అర్ధ‌రాత్రి ద‌య్యాలొచ్చి ఓటేశాయా? 

 11.45 నుంచి 2 గంట‌ల మ‌ధ్య గంట‌కు 400 ఓట్లు పోల‌య్యాయి

ఒక్కొక్క‌రూ ఆరు సెక‌న్ల‌లో రెండు ఓట్లు వేయ‌డం సాధ్య‌మేనా? 

ఎన్నిక‌ల క‌మిష‌న్‌కి మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ సూటి ప్ర‌శ్న‌లు 

అనంత‌పురం లోని పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ 

సాయంత్రం వ‌రకు గంట‌కు పోలైన ఓట్లు 60 మాత్ర‌మే

సాయంత్రం 5 గంట‌ల‌కు న‌మోదైన పోలింగ్ 68 శాతం

రాత్రి 8 గంట‌ల నుంచి 11.45 వ‌ర‌కు న‌మోదైన పోలింగ్ 0.0008 శాతం

ఆ స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలైన ఓట్లు 35 వేలు 

కానీ 11.45 నుంచి 2 గంట‌ల మ‌ధ్య 3500 పోలింగ్ కేంద్రాల్లో 17 ల‌క్ష‌ల ఓట్లు న‌మోదు 

రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల స‌ర‌ళిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర అనుమానాలు

నివృత్తి చేయాల్సిన బాధ్య‌త కేంద్ర ఎన్నిక‌ల సంఘానిదే

ఎన్నిక‌ల సంఘం త‌న నిజాయితీని నిరూపించుకోవాలి

డిమాండ్ చేసిన మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్‌

అనంత‌పురం: ఏపీలో 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అర్ధ‌రాత్రి 11.45 నుంచి 2 గంట‌ల మ‌ధ్య భారీ ఎత్తున పోలింగ్ న‌మోదు కావ‌డం తీవ్ర అనుమానాల‌ను రేకెత్తిస్తోంద‌ని.. ఎన్నిక‌ల‌ స‌ర‌ళిపై ప్ర‌జ‌ల్లో ఎన్నో అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నిక‌ల సంఘంపైనే ఉంద‌ని మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ డిమాండ్ చేశారు. అనంత‌పురం లోని  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ దేశ చ‌రిత్ర‌లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఎన్నిక‌ల క‌మిష‌న్ వ్య‌వ‌హార‌శైలిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని, వాటిని నిజం చేసేలా ఈసీ వ్య‌వహార శైలి కూడా ఉంద‌ని మండిప‌డ్డారు. వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను కాల్చేయ‌డం, సీసీ టీవీ ఫుటేజ్‌లు అడిగితే ఇవ్వ‌క‌పోవ‌డం వంటి విధానాలు చూస్తుంటే ఏదో జ‌రిగింద‌నే అనుమానాల‌కు బ‌లం చేకూరుస్తోంద‌ని, దీంతోపాటు ఎన్‌డీఏ ప్ర‌భుత్వం ఎన్నికల క‌మిష‌న్‌కి విశేష అధికారులు క‌ట్ట‌బెట్ట‌డం, వారు ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత కీల‌క ప‌ద‌వుల్లో నియ‌మించ‌డంపై ప్ర‌జ‌ల్లో అనుమానాలున్నాయ‌ని చెప్పారు. బ్యాలెట్ పేప‌ర్ల‌తో ఎన్నిక‌లు నిర్వ‌హించిన రోజుల్లోనే సాయంత్రానిక‌ల్లా తుది పోలింగ్ శాతం వెల్ల‌డించేవార‌ని, కానీ ఈవీఎంల‌తో ఎన్నిక‌లు నిర్వ‌హించినా మూడు త‌ర్వాత తుది పోలింగ్ శాతం ప్ర‌క‌టించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. పైగా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన పోలింగ్ శాతానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన దానికి కూడా తేడా ఉంద‌ని గుర్తుచేశారు. ఎన్నిక‌ల సంఘం ప్ర‌జ‌ల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేసి నిజాయితీని నిరూపించుకోవాల‌ని సాకె శైల‌జానాథ్ డిమాండ్ చేశారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే..

