‘మన బడి – మన బాధ్యత’తో పాఠశాలల అభివృద్ధి

తల్లిదండ్రుల కమిటీల ఎన్నిక ప్రశాంతంగా జరిగింది

అక్టోబర్‌ నెలాఖరికి కమిటీలకు శిక్షణ ఇచ్చి పటిష్టం చేస్తాం

పదో తరగతి వార్షిక పరీక్షల్లో బిట్‌ పేపర్‌ తీసేశాం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

 

అమరావతి: మన బడి– మన బాధ్యత అనే నినాదంతో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం, విద్యాశాఖ శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రుల కమిటీలు ప్రధాన భూమిక పోషించనున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,635 పాఠశాలలకు గాను సుమారు 45,390 స్కూళ్లు అంటే 97.33 శాతం పేరెంట్స్‌ కమిటీ ఎన్నిక పూర్తి చేయడం జరిగిందన్నారు. విద్యా హక్కు చట్టంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టబోయే కార్యక్రమాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సుమారు అన్ని చోట్ల కమిటీ ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించామన్నారు. 28వ తేదీ లోపు మిగిలిన స్కూళ్లలో కూడా ఎన్నిక పూర్తిచేస్తామన్నారు. సుమారు 35,855 పాఠశాలల్లో ఎన్నిక ఏకగ్రీవం అయిందని, మిగిలిన 14,535 చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగాయన్నారు.

అక్టోబర్‌ మాసంలో దసరా పండుగ సెలవుల తరువాత తల్లిదండ్రుల కమిటీలకు శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టి పటిష్టం చేస్తామన్నారు. కమిటీ సభ్యుల బాధ్యతలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ఏకరూప దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు, సైకిళ్లు, మధ్యాహ్న భోజన పథకం వీటన్నింటిపై సమగ్ర అవగాహన కల్పిస్తామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల రూపకల్పనకు 46 వేల స్కూళ్లలో ఇప్పుడున్న స్థితి, రెండేళ్ల తరువాత స్థితి ఏ విధంగా మార్చామనేది నాడు– నేడు అనే కార్యక్రమం ద్వారా తల్లిదండ్రుల కమిటీలపై ఆధారపడతామని వివరించారు. తల్లిదండ్రుల కమిటీ ద్వారా చేపట్టబోయే కార్యక్రమానికి మన బడి–మన బాధ్యత ట్యాగ్‌ లైన్‌ నాడు–నేడు అని నిర్ణయించామన్నారు. దసరా సెలవుల తరువాత శిక్షణ ఇచ్చి కమిటీలను పటిష్టం చేస్తామని వివరించారు. విద్యాశాఖకు సంబంధించిన అంశంలో ఈ కమిటీలు ప్రధాన భూమిక పోషించనున్నాయని మంత్రి పేర్కొన్నారు.  

ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్యాశాఖలో నూతన సంస్కరణలు చేపట్టామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వివరించారు. 10వ తరగతి ప్రశ్నాపత్రంలో మార్పులు చేశామన్నారు. ఇంతకు ముందులా ప్రశ్నాపత్రంలో బిట్‌ పేపర్‌ వేరుగా ఉండదని, ప్రశ్నాపత్రంలోనే వందమార్కులు ఉంటాయన్నారు. కార్పొరేట్‌ స్కూళ్లకు బిట్‌ పేపర్‌ కలిసొస్తుందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అందుకే నూతన సంస్కరణలు తీసుకురావడం జరిగిందని వివరించారు.

 

Back to Top