అమరావతి: ఇందాపూర్ డెయిరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ డెయిరీ చీకటి ఒప్పందం చేసుకుందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దేవదేవుడి ప్రసాదంపై అసత్యాలు ప్రచారం చేశారని.. ఎలాంటి కొవ్వు లేదని సీబిఐ తేల్చిందని అన్నారు. ఇందాపూర్ డెయిరీపై చర్చకు వైయస్ఆర్‌సీపీ సభ్యులు శాసన మండలిలో ఆందోళన చేపట్టారు. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే మండలి రేపటికి వాయిదా వేశారు. అనంతరం ఆయన శాసనమండలి మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ... ఇందాపూర్ ద్వారా దోచుకోవాలని చంద్రబాబు దుర్భుద్ధి అంటూ దుయ్యబట్టారు. హోంమంత్రి వచ్చి ఏదోదో మాట్లాడుతున్నారు. మేం కూడా వాస్తవాలు తేల్చాలనే సభలో చర్చించమని కోరుతున్నామని బొత్స అన్నారు. ఇందాపూర్, హెరిటేజ్‌పై చర్చించాల్సిందే ‘‘సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక డొల్ల బడ్జెట్ పెట్టారు. హెరిటేజ్ సంస్థ ఇందాపూర్‌తో చీకటి ఒప్పందం చేసుకుంది. దోచుకోవడమే హెరిటేజ్ ఆలోచన. ఎందుకు సభలో చర్చించడానికి ఈ ప్రభుత్వానికి భయం. సభలో బడ్జెట్‌తో పాటు ఇందాపూర్, హెరిటేజ్‌పై చర్చించాల్సిందే. ఏ వర్గం అవసరాలు తీర్చలేని బడ్జెట్ ఇది. మేం చర్చించాలని కోరితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేం చెప్పిన దాంట్లో అవాస్తవాలుంటే వాస్తవాలు తేల్చడానికి చర్చకు రండి. మేం ఆధారాలతో సహా నిరూపిస్తాం’’ అంటూ బొత్స సవాల్ విసిరారు. రేపటిరోజైనా చర్చించేందుకు రండి ‘‘వివరణలు ఇచ్చే బదులు చర్చకు రావొచ్చు కదా. దోచుకోవడమే మీ ఏకైక లక్ష్యం. 320కి కొనుగోలు చేసే నెయ్యి 700 కి పెంచడం వెనుక కారణం తెలియాలి. పాల రేటు అప్పట్లో తక్కువ ఇప్పుడు పెరిగిందంటున్నారు. ఏ సంవత్సరంలో పాల రేటు ఎంతో చర్చపెట్టండి. టీడీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి. చంద్రబాబు, పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలి. ఈ దోపిడీని బీజేపీ నేతలు సమర్థిస్తారా?. చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. రైతులు గిట్టుబాటు ధరల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు భృతి కోసం ఉద్యోగాల కోసం చూస్తున్నారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం చూస్తున్నారు. హెరిటేజ్‌కు దోచిపెట్టడానికే ఇందాపూర్‌ను తెచ్చారు. ఇందాపూర్‌ను అడ్డుపెట్టుకుని హెరిటేజ్‌కు దోచిపెట్టాలని చూస్తున్నారు. గతంలో లడ్డూ ఇస్తే కళ్లకు అద్దుకుని తీసుకునేవారు. ఇప్పుడు లడ్డూ ఇస్తే పరిశీలించి చూసి తింటున్నారు. నాయకుల సంపద మాత్రమే పెంచుకుంటున్నారు ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రలోభాలకు ఆశపడి మా పార్టీని వదిలిపోయారు. లోకేష్ తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు. మేం పట్టుకోల్పోయామనే భావనలో ఆయన ఉంటే ఉండనివ్వండి మాకు ఎలాంటి నష్టం లేదు. హోంమంత్రి ఆమెకు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఇందాపూర్‌తో లాలూచీపడి దోచుకోవాలని హెరిటేజ్ సంస్థ చూస్తోంది. మేం చెప్పేది అబద్ధమైతే చర్చకురండి. వైయస్ఆర్‌సీపీ పరిపాలనలో లోపం ఉంటే ఈ ప్రభుత్వంలో ఆదాయం పెరగాలి కదా. సంపద సృష్టిస్తామని చెప్పి.. వారి నాయకుల సంపద మాత్రమే పెంచుకుంటున్నారు. హెరిటేజ్‌కు లాభం చేకూర్చడానికి చంద్రబాబు కుటుంబ ధనార్జన కోసం మహాపాపం చేశారు’’ అని బొత్స పేర్కొన్నారు.