ఈ నెల 25న విజ‌య‌న‌గ‌రం జిల్లాకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన

ఏర్పాట్ల పై సమీక్షించిన రాష్ట్ర   ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విజయనగరం :  ఈ నెల 25 న కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.య‌స్.జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తార‌ని  రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖా మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్  కూడా పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పై విద్యా శాఖా మంత్రి , ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి రాజన్న దొర, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్.పి దీపిక లతో కలసి అన్ని శాఖల అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో  సమావేశం ఏర్పాటు చేసి ఏర్పాట్లు పై తగు సూచనలను జారీ చేశారు. తక్కువ సమయం ఉన్నందున  అధికారులంతా  సమన్వయంతో పని చేయలన్నాయారు. వర్షం పడే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. వేదిక వద్ద, బహిరంగ సమావేశం వద్ద,  పార్కింగ్ వద్ద, తాగు నీరు మెడికల్ కిట్లను, అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారుల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా చూడాలన్నారు. ఇప్పటికే 30 కోట్ల రూపాయ‌ల పరిహారాన్ని యూనివర్సిటీ భూముల కోసం అందజేశామని తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర  మీడియా తో మాట్లాడుతూ.. గిరిజన యూనివర్సిటీ ఆశ నెరవేరబోతోందని,  రాష్ట్ర విద్యా శాఖా మంత్రి కృషి కి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.  రాష్ట్రానికి చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రజలకు  ఈ యూనివర్సిటీ అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమం విజయవంతంగా జరిపిస్తామన్నారు.   

జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ కార్యక్రమానికి మరడాం వద్ద  హెలిపాడ్ ఏర్పాటు చేస్తున్నామని, హెలిపాడ్ వద్ద, కాన్వాయి, బహిరంగ సమావేశం,  వేదిక వద్ద  తగు బందో బస్త్ , బారికాడింగ్ ఏర్పాట్లను గావించాలని అన్నారు. ల్యాండ్ లెవెలింగ్, డెకరేషన్, సీటింగ్ ఏర్పాట్లు, తాగు నీరు, పారిశుధ్యం ఏర్పాట్లను సంబంధిత అధికారులకు ఆదేశించారు.  పి.ఏ సిస్టం ఏర్పాటు, నిరంతర విద్యుత్తు సరఫరా ఉండేలా చూడాలని ఐ అండ్ పి ఆర్, విద్యుత్ అధికారులకు సూచించారు.  వాహన పాస్ లు, డ్యూటీ పాస్ లు , సిసి కెమెరాలు, నెట్ కనెక్టివిటీ  ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ఫుడ్, స్నాక్స్, తాగు నీరు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆహ్వాన పత్రాలను వెంటనే పంపాలని డి.ఆర్.ఓ కు ఆదేశించారు.  హెలిపాడ్ నుండి యూనివర్సిటీ వరకు రహదారి క్లియరెన్స్  ఉండాలని, ప్రేక్షకులను రంజింప చేసేలా కల్చరల్ ప్రోగ్రాంలను నిర్వహించాలని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య, శంబంగి చిన్న అప్పల నాయుడు, సంయుక్త కలెక్టర్  మయూర్ అశోక్, డి.ఆర్.ఓ గణపతి రావు,  ట్రైబల్ యూనివర్సిటీ డీన్ మిశ్రా, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

 

Back to Top