నకిలీ మద్యంతో నాకెలాంటి సంబంధం లేదు

ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం

మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్‌ స్పష్టీకరణ 

తాడేపల్లి లోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి జోగి రమేష్‌.

చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ నాపై కక్ష కట్టారు

వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు

వాస్తవాలు నిగ్గు తేలాలంటే సీబీఐ దర్యాప్తు చేయాలి

అందుకు సీఎం చంద్రబాబు ఎందుకు వెనకడుగు?

సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి జోగి రమేష్‌ 

‘సిట్‌’ అధికారులు నిజాయితీగా ఉండండి

సీఎం చంద్రబాబుకు తొత్తులుగా మారొద్దు

ప్రెస్‌మీట్‌లో జోగి రమేష్‌ విజ్ఞప్తి

తాడేపల్లి: నకిలీ మద్యం తయారీ, పంపిణీ, అమ్మకాలపై రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే తాను వివరణ ఇచ్చానని, నకిలీ మద్యంతో తనకెలాంటి సంబంధం లేదని, ఏ విచారణకైనా తాను సిద్ధమని మాజీ మంత్రి జోగి రమేష్‌ స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రానికి వెళ్లి అక్కడి పరిస్థితులను స్వయంగా చూశానని, ఆ దృశ్యాలను ప్రజల ముందుకు తెచ్చానని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో యథేచ్ఛగా నకిలీ మద్యం సరఫరాను నిలదీయడాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి జోగి రమేష్‌ తెలిపారు.
ప్రెస్‌మీట్‌లో జోగి రమేష్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

● సీబీఐ దర్యాప్తునకు ఎందుకు వెనకడుగు?:

    రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న నకిలీ మద్యం తయారీ, సరఫరాను ప్రశ్నిస్తూ, నేను నివాసం ఉండే ఇబ్రహీంపట్నంలో ఆ మద్యం తయారీని లోకానికి చూపడం నేరమా? దాంతో నాపై కక్ష కట్టిన సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్‌..ఇద్దరూ నా జీవితంతో పాటు, వ్యక్తిత్వాన్ని కూడా హననం చేస్తున్నారు. ఇది అత్యంత దారుణం. హేయం. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా నకిలీ మద్యం కేసును నాపై మోపే ప్రయత్నం చేస్తున్నారు. నేనెప్పుడూ అలా నకిలీ మద్యం తయారు చేయించ లేదు. అలాంటి పని నేనెప్పుడూ చేయను. చేయబోను. ఈ కేసులో వాస్తవాలు తేలాలంటే సీబీఐ దర్యాప్తు జరపాలి. మరి దానికి సీఎం చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?.

● ఎలాంటి విచారణకైనా సిద్ధం:

నకిలీ మద్యంతో నాకెలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం. నా నిర్దోషిత్వాన్ని నిరూపించడం కోసం సీబీఐ దర్యాప్తు, లై డిటెక్టర్‌ టెస్ట్, నార్కో అనాలసిస్‌ టెస్ట్‌ వంటి దేనికైనా నేను సిద్ధం. ఇంకా ఇప్పటికే విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేశాను. కావాలంటే నా కుటుంబంతో సహా తిరుమల వచ్చి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం వద్ద కూడా ప్రమాణం చేస్తాను. నా సవాల్‌ స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా?.

● అది వ్యవస్థల దుర్వినియోగం:

    జనార్థన్‌ రావు అనే వ్యక్తి రిమాండ్‌లో ఉన్న సమయంలో.. వీడియోలు, ఫేక్‌ చాట్స్, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది అత్యంత దారుణమైన పని. నిజానికి ఈ కేసుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్టులో నా పేరు లేదు. అయినా సరే మీడియా ద్వారా నాపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగం. దేవుడు, ప్రజలు సాక్షిగా నా నిజాయితీని నిరూపిస్తాను.

● అధికారులకు ఇదే నా విజ్ఞప్తి:

    చంద్రబాబునాయుడు శాశ్వతంగా ఆ పదవిలో ఉండరు. కానీ, మీరు (సిట్‌ అధికారులు), మీ సర్వీస్‌ ఉన్నంత కాలం, ఉద్యోగం చేసేంత వరకూ ఆ బాధ్యతలో ఉంటారు. కాబట్టి దయచేసి తప్పు చేయవద్దు. నిజాయితీగా విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీయండి. ఎందుకంటే అంతిమంగా సత్యమేవ జయతే అని జోగి రమేష్‌ గుర్తు చేశారు.

Back to Top