మా ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యం

ఆ నిషేధం అన్ని పార్టీలకూ వర్తిస్తుంది

యాత్రలు ఎవరైనా చేసుకోవచ్చు, అభ్యంతరమేమీ లేదు

నిబంధనలను ఉల్లంఘిస్తే తర్వాత పరిణామాలకు టీడీపీదే బాధ్యత

కందుకూరు, గుంటూరు దుర్ఘటనలపై బాబుకు పశ్చాత్తాపం లేదు

బీఆర్‌ఎస్‌ మాత్రమే కాదు ఏ పార్టీ అయినా పోటీకి రావచ్చు

రాజకీయాల్లో ఆరోగ్యకరమైన పోటీనే సీఎం వైయ‌స్ జగన్‌ కోరుకుంటున్నారు

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేప‌ల్లి: రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పార్టీలకు వర్తిస్తుందని వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నాం కదా అని త‌మ‌ వరకు పరిమితులు, మిగిలిన వారికి మరో రకంగా చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్ప‌ష్టం చేశారు. నిబంధ‌న‌ల విషయంలో వైయ‌స్ఆర్ సీపీకి మినహాయింపు ఉంటుందేమోనని ఎవరూ ఆందోళ‌న చెందాల్సిన‌ పనిలేదని చెప్పారు. ఈ ప్రభుత్వానికి అన్నింటికంటే.. ప్రజల ప్రాణాలే ముఖ్యమ‌న్నారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లోని మీడియా పాయింట్ వ‌ద్ద స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విలేక‌రులతో మాట్లాడారు.

జీవో విడుదలకు టీడీపీ వైఖరే కారణం.. 
ఈ జీవో తీసుకురావడానికి కారణం టీడీపీ వైఖరేనన్నారు.  రేపు ఈ జీవోను ఉల్లంఘించి, సభలు నిర్వహిస్తే తర్వాత పరిణామాలను వారే ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అసలు గుంటూరు ఈవెంట్‌ ప్లానింగే సరిగా లేదని,  ఇచ్చిందేమో చెత్త సరుకు .అదీ.. రెండొందలో, మూడొందలో విలువ చేసేవి, కానుకల పంపిణీ పేరిట అమాయక పేద మహిళలను తీసుకొచ్చి, ఆ తర్వాత బాధ్యతా రాహిత్యంగా ఈ దుర్ఘటన నుంచి టీడీపీ తప్పుకోవడం కాని..ఇవన్నీ ఆ పార్టీ నైజాన్ని చాటుతున్నాయని సజ్జల ఎద్దేవా చేశారు. పైగా టీడీపీ సోషల్‌ మీడియాలో  వైఎస్సార్‌సీపీని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని సజ్జల విమర్శించారు.

చట్టానికి అతీతులమన్నట్లుగా టీడీపీ వైఖరి..
 తాము చట్టానికి, న్యాయానికి అతీతులమన్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తోందని సజ్జల దుయ్యబట్టారు. సిస్టమ్‌ పనిచేయకూడదు. పోలీసులు పనిచేయకూడదు. మమ్మల్ని ఏమీ అడగకూడదు.. కోర్టులు వారికి అనుకూలంగా ఉండాలి.. ఇదే టీడీపీ ధోరణి. బాబు అధికారంలోకి రావాలి. సీఎం వైయ‌స్‌ జగన్‌ దిగిపోవాలి.. ఇదే వారే లక్ష్యం.  అధికారంలో ఉన్నప్పుడు వాళ్లెన్ని అరాచకాలు చేశారో జనానికి తెలుసన్నారు.

ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చు..
లోకేశ్‌ పాదయాత్ర గానీ, లేదా ఆయన తండ్రి బాబు యాత్రకు గానీ, పవన్‌ కళ్యాణ్‌ బస్సు యాత్రలకు కాని తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ యాత్రలకు వెళ్లే ముందు ఆలోచించాల్సిన విషయమేమంటే.. గతంలో తాము  ఏ రకంగా రాష్ట్రానికి, ప్రజలకు అన్యాయం చేశామో, రేపు ఏ రకంగా న్యాయం చేస్తామో చెప్పగలగాలని శ్రీ సజ్జల హితవు పలికారు.  అదేవిధంగా తాను గతంలో టీడీపీని ఎందుకు ప్రశ్నించలేదో, ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నాడో పవన్‌కళ్యాణ్‌ తన యాత్రలో చెప్పగలగాలని ఆయన సూచించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేలా ఏడాదిన్నరలో వచ్చే ఎన్నికలకు టీడీపీ, జనసేనలు సిద్ధం కావాలనే తమ పార్టీ ఆశిస్తోందన్నారు.   ప్రత్యర్థులు ఎప్పుడూ ధర్మయుద్ధానికి సిద్ధమై ఉండాలనే తామూ కోరుకుంటున్నామని,  దొంగయుద్ధం, ముసుగుయుద్ధాలకు కాదన్నారు. ధర్మయుద్ధానికి ఆ పార్టీలను ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు. తమ సభలను పబ్లిక్‌ స్థలాల్లో కాకుండా,  గ్రౌండ్లను ఎంపిక చేసుకోవాలని పార్టీలకు సూచిస్తున్నామే తప్ప మీటింగులు వద్దని తామేమీ ఆంక్షలు విధించడం లేదని సజ్జల తెలిపారు.  పబ్లిక్‌ స్థలాల్లో మీటింగులు వద్దని చెప్పడం అధర్మం కాదన్నారు. దురాలోచనలు ఉన్నప్పుడు, విమర్శలతో దాడి చేయాలనుకున్నప్పుడు, కుట్రపూరితంగా వారి మనస్సులు ఉన్నప్పుడు విధానంలో లోపాలను ఎలాగైనా ఎంచవచ్చని చంద్రబాబును విమర్శించారు.  

