తాడేపల్లి: నకిలీ లిక్కర్ దందాపై కూటమి ప్రభుత్వంపై మద్యపాన ప్రియుల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో కంటి తుడుపు చర్యగానే బాటిళ్లపై "క్యూఆర్ కోడ్" ప్రింటింగ్ పెడుతోందని, అంటే ఇన్నాళ్లూ నకిలీ లిక్కర్ అమ్మకాలు జరిపామని ప్రభుత్వం అంగీకరించడమే అవుతుందని వైయస్ఆర్‌సీపీ నాయకులు పోతిన మహేష్ ఆరోపించారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నకిలీ లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా జరిగేది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌ల లోనే కాబట్టి నకిలీ మద్యం దోపిడీకి "క్యూఆర్ కోడ్" అడ్డమే కాదని, లూజ్ లిక్కర్ అమ్మకాలు జరిగే అలాంటిచోట "క్యూఆర్ కోడ్" తో పనేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మొలకలచెరువు, ఇబ్రహీంపట్నం, అనకాపల్లి, తదితర ప్రాంతాల్లో నకిలీ లిక్కర్ దందా బయటపడినప్పుడే చుట్టుపక్కల మద్యం షాపులు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లలో తనిఖీలు చేయడంతో పాటు లక్షల్లో శాంపిల్స్ తీసుకుని నాణ్యతా ప్రమాణాలను పరిశీలించేవారని అభిప్రాయపడ్డారు. కానీ అలాంటి కార్యక్రమాలేవీ జరగకపోవడం చూస్తుంటే ఈ దందా వెనుక కూటమి పెద్దల ప్రమేయం ఉందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయని పోతిన మహేష్ చెప్పారు. సీఎం చంద్రబాబుకి దమ్ముంటే నకిలీ లిక్కర్ దందాలో పట్టుబడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ● నకిలీ మద్యం అమ్మకాలు జరిగాయని ప్రభుత్వం అంగీకరించింది కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం కారణంగా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రాణాలు అపాయంలో పడ్డాయి. అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టి మరీ నకిలీ మద్యం తయారీ ద్వారా ఇప్పటికే వేలాది కోట్లు అక్రమంగా దోచుకున్న ప్రభుత్వ పెద్దలు ఐదేళ్లలో రూ.40 వేల కోట్ల భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. ములకలచెరువులో భారీగా నకిలీ మద్యం తయారీ యూనిట్ గుట్టురట్టయినా, దానివెనుక టీడీపీ నాయకుల పాత్ర ఉందని తెలిసినా ఎవరి పైనా చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర నిందితులను కఠినంగా శిక్షిస్తామని గానీ నకిలీ మద్యం తయారీ, అమ్మకాలను నియంత్రిస్తామని కానీ ఎక్కడా చెప్పడం లేదు. నకిలీ మద్యం గుట్టు బయటపడటంతో కంటితుడుపు చర్యగానే క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. హఠాత్తుగా ఇప్పుడు బాటిళ్లపై క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రంలో ఇంత కాలమూ నకిలీ మద్యం అమ్మకాలే జరిగాయని ప్రభుత్వమే అంగీకరించినట్టయింది. ● వారికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం తెలుసా? మద్యం అమ్మకాల్లో 70 శాతం చీప్ లిక్కర్ అమ్మకాలే ఎక్కువగా జరుగుతున్నాయి. చీప్ లిక్కర్ ప్లేసులో అక్రమంగా తయారు చేసిన నకిలీ మద్యాన్ని ప్రవేశపెట్టి కూటమి పెద్దలు పెద్ద ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కానీ నకిలీ మద్యం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ పేరుతో హడావుడి చేస్తోంది. వాస్తవానికి నకిలీ మద్యం తాగే చాలా మంది రోజువారీ కూలీ చేసుకుని జీవించేవారు. వారి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు. చదువులేని వారికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం కూడా తెలియదు. అలాంటప్పుడు మద్యం బాటిళ్లలో ఇచ్చే వాటిలో నకిలీ ఏది, ఒరిజినల్ సరుకు ఏది అనేది ఎలా తెలుస్తుంది? నకిలీ మద్యం అక్రమ తయారీ అమ్మకాలను అరికట్టాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టే దీనిపై సీరియస్‌గా దృష్టిసారించడం లేదు. పైగా రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ షాపులు నడిపేవారంతా కూడా టీడీపీ నాయకులే అయినప్పుడు వారెందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నకిలీ మద్యం బాటిళ్లను పట్టిస్తారు? ఇదంతా చూస్తుంటే నకిలీ మద్యం అమ్మకాలు జరిపే వారికే విచారణ చేసే అధికారం చంద్రబాబు ఇచ్చినట్టయింది. ఇది మద్యపాన ప్రియులను మోసం చేసినట్టు కాదా? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ● లూజ్ లిక్కర్ తాగే వాళ్లకి క్యూఆర్ కోడ్‌తో పనేంటి? రాష్ట్ర వ్యాప్తంగా 16 నెలలుగా పర్మిట్ రూమ్‌లు అక్రమంగా ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా తాగించిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు కొత్తగా ప్రభుత్వానికి రూ.5 లక్షలు కట్టి పర్మిట్ రూమ్‌ల ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులిచ్చేస్తున్నారు. దానికి ఎక్కడా ప్రభుత్వం టెండర్ పిలవడం లేదు. రూ. 5 లక్షలు తీసుకుని ఆ పర్మిట్ రూమ్స్‌లో పెగ్గు మాత్రమే కాకుండా ఫుడ్డు, బెడ్డు కి కూడా అవకాశం కల్పించారు. విచ్చలవిడిగా మద్యం తాగించి మద్యపాన ప్రియుల ప్రాణాలను తీసేస్తున్న ఇలాంటి వ్యక్తి నకిలీ మద్యం అమ్మకాలను అరికడతామని చెబితే ప్రజలు ఎలా నమ్మగలరు? పర్మిట్ రూమ్‌లతో నకిలీ మద్యం అమ్మకాలు పెరుగుతాయా, తగ్గుతాయా అనేది సీఎం చంద్రబాబు చెబితే బాగుంటుంది. పర్మిట్ రూమ్‌లకు అనుమతిచ్చింది నకిలీ మద్యాన్ని నియత్రించడానికా, నకిలీ మద్యాన్ని ప్రోత్సహించడానికా? పర్మిట్ రూమ్‌లలో లూజ్ లిక్కర్ అమ్ముతుంటే వారు తాగేది నకిలీ లిక్కరో, ఒరిజినల్ దో మద్యపాన ప్రియులు ఎలా తెలుసుకుంటారు? అలా తెలుసుకునే అవకాశం లేనప్పుడు ప్రభుత్వం క్యూర్ కోడ్ ప్రవేశపెట్టి ప్రయోజనం ఏంటి? చంద్రబాబు నకిలీ మద్యాన్ని కిందిస్థాయి వరకు తీసుకెళ్లేది టీడీపీ నాయకులే కదా. వారి చేతుల్లోనే బెల్ట్ షాపులు నడుస్తున్నప్పుడు క్యూఆర్ కోడ్‌తో పనేంటి? ఆ బెల్ట్ షాపుల్లోనే నకిలీ మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఆ బెల్ట్ షాపుల్లో క్యూఆర్ కోడ్‌లు ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? ● వైయస్ఆర్‌సీపీ హయాంలోనే పారదర్శకంగా లిక్కర్ అమ్మకాలు మద్యపాన ప్రియులతో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా తాగించి దోచుకునే కార్యక్రమంలో భాగంగానే కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. వైయస్ఆర్‌సీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతుంటే