

















కళ్యాణదుర్గం వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య
అనంతపురం: తెల్గీ కుంభకోణం కంటే కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు స్కాం పెద్దదని కళ్యాణదుర్గం వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య విమర్శించారు. అమిలినేని వందల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ బ్యాంకు రుణాలు తీసుకుని ఈ – స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో భారీ కుంభకోణానికి పాల్పడిన ఘటనపై తలారి రంగయ్య స్పందించారు. ఈ స్కామ్‌లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్ ‘మీ–సేవ బాబు’! టీడీపీ ప్రజా ప్రతినిధి అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్రం నిర్వాహకుడు ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు? అని మండిపడ్డారు. ఈ స్టాంప్‌ల కోసం మీ–సేవ సెంటర్ నిర్వాహకుడు బాబుతో టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర సన్నిహిత సంబంధాలు నెలకొల్పాడని, ‘మీ–సేవ బాబు’ కూడా టీడీపీ కుటుంబ సభ్యుడే అన్నారు. టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఎమ్మెల్యే సురేంద్ర ఇంట్లో మనిషిలా మీసేవ బాబు వ్యవహరిస్తుంటాడని ఆరోపించారు. ఎమ్మెల్యే ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి స్టాంప్ డ్యూటీ ఎగొట్టారని విమర్శించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కు చెందిన ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ సంస్థ రూ.920 కోట్ల రుణాలకు 4.5 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించాలని, అయితే కేవలం లక్షన్నర మాత్రమే చెల్లించారని తెలిపారు. ఇలా ఎన్ని కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టారో తేలాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే సురేంద్ర బాబు బ్యాంకులను మోసం చేశారని రంగయ్య ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి చేరాల్సిన కోట్ల రూపాయలు తన జేబులో వేసుకున్నారని, విషయం బయటపడేసరికి టీడీపీ నేత ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు పై పోలీసుల కు ఫిర్యాదు చేశారని తప్పుపట్టారు. మొత్తం వ్యవహారం పై సమగ్ర విచారణ చేయాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు.