ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం  

మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు 

విజ‌య‌వాడ‌: రైతుల నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. నూతన ఆన్‌లైన్‌ విధానం ద్వారా రైతులకు, మిల్లర్లకు సంబంధం లేకుండా ఒక్కపైసా కూడా నష్టపోకుండా మద్దతు ధర కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎఫ్‌టీవో వచ్చిన 21 రోజుల్లోగా నగదు జమ చేసేలా ఆదేశించామన్నారు. ఇప్పటికే 2.30 లక్షల టన్నుల ధాన్యాన్ని కొని, రూ.160 కోట్లకు పైగా చెల్లించామన్నారు. ఇందులో ధాన్యం అమ్మిన మరుసటిరోజే నగదు జమయిన∙ రైతులు కూడా ఉన్నట్లు వివరించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు.  

 వినియోగదారుల హక్కుల పరిరక్షణ, సత్వర న్యాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టాన్ని సవరించినట్లు పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. సచివాలయంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌ అధ్యక్షతన రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి తొలి సమావేశం జరిగింది.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సవరించిన చట్టం ప్రకారం కొనుగోలుదారులు వస్తువులు ఎక్కడ కొన్నప్పటికీ వారి నివాస ప్రాంతం నుంచి ఆన్‌లైన్‌లో, స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో, లేదా వినియోగదారుల సేవ కేంద్రంలోని 1967, 18004250082 టోల్‌ ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేసు విచారణకు హాజరు కావొచ్చని చెప్పారు.

వినియోగదారులు దోపిడీకి గురికాకుండా గత పది నెలల్లో విస్తృతంగా తనిఖీలు చేసి 1,748 కేసులు నమోదు చేశామన్నారు. పాత వాటితో కలిపి మొత్తం 2,139 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. పెట్రోల్‌ బంకులపై 97 కేసులు, ఎరువుల దుకాణాలపై 350 కేసులు, విశాఖపట్నం, విజయవాడలోని షాషింగ్‌ మాల్స్‌పై 175 కేసులు నమోదు చేశామన్నారు.

త్వరలో బంగారు నగల దుకాణాల్లో కూడా తనిఖీలు చేస్తామన్నారు. ఆహార పదార్థాల కల్తీని అరికట్టేందుకు 15 మొబైల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని, వీటిలో ఆరు ఫిబ్రవరికి అందుబాటులోకి తెస్తామని చెప్పారు. విశాఖలోని ల్యాబ్‌ను ఆధునీకరిస్తామని, విజయవాడ, తిరుపతిలో కూడా ల్యాబ్‌లను అభివృద్ధి చేస్తామన్నారు. 

ఉక్రోషంతో చంద్రబాబు దుర్భాషలు 
భవిష్యత్తులో రాజకీయ జీవితం ఉండదని చంద్రబాబునాయుడు ఉక్రోషంతో దుర్భాషలకు దిగుతున్నారని మంత్రి విమర్శించారు. ప్రజలు పట్టించుకోవట్లేదని, ఇక ఇంటికి వెళ్లాల్సిందేనని అర్థమైన చంద్రబాబు చివరి ఎన్నికలని, అసెంబ్లీకి పంపాలని వేడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. క్షేత్ర స్థాయిలో టీడీపీకి నాయకత్వమే లేదన్నారు. ప్రభుత్వ పథకాలు అందుతుండటంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలను వారి కుటుంబ సభ్యులే తిడుతున్నారన్నారు.

Back to Top