‘నాడు–నేడు’కు కార్పొరేట్‌ సంస్థల చేయూత

ఐదు కంపెనీలు 2,566 పాఠశాలలను దత్తత తీసుకున్నాయి

కనెక్టీవ్‌ ఆంధ్రా వెబ్‌పోర్టల్‌ ద్వారా అనేక మంది ముందుకొస్తున్నారు

ఆంగ్ల మాధ్యమంపై టీడీపీ రెండు నాలుకల ధోరణి ప్రజలు గ్రహించారు

ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడతాం

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు–నేడు కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు అనేక కార్పొరేట్‌ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు ముందుకువస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. నాడు–నేడు కార్యక్రమానికి మద్దతుగా ఐదు కార్పొరేట్‌ సంస్థలు హెటిరో, వసుధ ఫార్మా, ఆదిశిల ఫౌండేషన్, లారస్‌ ల్యాబ్స్, రెయిన్‌ కార్బస్‌ సంస్థలు 2,566 పాఠశాలలను దత్తత తీసుకున్నాయన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమక్షంలో ప్రభుత్వంతో ఈ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయ ఆవరణలో మంత్రి సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సుమారు 2,566 పాఠశాలలను ఈ సంస్థలు దత్తత తీసుకున్నాయని, రూ.88 కోట్లతో ప్రభుత్వ కార్యక్రమానికి అనుగుణంగా పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు వచ్చాయన్నారు. పశ్చిమగోదావరి, వైయస్‌ఆర్‌ కడప జిల్లా, కర్నూలు, గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లోని పాఠశాలలను అభివృద్ధి చేయనున్నాయి. పాఠశాలల్లో జూన్‌ మాసం కల్లా ఇంగ్లిష్‌ ల్యాబ్‌తో సహా.. తొమ్మిది రకాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వివరించారు.

సీఎం వైయస్‌ జగన్‌ చేపడుతున్న చక్కటి కార్యక్రమంలో భాగస్వాములమై మా స్కూళ్ల రుణం తీర్చుకుంటామని చాలా మంది ముందుకువస్తున్నారని మంత్రి సురేష్‌ తెలిపారు. కనెక్టీవ్‌ ఆంధ్రా అనే వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేశామని, సీఈఓగా శ్రీమతి కోటేశ్వరమ్మను నియమించామన్నారు. ఇంకా ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చక్కటి కార్యక్రమానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ఇచ్చిన మాట కోసం ఎంతదూరమైన వెళ్లగలిగే నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలల్లో ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనకు చంద్రబాబు వ్యతిరేకమా..? అనుకూలమా..? చెప్పాలని డిమాండ్‌ చేశారు. శాసనసభలో ఆంగ్ల మాధ్యమాన్ని అంగీరిస్తున్నామన్న చంద్రబాబు, కౌన్సిల్‌లో లోకేష్‌తో బిల్లును అడ్డుకున్నారని, తెలుగుదేశం పార్టీ రెండు నాలుకల ధోరణి ప్రజలకు అర్థమైందన్నారు. తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 

Back to Top