మహిళా రక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది

హోంమంత్రి సుచరిత
 

గుంటూరు: మహిళా రక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని  రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవద్దని, ఏదైనా ఘటన జరగగానే దాన్ని మానవతా దృక్పథంతో చూడకుండా కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.  

రాష్ట్రపతి నుంచి ఆమోద ముద్ర లభించిన మరు క్షణం నుంచి రాష్ట్రంలో దిశ చట్టం అమలులోకి వచ్చేలా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దిశ చట్టం ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపాం. కేంద్రం వ్యక్తం చేసిన అభ్యంతరాలకు కూడా  సమాధానం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రిగారు మహిళా భద్రతపై చిత్తశుద్ధితో ఉన్నారు కాబట్టే రాష్ట్రంలో మహిళల భద్రతకు దిశ లాంటి గొప్ప చట్టాన్ని తెచ్చారు. మహిళల భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డిగారు ఇన్ని చర్యలు తీసుకుంటుంటే.. ఇలాంటి సమయంలో దిశ చట్టాన్ని శంకిస్తూ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, రక్షణ కరువైందంటూ స్టేషన్ల వద్ద టీడీపీ ధర్నాలు చేయడం బాధాకరమైన విషయం. 

 దిశ ఎస్‌వోఎస్‌ యాప్‌ ద్వారా పోలీసులు... ఇటీవలే పల్నాడులో ఓ యువతిని, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా మహిళలు, యువతులు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని వాళ్ల ఇళ్ళ దగ్గర సురక్షితంగా చేర్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆటో డ్రైవర్‌ ఇబ్బంది పెట్టిన ఘటనల్లో దిశ యాప్‌ ద్వారా వారిని రక్షించగలిగాం. సోషల్‌ మీడియా ద్వారా పరిచయమై స్నేహం చేయాలంటూ వేధించిన వారిని ఈ యాప్‌ ద్వారా రక్షించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. దిశ యాప్‌ ద్వారా రక్షణ పొందిన ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు.

 మహిళల భద్రత కోసం చిత్తశుద్ధితో దిశ చట్టాన్ని తీసుకొచ్చి, మహిళలకు భరోసా ఇస్తున్న ఆ చట్టాన్ని  టీడీపీ నేతలు అవహేళన చేయటం తగదు. మహిళల భద్రతకు ఎంతగానో ఉపకరిస్తున్న ఈ చట్టాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడటం సరికాదు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఓ ఘటనకు చలించిపోయిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు.. దిశ బిల్లును అసెంబ్లీలో పెడితే.. ఆరోజు కూడా  మీరు ఎలా స్పందించారో ఒకసారి ఆలోచించుకోవాలి. మహిళా భద్రత మీద మీకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో దిశ చట్టాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడటాన్ని చూస్తేనే అర్థం అవుతుంది. మహిళల భద్రత కోసం తెచ్చిన దిశ చట్టాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ ఏ ఘటన జరిగినా తెలుగుదేశం పార్టీ దాని ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారే తప్ప, మానవతా దృక్పథంతో ఆలోచించడం లేదు. 

  టీడీపీ అధికారంలో ఉండగా మహిళా తహసీల్దార్ వనజాక్షిపై, ఆ పార్టీ ఎమ్మెల్యే దాడి చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు మహిళలపై దాడి జరిగితే.. ఏడు రోజుల్లోనే ఛార్జ్​షీట్ వేస్తున్నాం. దిశ చట్టం ఇంకా అమలులోకి రాకపోయినా అదే స్పూర్తితోనే పని చేస్తున్నాం. మహిళల రక్షణ కోసం సలహాలిస్తే స్వీకరిస్తాం. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు. ఇప్పటికైనా మహిళల భద్రత విషయంలో అపహాస్యం చేసే ధోరణిని టీడీపీ మానుకోవాలి.

 దిశ చట్టం ద్వారా 1500 కేసుల్లో ఏడు రోజుల్లోనే చార్జ్‌షీట్లు వేశాం.  దిశ యాప్‌ను దాదాపు 40లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దిశ యాప్‌ ద్వారా తమకు రక్షణ లభించిందని రాష్ట్ర నలుమూలల నుంచి మహిళల నుంచి నిత్యం ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. 

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అమలు చేస్తున్న సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలు అందరూ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా భద్రత కోసం చిత్తశుద్దితో దిశ చట్టాన్ని తెచ్చాం. ఆ చట్టం ఇంకా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదముద్ర పొందకముందే దానికి కావాల్సిన పోలీస్‌ స్టేషన్‌లు, చార్జ్‌షీట్‌ వేయడానికి కావాల్సిన నివేదికలు త్వరితగతిన రావడానికి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకుంటున్నాం. న్యాయమూర్తులను నియమించుకునే విషయంలోనూ, చట్టం అమలు అయ్యే నాటికి కావాల్సిన ఏర్పాట్లును ముందుగానే ఈ ప్రభుత్వం చేస్తోంది. దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటుతోపాటు 900 పెట్రోలింగ్‌ వెహికల్స్‌ కూడా అందించాం.

మహిళలకు భద్రత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం దాన్ని స్వాగతించకుండా అవహేళన చేస్తున్నారు.  అధికారంలో ఉన్నప్పుడు మహిళల భద్రతను గాలికొదిలేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు మహిళలకు భద్రత కల్పించాలంటూ దిశ పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్నాచేయడం సిగ్గుచేటు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top