అనంతపురం: అమరావతితోపాటు వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకి ఉంటే తక్షణం రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసి చిత్తశుద్ధిని చూపించాలని అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ పనులు చంద్రబాబు ఆపేసినట్టు తేలిపోయిందని చెప్పారు. రేవంత్ రెడ్డి మాటలను ఖండించాల్సిన చంద్రబాబు, 20 టీఎంసీల కోసం ఎందుకంత రాద్ధాంతం అని మాట్లాడటం రాయలసీమకు వెన్నుపోటు పొడవడమేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి రాయలసీమ లిఫ్టు పెండింగ్ పనులు పూర్తి చేసే వరకు ఊరుకునేది లేదని, రాజకీయాలకు అతీతంగా సాగునీటిరంగ నిపుణులు, మేధావులు, రాయలసీమ ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వారు హెచ్చరించారు. వారు ఇంకా ఏమన్నారంటే... ● రేవంత్‌రెడ్డికి రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు : అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పక్క రాష్ట్రాల్లో నిర్మాణం జరుగుతున్న అక్రమ ప్రాజెక్టుల కారణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచి అదనంగా 17 టీఎంసీల నీటిని తరలించుకుపోతే, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎం కాగానే కర్నాటక రాష్ట్రం ఆల్మట్టి ఎత్తును 524 మీటర్లకు పెంచే పనులు చకచకా చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం జరుగుతున్న అక్రమ ప్రాజెక్టుల కారణంగా రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించుకుపోతున్నారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగేలా వ్యవహరిస్తున్నాడు. కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ అభివృద్ధి గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి గారు సీఎం అయ్యాకనే గాలేరు-నగరి, వెలిగొండ, హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టులను చేపట్టి ముందుకు తీసుకెళ్లాడు. శ్రీశైలం డ్యామ్‌పై ఆధారపడి ఉండే ఈ ప్రాజెక్టుల్లో తగినంత నీళ్లు ఉండాలంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు చాలా ముఖ్యం. దివంగత వైయస్సార్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని 11వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కుల పెంచారు. ఆయన తర్వాత వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు రాయలసీమ గురించి పట్టించుకున్న ముఖ్యమంత్రి లేడు. 2019లో వైయస్ జగన్ సీఎం కాగానే రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చే 40 రోజుల సమయంలో నీటిని తరలించాలనేది రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు లక్ష్యం. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ. 990 కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు పూర్తి చేయడం జరిగింది. కానీ 2024లో చంద్రబాబు సీఎం అయ్యాక రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పూర్తిగా పక్కన పెట్టేశారు. పర్యావరణ అనుమతులు లేవనే సాకు చూపించి పక్కన పెట్టేశారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ తాను కోరడం వల్లే చంద్రబాబు రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపేశాడని చెప్పడమే కాకుండా దానికి నిజనిర్ధారణ కమిటీ వేయడానికి సిద్ధమని ప్రకటించాడు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం చంద్రబాబు రాయలసీమ రైతుల భవిష్యత్తును తాకట్టుపెట్టాడు. కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి మాటలను చంద్రబాబు ఖండించలేదు. పైగా 20 టీఎంసీల కోసం అంత రాద్ధాతం అవసరమా అన్నట్టు చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు. తెలంగాణ ప్రాజెక్టులన్నీ పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవడం గగనమే అవుతుంది. అప్పుడు రాయలసీమ ప్రాజెక్టులకు చుక్క నీరు కూడా రావడం అసాధ్యం. రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం కారణంగా రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడింది. అందుకే రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణం పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ నాలుగు జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మేలు జరుగుతుంది. ఈ ప్రాజెక్టుపై పార్టీ తరఫున ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ఇప్పటికే చలో పొతిరెడ్డిపాడు కార్యక్రమం కర్నూలు జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో మేథావులు, సాగునీటి రంగ నిపుణులతో కలిసి వైయస్ఆర్‌సీపీ ఉద్యమిస్తుంది. ● ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలి : బోరెడ్డి నరేష్ కుమార్ రెడ్డి, అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు చంద్రబాబు చేస్తున్న మోసాలపై ఇప్పుడు ఉద్యమించకపోతే రాబోయే రోజుల్లో రాయలసీమకు సాగునీరే కాదు.. కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితి రాబోతుంది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు తన హయాంలో ప్రారంభించి పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టు ఒక్కటీ లేదు. సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి వచ్చినప్పుడు రకరకాల సాకులు చూపించి ప్రాజెక్టు సాధ్యంకాదని చెప్పించి తప్పించుకుంటాడు. గతంలో చంద్రబాబు సాధ్యం కాదన్న ప్రాజెక్టులనే వైయస్సార్, వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రులుగా పూర్తి చేసి చూపించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులే దీనికి నిదర్శనం. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే రాయలసీమకు నీరిస్తామని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నాడు. ప్రభుత్వ విధానాలు చూస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు. చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టే చర్యలను మానుకోవాలి. అమరావతితోపాటు రాయలసీమలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందేలా సహకరించాలి. ● జగన్ మీద కోపంతోనే ప్రాజెక్టు నిర్వీర్యం - వై విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం చంద్రబాబు రాయలసీమ ప్రయోజాలను తాకట్టు పెట్టారని తేలిపోయింది. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేసేలా కూటమి ప్రభుత్వంపై వైయస్ఆర్‌సీపీ ఒత్తిడి తెస్తుంది. మేథావులు, సాగునీటి రంగ నిపుణులతో కలిసి ఉద్యమిస్తుంది. రాయలసీమ ప్రాజెక్టు ఆవశ్యకతపై అందరికీ అవగాహన కల్పిస్తాం. ప్రాజెక్టును పూర్తిచేయకపోతే రాయలసీమకు కలిగే నష్టాన్ని వివరిస్తాం. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తే వైయస్ జగన్‌కి మంచి పేరొస్తుందనే కుట్రతోనే చంద్రబాబు సీఎం అయిన వెంటనే 80 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టును పూర్తిగా పక్కనపడేశాడు. చంద్రబాబు వైఖరి కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడితే రాయలసీమకు తాగునీరు కూడా దొరకని దుర్భర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందని, విజనరీనని చెప్పుకునే చంద్రబాబు.. తాను పుట్టిన రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాడు. గాలేరు-నగరి, హంద్రీనీవాకు లింక్ ప్రాజెక్టును పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా అనంతపురం, కర్నూలు జిల్లాలకు నీరందించవచ్చు. దాన్ని కూడా వైయస్ జగన్ గారు ప్రారంభించారనే కోపంతోనే చంద్రబాబు పక్కనపెట్టేశాడు. ● కూటమి పాలనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం : సాకె శైలజానాథ్, మాజీ మంత్రి రాయలసీమ ప్రయోజనాల విషయంలో కూటమి ప్రభుత్వం శత్రుభావంతో వ్యవహరిస్తుంది. ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి కేటాయించిన ఎయిమ్స్, హైకోర్టు లాంటి ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా అమరావతికి తరలించేశారు. తాను కోరడం వల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశాడని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలతో ఇది మరోసారి రుజువైంది. తాను చేసిన పనికి రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందిపోయి, ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఏమీ లేదని చంద్రబాబు అడ్డగోలుగా వాదిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ ప్రాజెక్టులతో రోజూ 8 టీఎంసీల నీటిని తోడేస్తుంటే ఆయన నోరు మెదపడం లేదు. రాయలసీమ బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టి ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేసేలా వ్యవహరిస్తుంటే వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదు. చంద్రబాబుకి రాయలసీమ మీద ప్రేమ ఉంటే తక్షణం రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టును పక్కన పెట్టడం దుర్మార్గం. చంద్రబాబు పట్టించుకోకపోతే పార్టీలకు అతీతంగా ప్రభుత్వంపై ఉద్యమిస్తాం.