శ్రీకాకుళం: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడి అసమర్ధత వల్లే ఎరువులు బ్లాక్ మార్కెట్‌లోకి తరలివెళ్తున్నాయని వైయస్ఆర్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. ఉచిత పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని, వంశధార కాలువ ద్వారా టెక్కలి నియోజకవర్గంలోని కాలువ శివారు ప్రాంతాలకు సాగునీరు అందించాలని, ఎరువులను తక్షణమే రైతులకు అందజేయాలని కోరుతూ టెక్కలి లో సోమవారం వైయస్ఆర్‌షీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఈ ప్రదర్శనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా రైతులు లెక్క చేయకుండా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అనంతరం వందలాదిమంది ర్యాలీగా వెళ్లి టెక్కలి ఆర్డిఓ కృష్ణమూర్తి కి రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఎరువుల వ్యాపారులు ఎరువులను బ్లాక్ మార్కెట్లో తరలిస్తూ కుత్రిమ కొరత సృష్టిస్తున్నారని దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తిలక్ ఆర్డిఓ ను కోరారు. ఈ సందర్భంగా పేరాడ తిలక్ మాట్లాడుతూ.. ` తెలుగుదేశం, కూటమి ప్రభుత్వం రైతు నాశనాన్ని కోరుకుంటుంది. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో రైతాంగానికి ఉచిత పంటల భీమా సౌకర్యం కల్పించి ప్రభుత్వమే నేరుగా భీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించేది. తెలుగుదేశం ప్రభుత్వం పంటల భీమా ప్రీమియంను రైతులే చెల్లించాలని ఆదేశిస్తూ రైతు నాశనాన్ని కోరుకుంటుంది. తక్షణమే ప్రభుత్వం ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించాలి అని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం నుంచి రావలసిన ఎరువులు కు సంబంధించిన సబ్సిడీని చంద్రబాబు ప్రభుత్వం నగదు రూపంలో తీసుకోవడంతో ఎరువుల కొరత ఏర్పడింది. దీంతో ఎరువులు లేక రైతుల పరిస్థితి ధైర్యంగా మారింది . టెక్కలి నియోజవర్గం ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి అయినప్పటికీ అతని అసమర్థత వల్ల ఎరువుల వ్యాపారులు ఎరువులను బ్లాక్ మార్కెట్లో తరలించి రైతాంగానికి యూరియా బస్తా 600 రూపాయల వరకు అమ్ముతున్నారు. వ్యాపారులు ఎరువులు కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు కనీసం స్పందించడం లేదు. సహకార సంఘాల ద్వారా ఎరువులు పంపిణీ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఎరువులు అందజేస్తు బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్నారు . మంత్రి అచ్చెన్నాయుడు తన అనుచరులు తో దందాలు చేయిస్తూ ఆర్థిక లావాదేవీల పైనే దృష్టి సారిస్తున్నారు తప్ప రైతు సమస్యలను పట్టించుకోవదంలేదు. రైతు సమస్యలు తక్షణమే పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం` అని తిలక్ హెచ్చరించారు. పోలీస్ పహారా మధ్య రైతు ర్యాలీ సాగింది.