ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ఓ వర్గం మీడియా కుట్ర 

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

చంద్రబాబు ఓడిపోయినప్పటి నుంచి ఓ వర్గం మీడియాకు బాధ ఎక్కువైంది

అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్‌ అందిస్తున్నాం 

చంద్రబాబు హయాంలో పెన్షన్‌ ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదు

 తాడేపల్లి: ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ఓ వర్గం మీడియా కుట్ర పన్నుతోందని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పెన్షన్ల విషయంలో టీడీపీ అపోహలు సృష్టిస్తోందని దుయ్యబపట్టారు. పెన్షన్లు తగ్గిస్తున్నారని టీడీపీ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అర్హులందరికీ పెన్షన్‌ అందజేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు హయాంలో పెన్షన్‌ ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీనే పెన్షన్‌ ఇస్తున్నామని తెలిపారు. పూర్తిగా పరిశీలించాకే అనర్హులను తొలగిస్తున్నామని పేరొన్నారు. 

చంద్రబాబు ఓడిపోయినప్పటి నుంచి ఓ వర్గం మీడియాకు బాధ ఎక్కువైపోయిందన్నారు. టీడీపీ హయాంలో పెన్షన్లు 40-50 లక్షల మందికి మించలేదని తెలిపారు. ఎన్నికలు దగ్గరకొచ్చే సమయంలో హడావుడిగా సంఖ్యను పెంచారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో 61 లక్షల మందికి పైగా అందజేస్తున్నామని తెలిపారు. అర్హులైన వృద్ధులకు సంబంధించి పూర్తి లెక్కలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తే బాబుకు వృద్ధులు గుర్తుకోచ్చేవారని సజ్జల మండిపడ్డారు.   బుధవారం తాడేపల్లిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి  మీడియాతో మాట్లాడారు. 

  
 వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక శాచురేషన్‌ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తుంటే దాన్ని కూడా టీడీపీ కరపత్రాలుగా మారిన ఎల్లో మీడియాకు చెందిన మూడు సంస్థలు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటున 39 లక్షలు పెన్షన్లు ఇస్తే... వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం 60 లక్షల పెన్షన్లు ఇస్తున్నదని చెప్పారు.  బాబు హయాంలో పెన్షన్లకు   సగటున రూ.500 కోట్లు ఖర్చు చేస్తే ... దానికి మూడింతలు ఎక్కువగా రూ.1500 కోట్లు పెన్షన్లకు ఖర్చు పెడుతున్నది తమ ప్రభుత్వమని సజ్జల తెలిపారు. టీడీపీ హయాంలో పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉంటే... తమ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్రతినెలా 1వ తేదీన వాలంటీర్‌ ఇంటికి వెళ్లి మరీ పెన్షన్లు అందిస్తున్నారని పేర్కొన్నారు.

"మా వాడు ముఖ్యమంత్రి కాకపోతే భరించలేమన్నట్లుగా" సామాజిక పెన్షన్లపై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు టీడీపీ మీడియా కుట్ర పన్నుతోందని, ఆ మూడు మీడియా సంస్థలు తెలుగుదేశం పార్టీ కరపత్రాలుగా ప్రకటించుకుని, ఇలాంటి రాతలు రాస్తే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని సజ్జల స్పష్టం చేశారు. 

చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళల్లో చేసిన అప్పులకు వడ్డీనే ఏడాదికి రూ. 30 నుంచి 40వేల కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ పాపం బాబుదేనని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ముందుగా వీటిపై సంజాయిషీ ఇచ్చి క్షమాపణ చెప్పాలని సజ్జల డిమాండ్‌ చేశారు. 

 సామాజిక పెన్షన్లకు సంబంధించి ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోంది. అన్యాయం జరిగిపోతుందన్నట్లు విష ప్రచారంలో భాగంగా పెన్షన్లకు ఎసరు పెడుతున్నారంటూ ప్రజల్లో ముఖ్యంగా పెన్షన్లపై ఆధారపడి జీవితాలు గడుపుతున్న వృద్ధుల్లో, పెద్దవాళ్లలో అపోహలు పెంచడానికి ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టడానికి ఈ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేయడం జరిగింది.

 పెన్షన్లకు సంబంధించి రెండున్నరేళ్లకు ముందు ఎలా ఉంది... ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనేదానిపై ఈ ఫలాలను అందుకున్నవారిని అడిగితే చెబుతారు. పిల్లలపై ఆధారపడకుండా వృద్ధులకు ఎంతోకొంత ఆసరాగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఎన్నికల ముందే తాము అధికారంలోకి రాగానే పెన్షన్‌ రెండువేలు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే శాచురేషన్‌ పద్ధతిలో అర్హలైనవారికి పెన్షన్లు అందిస్తున్నాం. ఇప్పుడు రూ.2250 పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. వచ్చే అయిదేళ్లలో దశలవారిగా పెంచుకుంటు వెళతామని, అర్హతను బట్టి పెన్షన్లు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తుస్తున్నాం. నెల తిరిగేసరికి పెన్షన్‌ తీసుకుంటున్న వృద్ధుల మొహాల్లో సంతోషం చూస్తున్నాం. 

