రాష్ట్ర సమాచార కమిషనర్లుగా యు.హరిప్రసాద్ రెడ్డి, కె.చెన్నారెడ్డి

ప్ర‌మాణ స్వీకారం చేయించిన సీఎస్‌ ఆదిత్యానాథ్ దాస్‌

 అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన‌ర్లుగా మరో ఇద్దరు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. రాష్ట్ర సమాచార కమిషన‌ర్లుగా ఉల్చల హరిప్రసాద్ రెడ్డి, కాకర్ల చెన్నారెడ్డిల‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ మేరకు శుక్రవారం అమరావతి సచివాలయం మొదటి భవనం సియం సమావేశ మందిరంలో ఆర్టీఐ నూతన కమిషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తొలుత ఈకార్యక్రమానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్ స్వాగతం పలుక‌గా.. సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ వారితో ప్రమాణం చేయించి తదుపరి ఇరువురు నూతన కమిషనర్లకు పుష్పగుచ్చాలను అందించి దుశ్శాలువలతో సత్కరించి ప్రభుత్వం తరుపున ప్రత్యేక అభినందనులు తెలిపారు. 
ఈసందర్భంగా సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం మరింత పటిష్టవంతంగా అమలు జరిగేలా నూతన కమిషనర్లు తమవంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. సమాచార హక్కు చట్టం  ప్రజలకు ఒక వరం వంటిదని వారి సమస్యలను సకాలంలో పరిష్కరించడం ద్వారా సమాచార హక్కు చట్టం అమలుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు సమాచార కమిషనర్లు అన్ని విధాలా కృషి చేయాల్సిన అవసరం ఉందని సిఎస్ ఆదిత్యానాద్ దాస్ పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పి.రమేశ్ కుమార్,ఇన్ఫర్మేషన్ కమిషనర్లు బివి రమణ కుమార్, కట్టా జనార్దనరావు, ఆర్.శ్రీనివాసరావు, ప్రోటోకాల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top