ఇంగ్లిష్‌ మీడియం చరిత్రాత్మక నిర్ణయం

మూడేళ్లలో పాఠశాలలన్నీ అభివృద్ధి చేస్తాం

బాబు మనవడు చదివే బ్లూ బాక్స్‌ స్కూల్‌లో తెలుగు లేదు

రైటు టు ఇంగ్లిష్‌ ఎడ్యుకేషన్‌ సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆంధ్రరాష్ట్రంలో ప్రారంభించిన ఘనత వైయస్‌ జగన్‌కే దక్కిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. నాడు – నేడు కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి సురేష్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అందించాలని నాడు – నేడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తూ చరిత్రాత్మక ఘట్టానికి ఒంగోలు వేదిక అయ్యిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు సమూలంగా మార్పు చేయాలని జగనన్న చేపడుతున్న విప్లవాత్మక కార్యక్రమం మన బడి, నాడు – నేడు అని, సుమారు రూ. 10 వేల కోట్లతో ఈ కార్యక్రమం దశలవారీగా మూడేళ్ల పాటు కొనసాగుతుందన్నారు. అమలుకు ముందు, అమలు తరువాత ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని ఫొటోలతో సహా ప్రజల ముందుంచుతామన్నారు.

ప్రజా సంకల్పయాత్రలో పాఠశాలల వసతులు, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు చేయాలనే ఆలోచన ఆ నాడే రూపకల్పన అయ్యిందన్నారు. ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని వివరించారు. ఐదు నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నత విద్యను పేదలకు ఫీజురియంబర్స్‌మెంట్‌ ద్వారా అందించారని, ఆయన తనయుడు సీఎం జగనన్న రెండు అడుగులు ముందుకేసి పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటు చేసిన చరిత్రాత్మకఘట్టం దేశంలో ఎక్కడా లేదన్నారు. వైయస్‌ఆర్‌ ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చాలనే ధృడసంకల్పంతో విద్యకు మన ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.

విద్యాశాఖకు రూ.33 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయన్నారు. పెద్ద మొత్తంలో నాడు–నేడు, జగనన్న అమ్మఒడికి ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వమన్నారు. ‘రైట్‌ టు ఇంగ్లిష్‌ ఎడ్యుకేషన్‌’ అని చారిత్రాత్మకమైన నిర్ణయానికి సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారన్నారు. చారిత్రాత్మక ఘట్టంలో దళిత బిడ్డనైన నేను భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు మనవడు బ్లూ బ్లాక్స్‌ స్కూల్‌లో చదువుతున్నాడు అందులో తెలుగుమీడియం లేదు.. రాజ్యాంగ పదవిలో ఉన్న పెద్దలు ఏర్పాటు చేసిన స్వర్ణభారతి ట్రస్టు, పత్రికాధినేత ఏర్పాటు చేసుకున్న స్కూళ్లలో తెలుగు మీడియం ఉందా.. లేదా అని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం రాజకీయం కోసం పేదలకు ఆంగ్ల మాధ్యమం అందకూడదని కుట్రలు చేస్తున్నారన్నారు. ఏదైనా చెప్పాలనుకుంటే ఆచరణ చేసి చూపించమనే సిద్ధాంతాన్ని సీఎం వైయస్‌ జగన్‌ నమ్మారని, తన బిడ్డలతో పాటు రాష్ట్రంలోని 70 లక్షల మంది పిల్లలు ఇంగ్లిష్‌ మీడియం చదవాలని ధైర్యమైన నిర్ణయం తీసుకోవడం జగనన్నకే సాధ్యమైందన్నారు.

Read Also: సుప్రభాతం సంస్కృతంలో ఉంటుందని ఆ జ్ఞానికి తెలియదు

Back to Top