పాలించే సత్తాలేక వైయ‌స్ జగన్‌పై తప్పుడు ప్రచారం 

మాజీ మంత్రి పేర్ని నాని

తాడేప‌ల్లి:  చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి పాలించే సత్తాలేక వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తుంద‌ని మాజీ మంత్రి పేర్ని నాని మండిప‌డ్డారు.  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేక పోతోందని.. ప్రజల బాగోగులు వదిలేసి ఆయనపై అభాండాలు వేస్తోందని ధ్వ‌జ‌మెత్తారు. బుధవారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వైయ‌స్ జ‌గ‌న్ ‘‘రూ.3.63 కోట్లతో ఎగ్‌పఫ్‌లు తిన్నారని తప్పుడు పోస్టులు పెట్టారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలన్నీ బయటపెట్టాల‌ని పేర్ని నాని సవాల్‌ విసిరారు.

మూడు పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను, వారి బాగోగులను గాలికొదిలి… జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారంతో విషం చిమ్ముతోందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రాయమయ్య(నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతుందన్నారు. 

తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలడంతో పాటు, వాళ్ల జీతగాళ్లతో రక,రకాల తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారని నాని మండిపడ్డారు. 

ఐదేళ్లలో వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రూ.3,62,56,700 ఎగ్ పఫ్లు తిన్నారని ఊరూపేరులేని పోస్టర్లుతో విషప్రచారం చేస్తున్నారన్నారు. మీ జీతగాళ్లతో ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే బదులు జీఏడీ చూస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబే కాబట్టి.. ఈ విషయం నిజమైతే బయటపెట్టాలని సవాల్ చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే జీఏడీ మంత్రి హోదాలో ఈ ఖర్చు పెట్టినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దేనికి ఎంత ఖర్చుపెట్టారో మీ దగ్గర అన్ని వివరాలుంటాయని.. ధైర్యం ఉంటే ప్రభుత్వంలో మీరే ఉన్నారు కాబట్టి అధికారకంగా చర్చకు రావాలని నాని సవాల్ విసిరారు. తప్పుడు ప్రచారానికి స్వస్తి పలికి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే దిశగాప్రభుత్వాన్ని నడపాలని హితవు పలికారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు, బొద్దింకలు పట్టుకోవడానికే రూ.8 కోట్లు చెల్లించిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని.. అలాంటి చరిత్ర ఉన్న మీరు అవన్నీ వదిలేసి ఇలాంటి తప్పులు వార్తలు రాయిస్తూ ప్రచారం చేస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల ముందు టమోట రైతులను దత్తత తీసుకుంటానని తన యువగళం యాత్రలో హామీ ఇచ్చిన లోకేష్  .. ఇవాళ టమోట రైతులు ధర లేక పండిన పంటను లారీలకొద్దీ రోడ్లమీద పారేస్తుంటే మీ కళ్లకు కనిపించడం లేదా అని నిలదీశారు. 

వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైద్యకాలేజీలలో వందకు పది, పదిహేను సీట్లను సెల్ఫ్ పైనాన్స్ కింది కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్లు ఇస్తే… జగన్మోహన్ రెడ్డి దళితులకు, బీసీలకు, మైనార్టీలకు సీట్లు లేకుండా అమ్ముకుంటున్నారని  ఆరోపించిన మీరు ఇవాళ ఏకంగా కాలేజీలనే ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. మరి ఇవాళ దళితులు, బీసీలు, మైనార్టీలకు మీ ప్రభుత్వంలో మెడికల్ విద్య అవసరం లేదా? వాళ్లు చదువుకోవాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. అధికారం లేనప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి తీరా అధికారం వచ్చిన తర్వాత వాటి గురించి మర్చిపోవటం చంద్రబాబు ప్రభుత్వ సహజలక్షణమని ఎద్దేవా చేశారు. 

టీడీపీ కార్యకర్తలకు పదవులివ్వడం, వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల ఆస్తులు ధ్వంసం, వారిపై దాడులు, హత్యలు చేయడం మీద ఉన్నదృష్టి ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీల అమలుపై లేదని మండిపడ్డారు.

Back to Top