తాడేపల్లి: రాష్ట్రంలో గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరుతూ ‘అన్నదాతకు అండగా వైయస్ఆర్ సీపీ’ పేరుతో రూపొందించిన పోస్టర్ ను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు ఆవిష్కరించారు. మాజీమంత్రులు అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లు లేళ్ళ అప్పిరెడ్డి, రుహుల్లా, మంగళగిరి వైయస్ఆర్ సిపి సమన్వయకర్త వేమారెడ్డి, మాజీ లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొ్మ్మూరి కనకారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నారాయణమూర్తి, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ… రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని రైతులకు అండగా నిలిచేందుకు, ధాన్యం కొనుగోళ్ళలో ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి, రైతులకు న్యాయం చేసేందుకు ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోని చిర్రావురు, గుండిమెడ గ్రామాల్లో రాశులుగా పోసిన ధాన్యంను చూసి, రైతులతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆవేదన అర్థమయ్యింది. ఈ ఏడాది అకాల వర్షాలు, వాయగుండాల వల్ల రైతుల పంట దిగుబడి ఇరవై నుంచి ముప్పై బస్తాలకే పరిమితం అయ్యింది. చివరికి ఆ ధాన్యంకు కూడా గిట్టుబాటు ధర కల్పించలేని దుర్మార్గమైన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మంత్రి మనోహర్ స్పందించడం లేదు పౌరసరఫరాలశాఖ మంత్రి మనోహర్ రైతుల వద్దకు వెళ్ళి ప్రతి గింజా కొంటానంటూ హామీ ఇచ్చారు. రైతులు ఫోన్ లో మెసేజ్ చేస్తే చాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. నిజమని నమ్మిన రైతులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా పట్టించుకున్న వారే లేరు. తక్కువ రేటుకే రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారు 75 కేజీలకు రూ.1725 రూపాయల ధర ఎక్కడా ఇవ్వడం లేదు. తేమ శాతం ఉందని రూ.1300 కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం నిల్వ చేసుకునే పరిస్థితి లేదు, రోడ్ల మీద పోసుకుంటున్నారు. మళ్ళీ వాయుగుండం అనే వార్తలతో రైతులు భయంతో ఎంతో కొంతకు ధాన్యం అమ్ముకుంటున్నారు. మా హయాంలో మద్దతు ధర కన్నా ఎక్కువకే అమ్ముకున్నారు వైయస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మద్దతు ధర కన్నా ఎక్కువకే రైతులు ధాన్యం అమ్ముకున్నారు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. కనీసం పదిశాతం కూడా ధాన్యం కొనుగోళ్ళు చేయడం లేదు. దీనికి నిరసనగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ వద్దకు వెళ్ళి వినతిపత్రాలు సమర్పించబోతున్నాం. చంద్రబాబు రైతు వ్యతిరేకి చంద్రబాబు రైతు వ్యతిరేకి. గతంలో రైతురుణమాఫీ చేస్తానని నమ్మించి అధికారలోకి వచ్చాడు. తరువాత రుణ మాఫీ చేయలేదు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రూ.13,500 రైతుభరోసా ఇస్తే, దానిని అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 ఇస్తానని నమ్మించి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఆ హామీని అసలు నెరవేరుస్తాడో లేదో తెలియడం లేదు. ఇన్ పుట్ సబ్సిడీ లేదు, ఈ క్రాస్ అసలే లేదు. ఈ పరిస్థితిలో రైతుకు అండగా వైయస్ఆర్ సీపీ నిలబడుతోంది.