వాటిని చంద్రబాబు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేశాడు. ఒక పక్క రాజకీయంగా వైయస్ జగన్ మీద బురదజల్లడం, ఇంకోపక్క తన లిక్కర్ సామ్రాజ్యాన్ని వ్యవస్థీకృతం చేసి భారీగా దోచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చాడు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆధీనంలో లిక్కర్ షాపులు నడిచేవి. డిస్టిలరీల దగ్గర్నుంచి చెకింగ్ ఉండేది. స్టాక్ పాయింట్ దగ్గర్నుంచి మద్యం దుకాణాలకు చేరే వరకు స్టాక్ మీద మళ్లీ చెకింగ్ ఉండేది. ఎక్కడా నకిలీ మద్యం సరఫరాకి ఆస్కారం లేకుండా ప్రతి బాటిల్ మీద ఆ రోజుల్లోనే క్యూఆర్ కోడ్ ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాండమ్ గా 1.26 లక్షల బాటిల్స్ తీసి నాణ్యతను తనిఖీ చేసే వ్యవస్థ ఉండేది. లిక్కర్ షాపులన్నింటిలో కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఉండేవారు. వారు బాధ్యతాయుతంగా పనిచేసేవారు. పనివేళలు కుదించారు. ● ఎందుకు తనిఖీలు చేయడం లేదు? కూటమి ప్రభుత్వం వచ్చాక ఇష్టారాజ్యంగా ప్రతి గ్రామంలో రెండు మూడు బెల్ట్ షాపులు వెలిశాయి. ప్రతి లిక్కర్ షాపుకి అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు వెలిశాయి. వేళాపాళా లేకుండా 24 గంటలూ మద్యం విక్రయిస్తున్నారు. ప్రతి నాలుగు బాటిల్స్‌లో ఒకటి నకిలీ మద్యం బాటిలే ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి భారీగా నష్టం జరుగుతోంది. ఈ 16 నెలల్లోనే నకిలీ మద్యం ద్వారా వేల కోట్లు దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనకాపల్లి, ఇబ్రహీంపట్నం, ములకలచెరువు, ఏలూరు తదితర ప్రాంతాల్లో నకిలీ మద్యం రాకెట్ వెలుగుచూసింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న లిక్కర్ షాపుల్లో ఎందుకు తనిఖీలు నిర్వహించలేదు? లక్షల కొద్దీ శాంపిల్స్ తీసుకుని నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయలేదు? లిక్కర్, బెల్ట్ షాపుల మీద దాడులెందుకు చేయలేదు? ● నకిలీ మద్యం దందాలో పవన్ కళ్యాణ్ మౌనం నకిలీ లిక్కర్ కేసును ఎలాగైనా మూసేయాలని చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. చంద్రబాబుకి దమ్ముంటే నకిలీ లిక్కర్ మాఫియా మీద చర్యలు తీసుకోవాలి. ప్రజలంతా చంద్రబాబు డ్రామాలను అర్థం చేసుకున్నారు. మద్యపాన ప్రియులు కూటమి ప్రభుత్వ మోసాలను గ్రహించారు. ఇప్పటికైనా బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు మూసేయాలి. నకిలీ మద్యం తయారీదారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. నకిలీ లిక్కర్ దొరికిన ప్రాంతాల్లో శాంపిల్స్ తీసి నాణ్యతా ప్రమాణాల తనిఖీ చేయాలి. ఆరోజున వైయస్ఆర్‌సీపీ హయాంలో మద్యపాన ప్రియుల కోసం గొంతుచించుకున్న పవన్ కళ్యాణ్, నేడు కూటమి పాలనలో రాష్ట్రంలో భారీ ఎత్తున నకిలీ మద్యం మాఫియా వెలుగుచూసినా నోరెత్తడం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదంటే ఆయన దీనికి మద్దతిస్తున్నా? అక్రమాలపై ప్రశ్నిస్తాను అన్న పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు?