ఈనాడు కథనమంతా అబద్ధాలు, అర్ధసత్యాలు

వైయ‌స్ జగన్‌పై రాజకీయ కక్షతోనే తప్పుడు కథనం

ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర

రాజకీయంగా మసకబార్చాలని చంద్రబాబుతో కలిసి వ్యూహం

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజం

ఈనాడు పత్రిక రాసినట్టు ఆ ఆరుగురు సాక్షులు కాదు

వైయ‌స్ జగన్‌ డ్రైవర్, జగన్‌ మామని సాక్షులుగా చూపించారు

అవినాశ్‌రెడ్డి నిర్దోషిగా రాకుండా కోర్టులను ప్రభావితం చేసే కుట్ర

సాక్షులు చనిపోవడంతో నిర్దోషిగా బయటపడ్డారని చిత్రీకరించే పన్నాగం

గుర్తు చేసిన పేర్ని నాని

వైయ‌స్ జగన్‌ వ్యక్తిత్వాన్ని కించపర్చేలా ఈనాడు తప్పుడు కథనాలు

నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు మొదలు ఇప్పటి వరకు అదే 

చంద్రబాబు ప్రయోజనాల కోసం ఈనాడు బరితెగించింది

చనిపోయే వరకు పోలీసుల భద్రత మ«ధ్య వాచ్‌మెన్‌ రంగయ్య

ఆయన సహజ మరణంపైనా లేనిపోని అనుమానాలు!

ఇది ప్రభుత్వం, పోలీసులు తమను తాము కించపర్చుకోవడం

రంగయ్య భద్రతను తగ్గించిన పాపం కూడా చంద్రబాబుదే

అయినా తప్పుడు సమాచారంతో జగన్‌పై విషం చిమ్మే కుట్ర

ప్రెస్‌మీట్‌లో పేర్ని నాని ఆక్షేపణ

పోలీసులపై వాచ్‌మెన్‌ రంగయ్య భార్య ఆరోపణ

సీఐడీ, సీబీఐ వాళ్లు తన భర్తను కొట్టారని ఆక్షేపణ

అందుకని ప్రభుత్వంపైనే కేసు నమోదు చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌సెల్‌ ప్రతినిధి సుదర్శన్‌రెడ్డి డిమాండ్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ లీగల్‌ సెల్‌ ప్రతినిధి జల్లా సుదర్శన్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) 

తాడేపల్లి: వివేకానందరెడ్డి వాచ్‌మెన్‌ రంగయ్య మరణంపై ఈనాడు పత్రిక రాసిన కథనమంతా అబద్ధాలు, అర్ధసత్యాలు అని, జగన్‌పై రాజకీయ కక్షతోనే తప్పుడు కథనం ప్రచురించి, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర చేశారని, అలా ఆయనను రాజకీయంగా మసకబార్చాలని చంద్రబాబుతో కలిసి వ్యూహం పన్నారని వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. ఈనాడు పత్రిక రాసినట్టు ఆ ఆరుగురు సాక్షులు కాదని, జగన్‌ డ్రైవర్, వైయ‌స్ జగన్‌ మామను కూడా వారు ఆ జాబితాలో చేర్చారని ఆక్షేపించారు. కేవలం వైయ‌స్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని కించపర్చేలా ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురిస్తోందన్న ఆయన, నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు మొదలు ఇప్పటి వరకు ఆ పత్రికది అదే అనైతిక తంతు అని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రయోజనాల కోసం ఈనాడు బరితెగించిందన్న ఆయన, చనిపోయే వరకు పోలీసుల భద్రత మధ్య వాచ్‌మెన్‌ రంగయ్య ఉన్నాడని గుర్తు చేశారు. అన్నీ తెలిసినా తప్పుడు సమాచారంతో జగన్‌పై విషం చిమ్మే కుట్రతోనే అసత్య కథనాన్ని ఈనాడు వేసిందని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో పేర్ని నాని తేల్చి చెప్పారు.

