నిరుపేద వధూవరులకు అండగా 'జగన్ చారిటబుల్ ట్రస్ట్'

48 జంట‌ల‌కు బంగారు తాళిబొట్ల పంపిణీ

శ్రీకాళహస్తి: నిరుపేద వధూవరులకు `జగన్ చారిటబుల్ ట్రస్ట్‌` అండ‌గా నిలిచింది.  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కాళ‌హ‌స్తి ఆల‌యంలో నిర్వహించిన స్వామి–అమ్మవార్ల కళ్యాణోత్సవ సందర్భంగా గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరోసారి నిలబెట్టారు.

జ‌గ‌న్ చారిట‌బుల్ ట్ర‌స్ట్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా 48 మంది నిరుపేద నూతన వధూవరులకు ఉచితంగా బంగారు తాళిబొట్లు, నూతన వస్త్రాలను అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వివాహాలు నిర్వహించడంలో కష్టాలు పడుతున్న కుటుంబాలకు ఇది పెద్ద అండగా మారిందని లబ్ధిదారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి హాజరై నూతన వధూవరులకు బంగారు తాళిబొట్లు పంపిణీ చేశారు. గత 20 సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాల పెళ్లిళ్లకు చేయూత అందించడం ఈ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడడం గర్వకారణమని చెప్పారు. కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉన్నం వాసుదేవ నాయుడు, చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, షేక్ సిరాజ్ భాష, పఠాన్ ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పలువురు వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 
 

Back to Top