పశ్చిమగోదావరి : ప్రతిరోజూ 500 రూపాయలు వెచ్చించి ప్రతీ కరోనా రోగులకు పౌష్టికాహారం అందించేలా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని డిప్యూటీ సీఎం ఆళ్లనాని పేర్కొన్నారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏలూరు ఆశ్రమ్, తాడేపల్లిగూడెం, భీమవరం లోని కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భోజనం నాణ్యత లేదని, దుప్పట్లు ఇవ్వడం లేదని, బాత్‌రూమ్‌లు సరిగా శుభ్రం చేయడం లేదని బాధితులు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన మంత్రి సమస్యలలను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నేరుగా నా నెంబర్‌కే ఫోన్ చేయండి.. అంతేకాకుండా కోవిడ్ ఆసుపత్రుల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా 18002331077 టోల్ ఫ్రీ నెంబర్‌కు, లేదా నేరుగా నా నెంబర్‌కు ఫోన్ చేయండంటూ మంత్రి పేర్కొన్నారు. . కోవిడ్ సెంటర్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం నుంచి ఏలూరులోని 71 హాట్ స్పాట్‌లలో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా కోవిడ్ లక్షణాలు ఉంటే వేగంగా టెస్టులు నిర్వహించి ఫలితాలు వచ్చే వరకు వారిని వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక ఆసుపత్రిలో ఉంచాలని ఆళ్ల నాని ఆదేశించారు.