సత్యసాయి జిల్లా: మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదని, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డంగా మారాడని మాజీ మంత్రి శంకర్ నారాయణ ధ్వజమెత్తారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే టీడీపీ అజెండాగా పెట్టుకుందని, ఏదయినా జరగరానిది జరిగితే, ఆ నెపాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మోపి పబ్బం గడుపుకోవాలని చూస్తోందన్నారు. మూడు రాజధానులు ఏర్పాటుకు వైయస్ఆర్ సీపీ కట్టుబడి ఉందన్నారు. ఏపీ ప్రజలు సంతోషంగా ఉండడం చూసి గిట్టని చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరలేపాడని, చంద్రబాబు అండ్ కో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే ఉద్దేశంతో బూటకపు పాదయాత్రకు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీలు సూచించిన మేరకు అధికారి వికేంద్రీకరణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమన్నారు. గతంలో హైదరాబాద్‌లోనే అభివృద్ధి కేంద్రీకరించడం వలన, ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక మనం చాలా నష్టపోయామని అమరావతి వాసులే చెబుతున్నారు.. మరి మూడు రాజధానులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..? అని ప్రశ్నించారు. అది రైతుల పేరుతో తెలుగుదేశం పార్టీ చేస్తున్న శవయాత్ర అని మాజీ మంత్రి శంకర్ నారాయణ అన్నారు.