కాకినాడ: మొంథా తుపాన్‌తో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం మాత్రం తూతూమంత్రంగా నష్టం అంచనాలు తయారు చేస్తోందని వైయస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురుసాల కన్నబాబు ఆక్షేపించారు. సీఎం చంద్రబాబుకు ప్రచారంపై ఉన్న శ్రద్ధ రైతుల పంట నష్టంపై లేదని ఆయన ఆగ్రహించారు. రైతుల నడ్డి విరిచిన సీఎం చంద్రబాబు, ఉచిత పంటల బీమా రద్దు చేసి, వారి గొంతు కోశారని కాకినాడలోని క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్ అయ్యారు. మొంథా తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కనీసం రూపాయి సాయం కూడా ప్రకటించని ప్రభుత్వం, తన డిజిటల్ మీడియా ప్రచారానికి మాత్రం రూ.200 కోట్లు విడుదల చేయడం అత్యంత హేయమని మాజీ మంత్రి కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. రైతుల కష్టాలను వదిలి ఊహల్లో తేలుతున్న ప్రభుత్వం, రియల్ టైమ్ గవర్నెర్స్ (ఆర్టీజీఎస్) పేరుతో హంగామా చేస్తోందని ఆయన గుర్తు చేశారు. ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి కన్నబాబు ఏం మాట్లాడారంటే..: ● సంక్షోభం అంటే చంద్రబాబుకు పండగ: సాధారణంగా మనందరికీ సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండగలు అయితే, సీఎం చంద్రబాబుకు మాత్రం తుపాన్‌ల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే పండగ. కారణం విపరీతంగా ప్రచారం చేసుకోవచ్చు. ఆయన్ను జాకీలు పెట్టి లేపేందుకు ఆస్థాన మీడియా ఎలాగూ ఉంటుంది. తుపాన్ తీవ్రత తగ్గితే తన వల్లే అని చెప్పుకోవడం, నష్టం ఎక్కువ జరిగినా ఒప్పుకోకుండా, తనంత అద్భుతంగా పని చేసే సీఎం ఎవరూ ఉండబోరని సొంత డబ్బా కొట్టుకోవడం చంద్రబాబుకు అలవాటు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాల పేరుతో ఎంతైనా దండుకోవచ్చు. అందుకే సీఎం చంద్రబాబుకు సంక్షోభం వస్తే ఒక పండగ. ● ఉచిత పంటల బీమాకు మంగళం.. రైతులకు శాపం: వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో రైతులకు భరోసా ఉండేది. కానీ ఇప్పుడు ఆ భరోసాకు ఎక్కడా చోటు లేదు. ఉద్దేశపూర్వకంగా ఉచిత పంటల బీమాకు మంగళం పాడిన ప్రభుత్వం, రెండేళ్ల నుంచి ఏ సీజన్‌లోనూ, ఏ పంటకూ ప్రీమియమ్ కట్టడం లేదు. ఇప్పుడు మొంథా తుపాన్‌తో పంటలకు ఎంతో నష్టం వాటిల్లింది. కానీ, కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే పంటల బీమా సదుపాయం ఉంది, బ్యాంక్ రుణాలు తీసుకున్న 19 లక్షల మంది రైతులకు మాత్రమే ఆయా బ్యాంక్‌లు పంటల బీమా చేశాయి. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? అదే గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో పక్కాగా ఈ–క్రాప్ నమోదు జరిగేది. అన్ని పంటలకు బీమా సదుపాయం ఉండేది. రైతులపై ఎలాంటి భారం వేయకుండా మొత్తం ప్రీమియమ్ ప్రభుత్వమే కట్టేది. అలా నాడు ఉచిత పంటల బీమా పరిధిలో 84 లక్షల రైతులు ఉండగా, ఇప్పుడు కేవలం 19 లక్షల రైతులకు మాత్రమే ఆ సదుపాయం ఉంది. మరి మిగిలిన రైతులు, పంటలకు ఎలా న్యాయం చేస్తారు? ఆ రైతులను ఎలా ఆదుకుంటారు?. ఉద్దేశపూర్వకంగానే ఉచిత పంటల బీమాకు మంగళం పాడిన సీఎం చంద్రబాబు రైతుల నడ్డి విరిచి, వారి గొంతు కోశారు. ● ఆర్టీజీఎస్ పేరుతో హడావిడి: వాస్తవాలకు చంద్రబాబు