ప్రెస్‌మీట్‌లో పేర్ని నాని ఇంకా ఏం మాట్లాడారంటే..:

విషం చిమ్మిన ఈనాడు:
    వివేకా హత్య కేసుపై ఈనాడు మొదటి పేజీలో బ్యానర్‌ వార్తతో వైయస్‌ జగన్, వైయ‌స్ఆర్‌సీపీపై విషం చిమ్మింది. పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఇలాగే మరణించారని, జగన్‌ నేర రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు చంద్రబాబు సూచించినట్టు ఈనాడు తప్పుడు రాతలతో దిక్కుమాలిన కథనాన్ని అచ్చేసింది. ఇంకా దీన్ని తీవ్రంగా పరిగణించాలని పవన్‌ కళ్యాణ్‌ అన్నట్టు రాశారు. కానీ,  సుగాలి ప్రీతి దారుణహత్య, 30 వేల మంది మహిళల అదృశ్యం అంటూ ఆనాడు పవన్‌ అవాకులు, చెవాకులను మాత్రం వీరు తీవ్రంగా పరిగణించరు. 

చంద్రబాబు చెప్పారు. ఈనాడు అచ్చేసింది:
    వివేకా హత్య కేసులో ఆరుగురు సాక్షులు మరణించారని రాసుకొచ్చారు. వివేకా హత్య కేసులో వైయస్‌ జగన్‌ డ్రైవర్‌ నారాయణ యాదవ్‌ సాక్షిగా ఉన్నాడని పచ్చి అబద్దాలు రాశారు. చంద్రబాబు తన సహజ వైఖరి మేరకే వివేకా హత్యకేసులో 61వ సాక్షిగా ఉన్న వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగయ్య మరణాన్ని కూడా జగన్‌ మీద విషం చిమ్మడానికి వాడుకునేందుకు శ్రేయోపత్రిక ఈనాడులో అవాస్తవాలతో భారీ వార్తలను అచ్చేయించాడు. రంగయ్య మరణం గురించి కేబినెట్‌ మొత్తం సుదీర్ఘంగా చర్చించడమే కాకుండా, ఆగమేఘాల మీద డీజీపీని పిలిచి కేబినెట్‌ మొత్తం వాకబు చేసిందని చెప్పారు. అసలు ఈ రాష్ట్రంలో చర్చించడానికి ఏ సమస్యలు లేవా?  ప్రభుత్వం నెరవేర్చాల్సిన బాధ్యతలు లేవా? హామీల అమలులో విఫలమైన చంద్రబాబు ప్రజల దృషి మరల్చేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌కి తెర లేపాడు. 

చంద్రబాబుకు ‘వెన్నుపోటు’ తో పెట్టిన విద్య:
    చంద్రబాబుకి, తన కొడుకు నారా లోకేష్‌ రాజకీయ ప్రయోజనాలకు ఎవరు అడ్డొచ్చినా ఎల్లో మీడియాను ఉపయోగించి వారిని అప్రతిష్టపాలు చేయడం వెన్నుపోటుతో పెట్టిన విద్య. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను పాతాళానికి తొక్కేస్తున్నాడు. నాడు ఎన్టీఆర్‌ నుంచి నేడు జగన్‌ వరకు వ్యక్తిత్వ హననమే చంద్రబాబు లక్ష్యం. 
    ఎన్టీఆర్‌ను అప్రతిష్టపాలు చేసి సీఎం పదవిని కైవసం చేసుకోవడంలో భాగంగా, ఆయన సతీమణి లక్ష్మీపార్వతిపైకి కొడుకుల్ని ఉసిగొల్పడం దగ్గర నుంచి, నేడు వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని పల్చన చేయడం కోసం పదే పదే తప్పుడు వార్తలు రాయడం వరకు ఆయన రాజకీయ దురుద్దేశాలు ప్రజలందరికీ తెలుసు. 

దానికి.. జగన్‌కు ఏం సంబంధం?: 
    వైయస్‌ వివేకా మరణానికి వైయస్‌ జగన్‌కి ఏం సంబంధం? నాడు  సీబీఐని ప్రభావితం చేసి వైయస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని కేసులో ముద్దాయిలుగా ఇరికించిన చరిత్ర చంద్రబాబుది. ఆయన వెనుక  ఉన్న ప్రముఖ వ్యక్తి ఎవరనేది రాష్ట్రంలో చాలా మందికి తెలుసు. అవినాశ్‌రెడ్డి నిర్దోషిగా తేలిపోతాడని భయంతోనే ఇప్పట్నుంచే చంద్రబాబు తన కుట్ర రాజకీయాలకు పదును పెడుతున్నాడు. న్యాయ వ్యవస్థలను ప్రభావితం చేసేలా భారీగా తప్పుడు కథనాలు అచ్చేయిస్తున్నాడు. సాక్షులంతా చనిపోవడం వల్ల కేసు వీగిపొయిందనే భ్రాంతి ప్రజల్లో కల్పించాలనేది చంద్రబాబు తాపత్రయం. ఆరుగురు సాక్షులు వరుస క్రమంలో చనిపోతున్నారని ప్రజల్లో అనుమానాలు కలిగించేలా తప్పుడు సమాచారంతో వార్తలు అచ్చుగుద్దారు. 

ఇద్దరిది సహజ మరణం. ఒకరిది ఆత్మహత్య:
    వివేకా హత్య కేసులో జగన్‌ డ్రైవర్‌ నారాయణ యాదవ్‌ సాక్షి కాకపోయినా ఆయన మరణాన్ని వాడుకున్నారు. కల్లూరి గంగాధర్‌రెడ్డిని వివేకా హత్య కేసులో 243వ సాక్షిగా చేర్చారు. ఆయన దీర్ఘకాలంగా షుగర్‌ వ్యాధితో బాధపడుతూ చనిపోయాడని ఆయన కుటుంబసభ్యులే చెబుతున్నారు. ఈ గంగాధర్‌రెడ్డిని సీబీఐ అడిషినల్‌ ఎస్పీ రాంసింగ్‌ బెదిరించాడని.. వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పాత్ర ఉందని తప్పుడు వాంగ్మూలం ఇవ్వమని వేధించాడని అప్పట్లో ఎస్పీకి గంగాధర్‌రెడ్డి ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదు. దీంతో  తాడిపత్రి కోర్టులో సీబీఐ అడిషినల్‌ ఎస్పీ రాంసింగ్, నర్రెడ్డి సునీతరెడ్డి సమీప బంధువు బోనాల బాజిరెడ్డి, జగదీశ్‌ రెడ్డి మీద ఒక ప్రైవేటు కేసు నమోదు చేయడం జరిగింది. 
    గంగాధర్‌రెడ్డి చనిపోయాక ఆయన భార్య ఫిర్యాదుతో ఆ మృతిపై విచారణ జరిపి పోస్టుమార్టం రిపోర్టులో సహజ మరణంగా తేల్చారు. కానీ ఈనాడు మాత్రం ఆ మరణం హత్యగా చిత్రీకరించేలా వార్తలు రాసింది. దాన్ని జగన్‌కు ఆపాదించాలని కుట్ర చేస్తున్నారు.
    కటిక శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్‌ 2న ఆత్మహత్య చేసుకుని చనిపోతూ సూసైడ్‌ నోట్‌ లో పోలీసుల వేధింపుల వల్లే చనిపోతున్నానని లేఖలో రాశాడు. దీనిపై డీఎస్పీ స్థాయి అదికారి విచారణ జరిపి ఆత్మహత్యగానే నిర్ధారించి కేసును మూసేశారు. 
    వైయస్‌ అభిషేక్‌రెడ్డి ఆటో ఇమ్యూనిటీ అనే డిజార్డర్‌ కారణంగా మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో మరణిస్తే దాన్ని వివేకా హత్యకేసులో జగన్‌కు ముడిపెట్టి అనుమానాస్పదం అంటూ ప్రచారం చేస్తున్నారు. స్వయంగా డాక్టర్‌ అయిన అభిషేక్‌ రెడ్డి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జగన్‌తోపాటు, నర్రెడ్డి సునీతకు కూడా ఆయన దగ్గర బంధువే. వివేకా హత్యకేసులో అభిషేక్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వార్తల్లో అవాస్తవాలున్నాయని, తన స్టేట్‌మెంట్‌ను మార్చేశారని, తాను చెప్పిన దానికి భిన్నంగా రాశారని పులివెందులలో ప్రెస్‌మీట్‌ పెట్టి వివరించారు. ఆయనిచ్చిన స్టేట్‌మెంట్‌లో ఎక్కడా అవినాశ్‌రెడ్డి పేరు ప్రస్తావించలేదు. 
    వైయస్‌ భారతిరెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డి వివేకా హత్య కేసులో సాక్షి కాదు. ఆయన పోస్ట్‌ కోవిడ్‌ లక్షణాలతో సుదీర్ఘంగా ఆస్పత్రిలో చికిత్స పొందడంతోపాటు వయోభారంతో కన్నుమూశారు. అయినా ఆయన పేరును ఆరుగురు సాక్షుల వరుస మరణాలంటూ ఆ వార్తలో జోడించారు. నిజానికి ఆ వార్తలో రాసిన ఆరుగురిలో ముగ్గురే సాక్షులు. అందులో ఇద్దరిది సహజ మరణం. ఒకరిది ఆత్మహత్య.
    ఇప్పుడు వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగయ్య మరణం కూడా సహజ మరణమే. పోలీసు రికార్డుల ప్రకారం, రంగయ్య మరణించినప్పుడు ఆయన శ్రీమతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వారి కుటుంబానికి అప్పగించారు. 