 అదే చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సరిగ్గా 2019 ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా పెన్షన్లు పెంచుతూ ప్రకటన చేశారు. చంద్రబాబుగారికి ఏదీ సొంతంగా చేసే ఆలోచన లేదు. జగన్‌ గారు ప్రకటించగానే తాము పెన్షన్లు పెంపును ప్రకటించడం అందరూ చూసే ఉంటారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు ఉన్నప్పటి నుంచి రెండు మీడియా సంస్థలు చంద్రబాబుకు అనుకూలంగా తమ వైఖరిని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరో మీడియా సంస్థ కూడా తోడై.. ఆ మూడు మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడుగారు అధికారం పోయినప్పటి నుంచి ఉక్కిరిబిక్కిరి అయిపోతూ కడుపుమంటతో ఉన్నారు. అధికారం తమకే పోయినంతగా బాధపడుతున్నాయి. 99 పనులు చేస్తూ ఆ ఒక్కటి ఎందుకు చేయడం లేదంటూ మాట్లాడుతున్నాయి. చెప్పిన పనులు చేస్తున్నది మేమే. చంద్రబాబుగారిలాగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా భ్రమల్లో పెట్టడం లేదు.

 అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను అమలు చేశారు. ప్రజలు ఇచ్చిన ఈ అయిదేళ్ల కాలంలో ఇచ్చిన హామీలు పూర్తి చేసి.. దాని ఫలితాలు, ఫలాలు పేదలకు అందుబాటులోకి తెచ్చి వాటి ఫలితంగా వాళ్ల జీవితాల్లో మార్పు తీసుకు వచ్చి వచ్చే ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఓ యజ్ఞంలా చేస్తుంటే... ఈ మీడియా మాత్రం పెన్షన్లు ఎత్తివేస్తున్నారంటూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. టీడీపీ హయాంలో పెన్షన్‌ ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. అలాంటిది మేము ఏ నెల పెన్షన్‌ ఆ నెలే ఇస్తామని చెప్పడం తప్పు అంటున్నారా? అనర్హులకు అడ్డగోలుగా ఇవ్వాలనుకుంటున్నారా? వాళ్ల బాధ ఏంటో అర్థం కావడం లేదు. దీనిపై కోర్టులను ఆశ్రయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

 -అర్హులకు పెన్షన్‌ అందించడం, అనర్హులను వాళ్లను తీసివేసుకుంటూ వస్తున్నాం. దానికోసం మాడిఫికేషన్‌ చేస్తూ వస్తున్నాం. దూర ప్రాంతాల్లో ఉన్నవారు నెల తర్వాత తీసుకోవచ్చన్నది మా ప్రభుత్వమే చెప్పింది. దాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది పెన్షన్లను దుర్వినియోగం చేయడంతో... ప్రజల సొమ్ము దుబారా కాకుండా... అవినీతికి తావు లేకుండా ఉండేందుకు ఏ నెలకు ఆ నెలే పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయించాం. పక్క రాష్ట్రంలో ఉన్నా పెన్షన్‌ తీసుకునేందుకు ప్రతినెలా వచ్చి తీసుకునేందుకు వీలును కూడా కల్పించాం. ఇందులో తప్పు పట్టడానికి అర్థం కావడం లేదు. అనర్హులు ఉన్నా ఇచ్చేయాలని రాస్తే బాగుండేది. మీడియా అనే బ్యానర్‌ ఉన్నంత మాత్రాన టీడీపీ కరపత్రాలుగా పనిచేస్తున్న మీకు ఆ అర్హత లేదని చెబుతున్నాం. 

-అయితే వ్యవస్థలో తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 60 లక్షల మందికి పెన్షన్‌ పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుంటే దాంటో ఏమైనా తప్పులు ఉంటే ఎత్తిచూపితే ఫరవాలేదు. అలా కాకుండా దురుద్ధేశ్యంతో అసత్య ప్రచారం చేయడం 
సరికాదు. అందులో మీ దురద్దేశ్యాలు బయటపడుతున్నాయి. ‘మా వాడు సీఎం కాకపోతే ఎవరు ఉన్నా సహించం. మా సామాజిక వర్గం వ్యక్తే ముఖ్యమంత్రి కావాలన్నది’ ఆ మీడియా ఉద్దేశం అన్నట్లు ఉంది. ఆ హడావుడిలో ఇంతకాలం ఎవరు అధికారంలో ఉన్నారన్నది కూడా మర్చిపోతున్నారు.

 పాత లెక్కలు చూస్తే చంద్రబాబు హయాంలో సామాజిక పెన్షన్లకు ప్రభుత్వం చేసిన నెలసరి వ్యయం రూ. 500 కోట్లు. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం నెలకు చేస్తున్న వ్యయం రూ.1500 కోట్లు. అంటే పెన్షనర్ల సంఖ్య 50 శాతం వరకూ పెరిగితే.. ఇచ్చే పెన్షన్ డబ్బు ప్రభుత్వం నుంచి ఏకంగా మూడు రెట్లు పెరిగింది. ఇదీ నిజం.  మన రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు తీసుకుంటున్న వారి సంఖ్య దాదాపు 60 లక్షలు. అదే గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్లు అందుకున్న వారి సంఖ్య, ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షలే. అంటే ఇప్పుడు ప్రాక్టికల్ గా మరో 21 లక్షల మంది సామాజిక పెన్షన్లు అందుకుంటున్నార‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top