్సిల్లో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ పేర్కొన్నారు.

Back to Top