శ్రీకాకుళం: విద్యార్థులు, నిరుద్యోగ యువత పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జూలై 28న శ్రీకాకుళంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. వైయస్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు పొన్నాడ బ్రిడ్జి వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. డీఎస్సీ నియామకాల వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.