తాడేపల్లి: ప్రైవేటీకరణ మీద మమకారంతో పీ4పేరుతో చంద్రబాబు అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రం 2450 మెడికల్ సీట్లు కోల్పోయిందని, మెడిసిన్ చదవాలన్న పేద విద్యార్థుల కలలు కల్లలయ్యాయని వైయస్ఆర్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఎవరైనా రాష్ట్రానికి ఒక్క మెడికల్ సీటుకైనా పోరాడుతారు.. కానీ సీట్లను వద్దనే ప్రభుత్వం ఏపీలో ఉండటం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అన్నారు. సేఫ్ క్లోజ్ పేరుతో కూటమి ప్రభుత్వ మూసేసిన మెడికల్ కాలేజీలను త్వరలోనే వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో సందర్శించి వాటి నిర్మాణ నైపుణ్యం, స్థితిని మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు హామీలకు గ్యారెంటీ అని ఎన్నికలకు ముందు ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ప్రైవేటీకరణల పరంపరపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని సీదిరి ప్రశ్నించారు.. సీదిరి అప్పలరాజు ఏమన్నారంటే.. - ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న ఉద్దేశంతో నాటి సీఎం వైయస్ జగన్ మొత్తం 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు సాధించడంతోపాటు 5 కాలేజీలు పూర్తి చేసి బోధన ప్రారంభించారు. దీంతోపాటు 2024-25లో మరో 5 కాలేజీలు ప్రారంభించే విధంగా ప్రణాళికలు రూపొందించి పనులు చివరి దశకు తీసుకొచ్చారు. 2025-26 నాటికి మరో 7 కాలేజీలు ప్రారంభించాలని నిర్ణయించారు. - కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం అయ్యాక వైయస్ జగన్ మహోన్నత లక్ష్యంతో నాడు ప్రారంభించిన మెడికల్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. - వైయస్ జగన్ ప్రారంభించిన 5 మెడికల్ కాలేజీలను మినహాయించి (పాడేరు 50 సీట్లు) మిగతా వాటిని సేఫ్ క్లోజ్ చేసి వాటిని ప్రైవేట్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించి జీవో ఇచ్చింది. ఏపీఎంఎస్ఐడీసీ దీనికి చైర్మన్‌గా ఉంటారని పేర్కొన్నారు. - గత ఆగస్టు 12న సీఎం చంద్రబాబు నిర్వహించిన రివ్య్యూ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఈ విధమైన సేఫ్ క్లోజర్ ఆదేశాలు ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించని సీఎం చంద్రబాబు - దాదాపు 15 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా చేయలేదు. 2004లో ఆయన దిగిపోయే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలుంటే వాటిలో ఒక్కటీ చంద్రబాబు మంజూరు చేసింది లేదు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ ఇంత దౌర్భాగ్యమైన రికార్డు లేదు. - కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములై ఉండి కూడా రాష్ట్రానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావాలన్న ఆలోచన చంద్రబాబు చేయలేదు. - మరోపక్క ప్రైవేటు కాలేజీల విషయంలో మాత్రం చంద్రబాబుకు అమితాసక్తి. చంద్రబాబు పాలనలో మొత్తం 18 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతులొస్తే అందులో 12 కాలేజీలకు చంద్రబాబే అనుమతులిచ్చారు. వైయస్ఆర్ స్ఫూర్తితో.. - చంద్రబాబు తర్వాత సీఎం అయిన వైయస్ రాజశేఖరరెడ్డి శ్రీకాకుళం, ఒంగోలు, వైయస్ఆర్ జిల్లా, అనంతపురం జిల్లాలకు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. - దివంగత వైయస్ఆర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ వైయస్ జగన్ ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకురావాలని కృషి చేశారు. ఆయన్ను చూసి దేశంలోని అన్ని రాష్ట్రాలు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ముందుకొస్తే కేంద్రంలో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఉండాలన్న నిర్ణయం తీసుకుంది. జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను దేశం మొత్తం ఫాలో అవుతున్న తరుణంలో ఆయన తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటుపరం చేయడం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. - విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం.. మెడికల్ కాలేజీలను ప్రారంభించి క్లాసులు మొదలుకావడంతో అవి బతికిపోయాయి. లేదంటే వాటిని కూడా చంద్రబాబు మొహమాటం లేకుండా ప్రైవేటు వ్యక్తుల్లో చేతుల్లో పెట్టేవాడే. మెడికల్ సీట్లు ఎవరైనా వద్దనుకుంటారా..? - 2024-25లో మొదలు కావాల్సిన ఐదు మెడికల్ కాలేజీలకు సంబంధించి అండర్ టేకింగ్ లెటర్ ఇస్తే పాడేరు, పులివెందుల కాలేజీలకు 50 సీట్ల చొప్పున ఇస్తామని సెప్టెంబర్ 11న ఇండియన్ మెడికల్ కౌన్సిల్ లేఖ రాస్తే, ఏమాత్రం ఆలోచించకుండా పక్క రోజునే (సెప్టెంబర్ 12న) పులివెందుల కాలేజీకి అండర్ టేకింగ్ ఇవ్వలేమని ఏపీ ప్రభుత్వం తరఫున లేఖ రాశారు. - ఒక్క మెడికల్ సీటు పెంచమని బ్రతిమాలకునే ప్రభుత్వాలను చూస్తుంటాం.. కానీ కేంద్రం ఇస్తామన్న మెడికల్ సీట్లు వద్దనే ముఖ్యమంత్రి దేశంలో చంద్రబాబు తప్ప ఇంకెవరూ ఉండరు. వీటితోపాటు మార్కాపురం, మదనపల్లి, ఆదోని మెడికల్ కాలేజీలను కూడా మొదలుపెట్టే ఆలోచన లేదని చెప్పడం కన్నా దౌర్భాగ్యం ఇంకెక్కడైనా ఉంటుందా..? - చంద్రబాబు కారణంగా రాష్ట్రం ఇప్పటికే 700 మెడికల్ సీట్లు కోల్పోయింది. ఇవేకాకుండా 2025-26కి సంబంధించి మొదలుకావాల్సిన 7 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి ఉంటే మరో 1,050 సీట్లు రాష్ట్రానికి కలిసొచ్చేవి. చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం మొత్తంగా 2,450 మెడికల్ సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ప్రైవేటుపరం చేయడం విజనా..? - ఇంత దరిద్రమైన పాలన అందిస్తూ రాష్ట్రాన్ని ప్రైవేటువ్యక్తుల చేతుల్లో పెట్టేస్తుంటే ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబు విజనరీ అని కేజీఎఫ్ రేంజ్‌లో ఎలివేషన్లు ఇస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడానికేనా చంద్రబాబుకి అధికారం ఇచ్చింది...? - నీట్‌లో ఓసీ విద్యార్థికి 600 మార్కులు, ఓబీసీ విద్యార్థికి 540-550 మార్కులు వస్తే తప్ప మెడికల్ సీటు వచ్చే ఆస్కారం లేదు. మా ఆస్పత్రిలో పనిచేసే సూపర్‌వైజర్ కుమార్తెకి 538 మార్కులొచ్చినా బీసీ ఏ కేటగిరీలో సీటు రాలేదు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు భాగస్వామిగా ఉండి కూడా ప్రైవేటుకు డోర్లు బార్లా తెరుస్తున్నారంటే ఆయన ఆసక్తి ఏంటనేది ప్రజలకు అర్థం అవుతోంది. - ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ ఎక్కడి మీటింగ్ పెట్టినా సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో సీట్లు అమ్ముకుంటున్నారని అబద్దాలతో నానా యాగీ చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏకంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రైవేటుకు తాకట్టు పెట్టి డాక్టర్ కావాలన్న ఆశలపై నీళ్లు చల్లేలా 2,450 మెడికల్ సీట్లను రాకుండా అడ్డుకున్నాడు. - ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే అనుబంధ ఆస్పత్రిలో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందేది. ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షల్లో డబ్బులు కట్టి వైద్యం చేయించుకునే స్థోమత పేదలకు ఉంటుందా..? ఆఖరుకి ఉచితంగా వైద్యం అందకుండా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టడంతోపాటు ఇన్యూరెన్స్ కంపెనీ చేతుల్లో పెట్టి ఆ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేయాలని చూస్తోంది ఈ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి - ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చే ప్రతి హామీకి నేను గ్యారెంటీ అని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. కోల్పోయిన మెడికల్ కాలేజీ సీట్లపై ప్రజలకు, విద్యార్థులకు ఏం సమాధానం చెబుతారు. - పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయడం, గ్రామీణ రోడ్లపై టోల్ గేట్లు పెట్టి టోల్ వసూలు చేయడం కూడా సంపద సృష్టించడం అంటారా..? ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ ప్రైవేటుకి ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా..? ఇది విజనరీ నిర్ణయం అని చెప్పుకోవడం కన్నా దౌర్భాగ్యం ఉందా...? ఆఖరుకి ఆరోగ్యశ్రీ, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ సెంట్రల్ లేబరోటరీ కూడా ప్రైవేట్ చేతుల్లో పెడుతున్న చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజలకు ఏం మిగులుస్తాడనే అనుమానం కలుగుతోంది. - చంద్రబాబు ప్రైవేటుపరం చేయడంపై గొప్పగా పుస్తకాలు కూడా రాశాడు. 1999-2002 మధ్య మొదటి ఫేజ్ లో 18 కంపెనీలు, 2002-2006 మధ్య రెండో ఫేజులో 36 కంపెనీలు ప్రైవేటుపరం చేసి భ్రష్టుపట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. - పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు అంటూ ఈనాడు కోతలు కోస్తోంది. ఇదే చంద్రబాబు దావోస్‌లో పోర్టుల గురించి చెబుతున్నాడు. చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క పోర్టునైనా నిర్మించారా..? - కూటమిని 164 సీట్లలో గెలిపించి మంచి చేయమని ప్రజలు అధికారమిస్తే.. చంద్రబాబు మాత్రం ప్రైవేటుపరం చేయడంలో నిమగ్నమయ్యాడు. ఉన్నతంగా ఎదగాలన్న ఆకాంక్షలతో కష్టపడి చదువుతున్న తెలివైన పేద విద్యార్థుల కుటుంబాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాడు. - నిన్న అనంతపురం జిల్లాలో ఫీజుల కోసం నారాయణ కాలేజీ యాజమాన్యం వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. దానికి బాధ్యుడైన మంత్రి నారాయణను అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం రూ. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి ఉంటే ఆ విద్యార్థి ప్రాణం పోయేది కాదు. దీనికి కూడా పవన్ కళ్యాణ్ సారీ చెబితే సమసిపోతుందని చెబుతాడా..? - సందప సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ఏడు నెలల్లో రూ. 1.19 లక్షల కోట్లు అప్పులు చేయడం తప్ప చేసిందేంటి..? మేం ప్రభుత్వ ఆస్తులను పెంచితే, చంద్రబాబు దివాళా తీయిస్తున్నాడు. వ్యవస్థల మీద చంద్రబాబు పట్టు కోల్పోయారు. - మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. మళ్లీ రాబోయేది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమే. వైయస్ జగన్ ఆ ఎంఓయూలు అన్నింటినీ రద్దు చేస్తారు. కాబట్టి పీపీపీ విధానంలో తీసుకునేందుకు ముందుకొచ్చే వారు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. - కూటమి ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగా కళ్లెదుట ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ చూస్తూ కుర్చోవడం సిగ్గు చేటు. ఆయన తక్షణం స్పందించాలి. - నాణ్యమైన వైద్య సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత.. వైద్యం కోరడం ప్రజల హక్కు. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌కి ఏమాత్రం అవగాహన లేదు. పేద పిల్లలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఆయనకు లేదు. ఎక్కడ ఎంతమంది వైద్యులు ఉండాలి, ఏయే వసతులు ఉండాలనే దానిపై నిబంధనలున్నాయి. రాబోయే రోజుల్లో వైయస్ఆర్‌సీపీ తరఫున మూసేసిన అన్ని మెడికల్ కాలేజీలను సందర్శించి మీడియాకు చూపించడం జరుగుతుంది. ఆ నిర్మాణ శైలి అద్భుతాలను ప్రజలకు వివరిస్తాం.. - చంద్రబాబు దావోస్ పర్యటనపై నాలుగు రోజులుగా ఆయన జేబు పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. చంద్రబాబు రూ. లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తాడని రాష్ట్రమంతా ఎదురుచూస్తే తీరా పర్యటన పూర్తయ్యాక ఏం రాయాలో అర్థంకాక ఇది మా ఏపీ బ్రాండ్, త్వరలో శుభవార్త అనే హెడ్డింగులతో తుస్ మనిపించారని వారే తేల్చేశారు. - ఇవే పత్రికలు తెలంగాణ గురించి రాస్తూ దుమ్మురేపిన తెలంగాణ, రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుడబులు అంటూ ఒప్పందాల గురించి రాశాయి. ఏపీ ఎంవోయూల గురించి మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయారు. - కమీషన్ల కోసం పరిశ్రమల మీద కూటమి నాయకులు పదే పదే దాడులు చేస్తుంటే వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎలా ముందుకొస్తారు..? చంద్రబాబు కారణంగా వేధింపులకు గురైన సజ్జన్ జిందాల్ ఇక్కడ పెట్టాల్సిన పెట్టుబడులు ఉపసంహరించుకుని మహారాష్ట్రలో రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.