కర్నూలు జిల్లా: కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తోందని ఆలూరు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మండిపడ్డారు. ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం మార్లమడికి గ్రామంలో వేదవతి హగిరిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇక్కడ టీడీపీ నాయకులు ఒక్క ఇసుక ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున దందా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టినప్పటికీ, కింది స్థాయి టీడీపీ నాయకులు మాత్రం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ట్రాక్టర్ డ్రైవర్లు చెబుతున్న వివరాల ప్రకారం, ఒక్క ట్రిప్ ఇసుకకు రూ.500 చెల్లించకపోతే బయటకు పంపడం లేదని తెలిపారు. మండల అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉండిపోతున్నారని, రోజుకు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు దందా జరుగుతోందని ఆరోపించారు. ఈ అక్రమ వసూళ్ల డబ్బులు ఎవరికి చేరుతున్నాయో తెలియడం లేదని, లోకేష్‌కు , స్థానిక టీడీపీ ఇన్‌చార్జ్‌లకు ముడుతున్నాయో అనుమానం వ్యక్తం చేశారు. ఇల్లు కట్టుకోవడానికి ఇసుక కావాలంటే టీడీపీ కండువా వేసుకుంటే ఎంతైనా తీసుకెళ్లవచ్చని, లేకపోతే ట్రాక్టర్ సీజ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థానిక ఎస్‌ఐ టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోకుండా సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం అవసరమైతే ఇసుక దందా ఆగేంత వరకు అక్కడే ధర్నా చేస్తానని హెచ్చరించారు. ప్రజలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇసుక దందా విషయాన్ని ఆదోని సబ్‌కలెక్టర్‌కు తెలియజేశామని, వెంటనే చర్యలు తీసుకుంటామని సబ్‌కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.