తాడేపల్లి: రాష్ట్రంలో వైద్య విద్యను పేద విద్యార్థులకు కూడా చేరువ చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు వెల్లడించారు. అదే చంద్రబాబు నాడు ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత 14 ఏళ్లు సీఎంగా పని చేసినా, తన హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయలేదని ఆయన గుర్తు చేశారు. వైయస్ జగన్‌గారి చిత్తశుద్ధి, కృషి వల్ల రాష్ట్రంలో కొత్తగా 2,550 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చి, మొత్తం దాదాపు 5 వేల సీట్లకు చేరుకునేవని తెలిపారు. ఆ కాలేజీల్లో సీట్ల కోసం కట్టే ఫీజులన్నీ, ఆయా కాలేజీల (ప్రభుత్వ)కు వెళ్తాయి తప్ప, వేరెవరి జేబుల్లోకి కాదని, ఆ ఫీజుల ద్వారా వచ్చిన డబ్బులు ఆ కాలేజీల నిర్వహణ, అభివృద్ధికి వినియోగిస్తారని.. ఇంకా కొత్త మెడికల్ కాలేజీలు భవిష్యత్తులో కూడా సమర్థంగా నడిచేలా గత ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు కేటాయిస్తే.. నాడు విపక్ష టీడీపీతో పాటు, ఎల్లో మీడియా శివాలెత్తిపోయిందని జూపూడి తెలిపారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు మీడియాతో మాట్లాడారు. అసలు రాష్ట్రంలో ప్రైవేటీకరణకు ఆద్యుడు చంద్రబాబే అన్న జూపూడి, ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేసింది కూడా ఆయనే అని తెలిపారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్.. ఇవే చంద్రబాబు సిద్ధాంతమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ అదే విధానంలో వెళ్తున్న సీఎం చంద్రబాబు, కొత్త మెడికల్ కాలేజీలను మొత్తం ప్రైవేటుపరం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆక్షేపించారు. అందుకే వాటి నిర్మాణాన్ని ఆపేయడంతో పాటు, పులివెందుల మెడికల్ కాలేజ్‌కు మంజూరైన 50 సీట్లు కూడా వద్దంటూ లేఖ రాశారని చెప్పారు. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే, పార్టీ పరంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి పేద పిల్లలను మెడికల్ విద్యకు దూరం చేస్తున్న ప్రభుత్వ కుట్రపై వైయస్ఆర్‌సీపీ ఆందోళన తప్పదని జూపూడి ప్రభాకర్‌రావు తేల్చి చెప్పారు. నేరస్తుడితో రాజకీయమా? అని జగన్‌గారిని ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు ఆగ్రహించారు. నిజానికి రాజకీయాల్లో చంద్రబాబును మించిన నేరస్తుడు లేడన్న ఆయన.. పచ్చి అబద్ధాలు. ఎప్పటికప్పుడు యూటర్న్ మాటలు.. అదే చంద్రబాబు రాజకీయమని.. ఆయన్ను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని చెప్పారు. విజయవాడ వరదల్లో 60 మంది మరణానికి చంద్రబాబే కారణమన్న జూపూడి, వరద సహాయ పనుల్లో ఆయన ఘోర వైఫల్యం చెందారని, ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమల్లోనూ కూటమి ప్రభుత్వం విఫలమైందని.. అందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, వర్గ రాజకీయాలకు మొగ్గు చూపుతున్నారని ఆక్షేపించారు. విజయవాడ వరదలపై ముందస్తు సమాచారం ఉన్నా, అలర్ట్ చేయకపోవడం, ఆ తర్వాత సహాయక పనుల్లోనూ టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమైందని, ఏమీ చేయకున్నా.. అన్నీ చేసినట్లు సీఎం చంద్రబాబు ఎల్లో మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారని జూపూడి గుర్తు చేశారు.