రంగయ్య భద్రతను కుదించింది చంద్రబాబే:
    వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం ఉండగా సీబీఐకి లేఖ రాసి.. ‘విట్నెస్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌’ కింద రంగయ్యకు 24 గంటల పాటు సాయుధులైన సిబ్బందితో 2+2 పోలీస్‌ భద్రత కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదని భద్రతను 1+1కి కుదించారు. మేము చెప్పేది నిజమో కాదో చంద్రబాబు చెప్పాలి.  
    పోలీసుల భద్రత మధ్య జీవిస్తున్న రంగయ్య అనుమానాస్పదంగా చనిపోయాడని పోలీసులకు, చంద్రబాబుకి అనుమానం రావడం ఏంటో అర్ధం కావడం లేదు. పోలీసులు విచారణ చేసి రంగయ్య మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించి ఖననం చేసిన తర్వాత ఇప్పుడు మళ్లీ ఇంకోసారి అనుమానాలు వ్యక్తం చేస్తూ రీపోస్టుమార్టం చేస్తామంటున్నారు. దీనిపై మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. 
    పరిటాల రవి హత్య కేసులోనూ ముద్దాయిలు ఇలాగే చనిపోయారని నిస్సిగ్గుగా రాశారు. మరి 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అదికారంలో ఉన్నప్పుడు, ఆ విషయంపై ఎందుకు విచారణ చేయలేదు?. అప్పుడు పరిటాల సునీత మంత్రిగానే ఉన్నారు కదా?. 

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే..:
    ప్రత్యర్థులపై విషం చిమ్మి వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి రాజకీయంగా లేకుండా చేయాలనే కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని స్పష్టంగా తెలిసిపోతుంది. రంగయ్య మృతి కేసులో నివేదికలు రాక ముందే ఈనాడులో తప్పుడు వార్తలు అచ్చేసి జగన్‌ మీద విషం చల్లడం దేనికి సంకేతం? ఇది వ్యక్తిత్వ హననం కాదా?.
    వివేకా హత్య కేసులో సాక్షి కానటు వంటి జగన్‌ డ్రైవర్‌ నారాయణ మృతిపై దృష్టి సారిస్తామని ఎస్పీ చెప్పడాన్ని ఎలా చూడాలి? 2019లో అనారోగ్య కారణాలతో చనిపోయిన వ్యక్తిని కూడా రాజకీయ కుట్రలకు వాడుకునేంతగా చంద్రబాబు దిగజారిపోయారు. 
    ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని ప్రజలు ఎక్కడ నిలదీస్తారన్న భయంతో వారి దృష్టిని మరల్చడానికి వివేకా కేసు పేరుతో నిస్సిగ్గుగా తప్పుడు వార్తలు రాస్తున్నారు. తద్వారా వైయస్‌ జగన్‌పై బురద జల్లాలని చంద్రబాబు వ్యూహం. వాచ్‌మెన్‌ రంగయ్య వాంగ్మూలంలో అవినాశ్‌రెడ్డి పేరే లేనప్పుడు ఆయన మృతదేహాన్ని వెలికితీసి రీపోస్టుమార్టం చేయడం ద్వారా చంద్రబాబు ఏం సాధిస్తారని పేర్ని నాని నిలదీశారు.

ప్రభుత్వంపైనే కేసు నమోదు చేయాలి: జల్లా సుదర్శన్‌రెడ్డి.
– రంగయ్య మృతి కేసులో ప్రభుత్వం మీదనే కేసు నమోదు చేయాలి. ఎందుకంటే తన భర్తను సీఐడీ, సీబీఐ వాళ్లు తీవ్రంగా కొట్టి వేధించిన కారణంగానే, ఆయన అనారోగ్యానికి గురై మృతి చెందాడని, ఆయన భార్య చెప్పిన విషయం టీవీల్లో, సామాజిక మా«థ్యమాల్లో కనిపించింది. ఇప్పుడు దాన్ని కూడా డైవర్ట్‌ చేశారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి ఎంతసేపటికీ జగన్‌ను, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే కుట్రలు జరుగుతున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీని రాజకీయంగా అణచి వేయాలనే లక్ష్యంతో ఏ చిన్న కేసు దొరికినా వదిలిపెట్టకుండా విపరీతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
 

Back to Top