మాటలకు అస్సలు పొంతన లేదు. ఒకైపు రైతులు కష్టాల్లో ఉంటే.. వారిని ఆదుకోవాల్సింది పోయి, తన అనుకూల మీడియాలో ప్రచారం సరిపోదన్నట్టు తనకు తానే డబ్బా కొట్టుకుంటూ, తుపాన్లను, సంక్షోభాలను తాను ఎదుర్కొన్నట్లు అమెరికా కూడా ఎదుర్కోలేదని చెబుతున్నాడు. చాలా విచిత్రంగా టెక్నాలజీకి తాను ఆద్యుడినని చెప్పడంతో పాటు, దాన్ని అందరూ నమ్మాలంటున్నారు. తుపాన్ నష్టాన్ని ఉపగ్రహ చిత్రాలు, సీసీ ఫుటేజ్, డ్రోన్ల సాయంతో లెక్కించామని చెబుతున్నాడు. నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి వరిపంటను పరిశీలిస్తే.. పంట ఏ దశలో ఉంది, ఏ మేరకు రైతులు నష్టపోయారన్నది తెలుస్తుంది. ఇవేవీ లేకుండా.. టెక్నాలజీ, ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్) పేరుతో, ఎదురుగా 3, 4 కంప్యూటర్లు పెట్టుకుని కూర్చుని, వాటిలో ఫోటోలు చూస్తూ, చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ ఇస్రో శాస్త్రవేత్తల తరహాలో కూర్చున్నారు. క్షేత్రస్దాయిలో ఈసురోమని రైతులుంటే, సచివాలయంలో చంద్రబాబు మాత్రం ఇస్రో సెట్టింగులు వేసుకుని కూర్చున్నారు. ఇది అత్యంత దారుణం. ● నష్టం అంచనాల తీరు సందేహాస్పదం: మొంథా తుపాన్ నష్టం అంచనాలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చూస్తుంటే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నష్టాన్ని తక్కువగా చూపే ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలు వస్తున్నాయి. దాదాపు రూ.5,265.51 కోట్ల నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు చెబుతూ, అందులో ప్రధానంగా రహదారులు–భవనాల శాఖ పరిధిలో రూ.2079 కోట్ల నష్టం చూపుతున్నారు. పంట నష్టం రూ.829 కోట్లు, ఆక్వా నష్టం రూ.1270 కోట్లు అయితే పంచాయితీరాజ్ శాఖలో కేవలం రూ.8 కోట్ల నష్టం జరిగిందంటున్నారు. అంటే గ్రామీణ రోడ్లు, గ్రామాల్లో వ్యవస్థలు పాడవలేదా? డ్రైన్లు పాడవలేదా? నీటి పారుదల శాఖలో అసలు నష్టమే జరగలేదా?. అంటే పరిహారం ఎగ్గొట్టడం కోసం ప్రభుత్వం కావాలనే ఆ నష్టాన్ని తక్కువగా చూపే ప్రయత్నం చేస్తోందన్న అనుమానం వస్తోంది. ● జగన్ గారిది రియలిస్టిక్ గవర్నెన్స్: ప్రజలకు కావాల్సింది రియల్ టైమ్ గవర్నెన్స్ ప్రచారం కాదు. వారికి రియలిస్టిక్ గవర్నెన్స్ కావాలి. అది జగన్‌గారి ప్రభుత్వంలో కనిపించింది. ఒక సీజన్‌లో పంట నష్టం జరిగితే, ఆ సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం అనేది రియలిస్టిక్ గవర్నెన్స్ చేయాల్సిన పని. ఉచిత పంటల బీమా పెట్టి రైతులు ఒక్క రూ.1 కూడా ప్రీమియం కట్టకుండా ప్రభుత్వమే చెల్లించి, ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు సకాలంలో బీమా మొత్తాన్ని అందించడమే రియలిస్టిక్ గవర్నమెంటు లక్షణం. ఇవేవీ లేనప్పుడు మీ ఆర్టీజీఎస్ వల్ల ఎవరికి ప్రయోజనం? ఈ తుపాన్‌లో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇంత చెల్లిస్తామని ఈరోజుకీ చెప్పలేకపోయారు. మీ ప్రాధమిక అంచనాల ప్రకారం 3 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు చూపిస్తున్నారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. పక్కనున్న తెలంగాణాలో 4.