కృష్ణా: నా దేశాన్ని అసమానతులు, అనారోగ్యం, పేదరికం నుంచి బయటపడేసే మంత్రదండం చదువు మాత్రమేనని చెప్పిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ ఆలోచన విధానం, భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మౌలిక వసతుల రూపకల్పన, విద్యా ప్రమాణాలు పెంచడంలో గత 16 నెలలుగా చేసిన కార్యక్రమాలు సజీవ సాక్షాలు అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ హైస్కూల్‌లో జగనన్న విద్య కానుక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ మాటాడుతూ.. ప్రతీ తల్లి తన బిడ్డను బాగా చదివించుకోవాలని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరుకుంటుంది. కానీ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అక్కచెల్లెమ్మలకు ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను’’ అని భరోసా ఇచ్చి ప్రతి ఇంటికి పెద్దన్నగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిలబడ్డారన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన పాఠశాలలు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన తలుపులు, కిటికీలకు రెక్కలు లేక, గోడ పైకప్పు పెచ్చులూడుతుంటే, మురుగుదొడ్లు లేక ఎంత దురావస్థలో ఉందో మనం చూశాం. పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలని నాడు – నేడు కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరూ లేరు.. ఒక్క జగనన్న తప్ప అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మేనమామలా పిల్లల ఆలనా.. పాలనా చూసేందుకు నేనున్నానని ప్రకటించి.. కడుపునిండా తిండికి నోచుకోని పిల్లలను అక్కున చేర్చుకొని ‘‘జగనన్న గోరుముద్ద’’ పౌష్టికాహారం పెడుతున్న ముఖ్యమంత్రిని ఎప్పటికీ నువ్వే ముఖ్యమంత్రివి అని అక్కచెల్లెమ్మలు ఆశీర్వదిస్తున్నారన్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించడం నా పుర్వజన్మ సుక్రుతం, జన్మజన్మలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు రుణపడి ఉంటానని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అమ్మ ఒడి పథకంతో తల్లుల మనసులో స్థానం సంపాదించుకున్న సీఎం.. మన బడి నాడు–నేడుతో మరింత దగ్గరైన ముఖ్యమంత్రి.. జగనన్న విద్యా కానుకతో ప్రతి ఇంటిలో మనిషి అయ్యారన్నారు. ఫీజులు పేరుతో పేదల రక్తాన్ని తాగిన కార్పొరేట్ యాజమాన్యాలపై ఉక్కుపాదం మోపి నియంత్రణ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని వెలుగెత్తి చాటిన ప్రజల మనిషి మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని గుర్తుచేశారు. చిన్నారులు అందుకుంటున్న విద్యా కానుక మేనమామ ఇస్తున్న చల్లని దీవెన అన్నారు. ప్రతి బ్యాగ్‌పై ముఖ్యమంత్రి స్వ దస్తూరితో ‘‘జగనన్న విద్యా కానుక’’ అని రాసిన కిట్ పిల్లలకు అందిస్తున్నాం. మంచి చదువులు చదివి.. రాష్ట్రానికి మంచి పేరు తేవాలి.. అదే మీరు మీ మేనమామకు ఇచ్చే కానుక అని మంత్రి సురేష్ తెలిపారు.