బాబుకు మృతులపై కనీసం సానుభూతి లేదు..
బాబు గుంటూరు సభకు హాజరై వెళ్లిపోయిన తర్వాత దుర్ఘటన జరిగి ముగ్గురు పేద మహిళళు మరణించారు. బాబు, తనకుతాను విమానంలో హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. తన దారిన తాను వెళ్లిన తర్వాత అమాయకుల ప్రాణాలు పోయాయన్న జాలి లేదు.   దుర్ఘటనా స్థలానికి  ఎందుకు వెనక్కి  రాలేదో బాబు వివరణ ఇవ్వకపోవడాన్ని  సజ్జల ప్రశ్నించారు. సభ జరిగిన చోట విజువల్స్‌ను చూస్తే పోలీసులు తప్ప ఎవరూ సహాయం చేస్తున్నట్లు కనిపించలేదన్నారు. తెలిసిన ముఖాలు ఒక్కటీ కనిపించడం లేదన్నారు. ఈ దుర్ఘటన తర్వాత టీడీపీ నోటికొచ్చినట్లు పోలీసులపైన, వ్యవస్థను తిట్టడం ప్రారంభించిందని సజ్జల విమర్శించారు. గుంటూరు సభకు ఇచ్చిన పర్మిషన్‌ లెటర్‌ను చూస్తే.. సభకు సంబంధించి, టీడీపీ వారు, వారి వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంగా అందులో ఉందని పేర్కొన్నారు. బాబుకూ తెలుసు అది తప్పని.. కాకపోతే విమర్శించాలని విమర్శించడమే తప్ప మరేమీ కాదన్నారు. నోరుంది కదా.. అని బాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం ఆయనకు అలవాటేనన్నారు. 

గుంటూరులో వైయ‌స్ జగన్‌ దీక్షకు కుంటి సాకులు 
ఇదే టీడీపీ గతంలో వైయ‌స్‌ జగన్‌ గుంటూరులో దీక్ష చేస్తామంటేనే అనుమతించలేదని, అదేమంటే అంబులెన్సులు తిరుగుతాయని సాకులు చెప్పారని విమర్శించారు. అయినా మారు మాట్లాడకుండా వేరేచోట సభ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. 

మృతుల్లో కులాలను వెతికే కుసంస్కారి బాబు..
చంద్రబాబు ప్రజల్లో లేడు. ప్రజా సమస్యలు ఏనాడూ పట్టించుకోలేదు. ఆఖరుకు చనిపోయిన వారి కులాలను వెతికి, ఉపకులాలను వెతికి పట్టి,  దీన్నీ రాజకీయం చేయాలనుకోవడం ఎంత హేయమని సజ్జల ప్రశ్నించారు. అదేమంటే నా ఉద్యమంలో సమిధలయ్యారని వ్యాఖ్యానించడం  బాబు బరితెగింపునకు  నిదర్శనమన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు గుర్తించాలన్నారు. 

రాజకీయాల్లో ఆరోగ్యకర పోటీని ఆహ్వానిస్తాం.. 
ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలూ పోటీలో ఉండడం ఆరోగ్యదాయకమేనని, బీఆర్‌ఎస్‌ పోటీకి వస్తే ఆహ్వానిస్తామని శ్రీ సజ్జల స్వాగతించారు. సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి కోరుకుంటున్నది ధర్మయుద్ధం అని మరోసారి చెప్పారు. రాజకీయాల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ కోరుకుంటున్నారని తెలిపారు. ఏపీలో పలువురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. టీడీపీలో ఉన్న ఆ 23 మంది ఎమ్మెల్యేలా? అని ప్రశ్నించారు. ఎవరైనా ఆ పార్టీలో చేరవచ్చని చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ చేయరాదన్నదే తమ అభిమతమని, ఇతర పార్టీలూ దీనికి మద్దతు పలికితే అది మంచి పరిణామమేనని మరో ప్రశ్నకు సమాధానంగా సజ్జల చెప్పారు.

Back to Top