● వీవీ ప్యాట్ స్లిప్‌లు ఎందుకు కాల్చేశారు

ఏపీలో 2024లో జ‌రిగిన‌ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసి ఇప్పుడు అధికారంలో ఉన్న కూట‌మి పార్టీలు అడ్డ‌దారిలో గెలుపును దొంగిలించాయి. రెండేళ్ల‌వుతున్నా రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియపై ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న అనుమానాల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ నివృత్తి చేయ‌క‌పోవ‌డంతో ఇంకా కొత్త అనుమానాలు క‌లుగుతున్నాయి. మేథావులు ఆధారాల‌తో స‌హా ఎన్నిక‌ల ప్ర‌క్రియ లోప‌భూయిష్టంగా జ‌రిగింద‌ని చెబుతున్నారు. వీవీ ప్యాట్ల‌ను వారం రోజుల్లో కాల్చేశారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై సీసీ టీవీ ఫుటేజ్‌లు ఇవ్వ‌లేదు. స్వతంత్రంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ఎన్నిక‌ల సంఘాన్ని ఎన్‌డీఏకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ప్ర‌జ‌ల్లో ఎన్నో అనుమానాలున్నాయి. ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న అనుమానాల‌ను నివృత్తి చేయాల్సిన బాధ్య‌త కేంద్ర ఎన్నిక‌ల సంఘంపైనే ఉంది. 

● మూడురోజుల త‌ర్వాత తుది పోలింగ్ శాతం ప్ర‌క‌ట‌న‌

మే నెల 13వ తేదీ ఎన్నిక‌లు జ‌రిగితే 5 గంట‌ల‌కు 68.04 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్టు ఏపీ ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. అప్ప‌టికే క్యూలైన్ల‌లో ఉన్న వారు ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌చ్చ‌ని చెప్పారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా తుది ఓటింగ్ శాతం 80.66 శాతంగా ఎస్ఈసీ ప్ర‌క‌టించింది. వారు చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం రాత్రి 11.45 నుంచి తెల్ల‌వారుజామున 2 గంట‌ల మ‌ధ్య రెండు గంట‌ల్లో ఈ భారీ పోలింగ్ న‌మోదైన‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రాత్రి 8 గంట‌ల నుంచి 11.45 గంట‌ల మ‌ధ్య 0.0008 పోలింగ్ మాత్ర‌మే న‌మోదైంద‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం ముగిసినప్ప‌టి నుంచి అర్థ‌రాత్రి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా కేవ‌లం 35 వేల ఓట్లు పోలైన‌ట్టు లెక్క‌లు చెబుతున్నాయి. ఉద‌యం జ‌రిగిన పోలింగ్ ని బ‌ట్టి చూస్తే గంట‌కు 60 ఓట్లు పోల‌వ్వ‌గా, అర్థ‌రాత్రి మాత్రం గంట‌కు 400ల‌కుపైగా ఓట్లు ఎలా పోల‌య్యాయో అర్థం కావ‌డం లేదు. అది కూడా 3,500 పోలింగ్ బూత్‌ల‌లో 17 ల‌క్ష‌ల‌కు పైగా ఓట్లు పోల‌య్యాయంటే ఎలా అర్థం చేసుకోవాలి? కేవలం ఆరు సెకన్లలో ఒక ఓటరు రెండు ఓట్లు (శాసనసభకు ఒకటి.. లోక్‌సభకు ఒకటి) వేయగలరా? దాదాపు 45 లక్ష‌ల‌కు పైగా ఓట్లు తేడా వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌లు ముగిసిన మూడు రోజుల త‌ర్వాత 81.88 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్టు ప్ర‌క‌టించ‌డంపైనా ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఏపీ ఎన్నిక‌ల సంఘం 80.66 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్టు ప్ర‌క‌టిస్తే, కేంద్ర ఎన్నిక‌ల సంఘం మాత్ర‌మ 81.88 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్టు ప్ర‌క‌టించింది. ప్ర‌జాస్వామ్యానికి జ‌రిగిన అన్యాయానికి ఎవ‌రు స‌మాధానం చెబుతారు? బ్యాలెట్ పేప‌ర్లు వాడే రోజుల్లోనే అర్థ‌రాత్రిక‌ల్లా తుది పోలింగ్ శాతం వ‌చ్చేది. కానీ టెక్నాల‌జీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మాత్రం తుది శాతం ప్ర‌క‌టించ‌డానికి మూడు రోజులు స‌మ‌యం తీసుకున్నారు. ఎన్‌డీఏ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల క‌మిష‌న్‌కి అసాధార‌ణ‌మైన అధికారాలు క‌ట్ట‌బెట్ట‌డంతోపాటు వారు కోర్టుల ప‌రిధిలోకి రాకుండా చ‌ట్టం చేయ‌డంపైనా ప్ర‌జ‌ల్లో అభ్యంత‌రాలున్నాయి. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఎన్నిక‌ల క‌మిష‌న్ స‌భ్యుల‌ను వేరే ప‌దవుల్లో నియ‌మించ‌డం ఈ అనుమానాల‌కు మ‌రింత బ‌లం చేకూరుస్తున్నాయి. ఎన్నిక‌ల క‌మిష‌న్ వ్య‌వ‌హారశైలిపై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ప్ర‌జాస్వామ్యంపై ప్ర‌జల్లో ఉన్న న‌మ్మ‌కం స‌న్న‌గిల్లుతున్న త‌రుణంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనుమానాలు నివృత్తి చేయాలి.

Back to Top