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వరి పంటకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించి, పంపిణీకి సిద్దమైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అసలు తుపాన్ ఇక్కడ సంభవిస్తే, ఇక్కడ 3 లక్షల ఎకరాల పంటలు పోవడం ఏమిటి? పక్కన తెలంగాణాలో వర్షాలకు 4 లక్షల ఎకరాల్లో పంటలు పోవడమేంటి? ఇదేనా రియల్ టైమ్?. ● నాడు వద్దన్నారు. ఇప్పుడు అవే..: గ్రామ సచివాలయాల వ్యవస్థలు అవసరమా అని గతంలో మీరే ప్రశ్నించారు. తీరా ఇవాళ మరలా గ్రామ సచివాలయాలు అద్భుతం. అవి బేస్ క్యాంపులుగా పని చేశాయని, వాటి నుంచే మైకులు పెట్టి ప్రచారం చేశామని చెబుతున్నారు. అంటే నాడవి మీరు వద్దన్నారు. కానీ, ఇప్పుడు అవే, ఈ ప్రకృతి వైపరీత్యంలో ప్రజలకు సేవలందించాయి. ఇది వాస్తవం కాదా?. ● రైతుకు పరిహారంపై ప్రకటన ఏది?: 2024 కంటే ముందు వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో పంట నష్టం జరిగితే వరికి ఎకరాకు రూ.25వేలు పరిహారం ఇవ్వాలని కూటమిలో ఉన్న నేతలే డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎంత ఇవ్వాలని కోరుకుంటున్నారు? ఎకరాకు ఎంత పరిహారం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఎంత ఇస్తుంది? గతంలో విజయవాడ వరదల వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట నష్టపోతే వారికి పరిహారం ఇవ్వలేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వైయస్.జగన్ వల్ల రాలేదని మాట్లాడుతున్నారు. ఆ విధానంలో రైతులకు నష్టం జరుగుతుందని దాన్ని పక్కన పెట్టి.. ప్రభుత్వమే ఉచిత పంటల బీమా పధకాన్ని తీసుకొచ్చి, అందులో భాగంగా గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7802 కోట్లు ఉచిత పంటల బీమా కింద పరిహారం చెల్లించడం జరిగింది. ఇంకా 2024లో ఉచిత పంటల బీమా వల్ల 84.80 లక్షల మంది రైతులకు 69.51 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా రక్షణ పొందారు. ఆ తర్వాత వచ్చిన మీ ప్రభుత్వం ఉచిత పంటల బీమా ఎత్తివేయడం వల్ల 2024–25లో అది 9.93 లక్షల రైతులకే పరిమితం అయింది. అందులో 7.65 లక్షల మంది రైతులు మాత్రమే బీమా కవరేజీలో ఉన్నారు. ఇప్పుడు కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా ఉంది. ● రైతుకు సున్నా. ప్రచారానికి వందల కోట్లు: అన్ని విధాల నష్టపోతున్న రైతులను ఆదుకోని ప్రభుత్వం, ప్రచారానికి మాత్రం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. తాజాగా మూడు రోజుల క్రితం డిజిటల్ మీడియా ప్రచారం కోసం ఏకంగా రూ.200 కోట్ల ఖర్చుకు పరిపాలనపరమైన అనుమతి ఇచ్చారు. ఆ మేరకు అక్టోబరు 28న జీఓ జారీ అయింది. తుపాన్ల వంటి విపత్తులు సంభవించినప్పుడు పునరావాసం కోసం నిధులు విడుదల కోసం జీఓలు జారీ చేయడం సహజం. కానీ, ఈ కూటమి ప్రభుత్వం అందుకు భిన్నం. ● ప్రచారం పీక్. పనితీరు వీక్: మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ చెప్పినట్లు టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రచారం పీక్‌లో ఉంటే, పనితీరు పూర్తిగా వీక్, ప్రకృతి విపత్తులను ఆపడం మానవమాత్రులకు సాధ్యమా! మీ ఎలివేషన్స్‌తో నవ్వలు పాలు కావడం ఖాయం. ఏ రంగంలోనైనా ఈ ప్రభుత్వానికి ఒట్టి ప్రచారం తప్ప మరొకటి లేదు అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.