ఏడాది పాలనలో చంద్రబాబు ఘోర వైఫల్యం

హామీల అమలుపై ప్రజలకు జవాబు చెప్పుకోలేని దుస్థితి

అక్రమ అరెస్టుల‌తో ప్రజల దృష్టి మళ్ళించేందుకు కుట్ర

ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్ట్‌లు దీనికి తార్కాణం

మండిపడ్డ ఎమ్మెల్యే ఆకేపాటి అమ‌ర్నాథ్‌రెడ్డి, మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

రాయ‌చోటి లోని జిల్లా పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి 

రాయచోటి: ఏడాది పాలనలో చంద్రబాబు ఘోర వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే లిక్కర్ స్కామ్ అంటూ డైవర్షన్ పాలిటిక్స్‌ చేస్తున్నారని మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయచోటిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సీఎంఓలో పనిచేసిన అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను లేని లిక్కర్ స్కామ్‌లో దోషులుగా చూపడం, వారి అరెస్ట్ దీనిలో భాగమేనని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో ఒక్క ఎన్నికల హామీని కూడా సక్రమంగా అమలు చేయక ప్రజాగ్రహాన్ని చవిచూస్తోందని అన్నారు. దీని నుంచి బయటపడేందుకు గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ తప్పించుకునే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

ఇంకా ఆయనేమన్నారంటే... 

ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌లేక కూట‌మి ప్ర‌భుత్వం ప్రజలను పచ్చిగా మోసగించింది. మరోవైపు గత ప్రభుత్వంపై నిందలు వేసి పబ్బం గడుపుకునే చీప్ పాలిటిక్స్‌కు పాల్పడుతోంది. అందులో భాగంగానే నిజాయితీ గ‌ల ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి లపై అక్ర‌మ కేసులు బ‌నాయించి అరెస్ట్ చేశారు. జ‌ర‌గ‌ని కుంభ‌కోణం జ‌రిగిన‌ట్టుగా సృష్టించి త‌ప్పుడు వాంగ్మూలాల‌తో అరెస్టులు చేశారు. మా నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకుని వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌ను గురిచేయ‌డ‌మం కోసమే ఈ కుయుక్తులకు పాల్ప‌డుతున్నారు. చంద్ర‌బాబు వ‌ద్ద పీఏగా ప‌నిచేసిన పెండ్యాల శ్రీనివాస్ రూ. 2 వేల కోట్ల‌కుపైగా అవినీతికి పాల్ప‌డి అడ్డంగా దొరికిపోతే, విచార‌ణకు హాజ‌రుకాకుండా దేశ దాటించిన ఘ‌న‌త చంద్ర‌బాబుది. అధికారంలోకి రాగానే మ‌ళ్లీ పిలిపించి కీల‌క‌మైన ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. ఎన్నిక‌లకు ముందు చెప్పిన‌ట్టుగా లిక్క‌ర్ షాపులు త‌గ్గించి బెల్ట్ షాపులు మూసేసి వైయ‌స్ జ‌గ‌న్ మ‌ద్య నియంత్ర‌ణ చేస్తే, కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక మ‌ద్య ఏరులై పారిస్తూ పేద కుటుంబాల‌ను స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నారు. బ‌హిరంగ స‌భ‌ల్లో నిస్సిగ్గుగా త‌క్కువ ధ‌ర‌కే మ‌ద్యం ఇస్తాన‌ని చెప్పిన నాయ‌కుడు చంద్ర‌బాబు త‌ప్ప దేశ చ‌రిత్ర‌తో ఇంకెవ‌రూ ఉండ‌రేమో. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే మద్యం షాపుల‌ను క‌మీష‌న్ల కోసం చంద్ర‌బాబు ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లో పెట్టేశాడు. ఈ కార‌ణంగా ప్ర‌భుత్వ ఖ‌జానాకు భారీగా న‌ష్టం జ‌రిగింది. 

కూట‌మి ప్ర‌భుత్వానికి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయి: ఎమ్మెల్యే ఆకేపాటి అమ‌ర్నాథ‌రెడ్డి 

అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌వుతున్నా ఏ ఒక్క హామీని అమ‌లు చేయ‌కుండా ఇప్ప‌టికీ చంద్ర‌బాబు మాయ‌మాట‌ల‌తో కాల‌క్షేపం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో వాటిని క‌ప్పిపుచ్చుకునేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌ను, వైయ‌స్ జ‌గ‌న్‌కి స‌న్నిహితంగా మెలిగిన వారిని టార్గెట్ చేసి అక్ర‌మ అరెస్టులు చేస్తున్నారు. కేసుతో ఏమాత్రం సంబంధం లేక‌పోయినా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే మాజీ ఐఏఎస్ అధికారులు కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, ధ‌నుంజ‌య‌రెడ్డిల‌ను అరెస్ట్ చేశారు. అవినీతికి పాల్ప‌డిన‌ట్టు ఇప్ప‌టికీ ఒక్క ఆధారమైనా చూపించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది. ప్ర‌జ‌ల త‌ర‌ఫున కూట‌మి ప్ర‌భుత్వంపై పోరాడుతున్న మా నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకుని భయ‌భ్రాంతుల‌కు గురి చేయాల‌ని చూస్తున్నారు. ఏడాది కాలంగా అమ‌రావ‌తి భ‌జన త‌ప్ప‌, ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీలు అమ‌లు చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబులో క‌నిపించ‌డం లేదు. ప‌రిస్థితి చూస్తుంటే ఏడాదిలోనే కూట‌మి పాల‌న‌కు ఆఖ‌రి రోజులు ద‌గ్గ‌ర ప‌డిన‌ట్టుగా క‌నిపిస్తుందని అమర్నాథ్‌రెడ్డి మండిపడ్డారు.
 

Back to Top