విజయవాడ: చంద్రబాబు చేసిన పెద్ద తప్పు వల్లే ఈ రోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సమస్య తలెత్తిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, పునరావాసం బాధ్యత కూడా కేంద్రానిదేనన్నారు. పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తుందని విభజన చట్టంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టును ఎందుకు తీసుకున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. విజయవాడలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరంలో ఇబ్బందులు. 2017లో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఏం జరిగిందో టీడీపీ నేతలు ఎందుకు బయటపెట్టలేదు. 2016లో ప్యాకేజీ ఒప్పందం తీసుకున్నారు. సంబరాలు చేసుకున్నారు. అందులో 100 శాతం ఇరిగేషన్ కాంపోనెంట్‌కి నిధులు ఇస్తామని కేంద్రం చెప్పింది. 2017 మార్చి 15 కేంద్ర కేబినెట్‌లో తీర్మానం చేశారు. అందులో 2014 తరువాత పెరిగే అంచనాలకు కూడా చెల్లించమని చెప్పారు. భూసేకరణ వ్యయం కూడా 2010 వరకు సేకరించిన వాటికే ఇస్తామన్నారు. అలాంటి కేబినెట్ తీర్మానాన్ని అప్పటి టీడీపీ కేంద్రమంత్రులుగా పనిచేసిన అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఆమోదించిన మాట వాస్తవం కాదా..? చంద్రబాబు ఆరోజు వీటిని ఎందుకు ఆమోదించారు. ఆ కేబినెట్ తీర్మానాన్ని పొగుడుతూ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. తిరిగి ఇప్పుడు మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా..? చంద్రబాబు చేసిన పెద్ద తప్పు వల్లే ఈ రోజు పోలవరం నిర్మాణంలో సమస్య తలెత్తింది. ఇప్పుడు దాన్ని సవరించడానికి సీఎం వైయస్ జగన్ ప్రధానికి లేఖ రాశారు. ప్రాజెక్టు, పునరావాసం రెండింటికి కేంద్రమే నిధులు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాబట్టేందుకు కేంద్రంతో పోరాటం చేస్తాం. ప్రాజెక్టు నిర్మాణంలో వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు. కచ్చితంగా సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పోలవరం నిర్మించి తీరుతాం’ అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.