ఈనాడు దినపత్రిక కాదు.. చంద్రబాబు కరపత్రిక

పట్టాభి ఉదంతంతో ఈ విషయం మరోసారి తేటతెల్లమైంది

సోషల్‌ మీడియా ధాటికి ఈనాడు పత్రిక తప్పు ఒప్పుకుంది

ఇవి ఎల్లో మీడియా రోజులు కాదు.. సోషల్‌ మీడియా రోజులు

దుష్ప్రచారం చేసేటప్పుడు బ్యానర్‌ ఐటమ్స్‌.. సవరణకు మాత్రం సింగిల్‌ కాలమా..?

చంద్రబాబును రాత్రికి రాత్రే సీఎంను చేసేయాలని ఎల్లో మీడియా ఆరాటం

జర్నలిజం విలువలు, కట్టుబాట్లు, పద్ధతులను తెంచుకొని ఈనాడు బరితెగింపు రాతలు

2021 నాటి ఫొటోలు వేసి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ఎల్లోమీడియా దుష్ప్రచారం

గన్నవరంలో పథకం ప్రకారమే పట్టాభి డ్రామా క్రియేట్‌ చేశాడు

నారాయణ లాంటి వారి స్టేట్‌మెంట్లు, సర్టిఫికెట్లు ఎలా ఉంటాయో మాకు తెలుసు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు

కాకినాడ: ఈనాడు దినపత్రిక కాదు.. చంద్రబాబు కరపత్రిక అని పట్టాభి ఉదంతంతో పూర్తిగా తేటతెల్లం అయ్యిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పట్టాభి అనే వ్యక్తి జాతీయ నేతలా ఎల్లో మీడియా జాకీలు వేసి లేపుతోందని, ఇవి ఎల్లో మీడియా రోజులు కాదు.. సోషల్‌ మీడియా రోజులు అన్నారు. పట్టాభిని కొట్టారంటూ ఈనాడు పత్రిక పేజీలకు పేజీలు అబద్ధపు కథనాలు, ఫొటోలతో వండివార్చిందని, ఆ ఫొటోలు 2021 నాటివి అని వైయస్‌ఆర్‌ సీపీ సోషల్‌ మీడియా ప్రశ్నించడంతో సవరణ మాత్రం ఎవరికీ కనిపించని రీతిలో సింగిల్‌ కాలమ్‌లో వేసిందన్నారు. ఎల్లో మీడియా అని ముద్దుగా పిలుచుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అనుబంధ సంస్థలు వేస్తున్న వార్తలు, చేస్తున్న ప్రచారం, ప్రసారం చూస్తుంటే ఇంకా దిగజారిపోవడానికి వారికి మెట్లు ఏమీ లేవు అని నిరూపించుకుందన్నారు. కాకినాడలోని క్యాంపు కార్యాలయంలో కురసాల కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కన్నబాబు ఏం మాట్లాడారంటే..

విలువలన్నీ వదులుకొని తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని చంద్రబాబును ఏదోవిధంగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే లక్ష్యంతో ఈనాడు యాజమాన్యం పనిచేస్తోందని తేటతెల్లమైంది. ఒకప్పుడు జర్నలిజానికి విలువలు, కట్టుబాట్లు, పద్ధతులు ఉండేవి. వాటన్నింటినీ తెంచుకొని చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత, చంద్రబాబు చెప్పినట్టు నడుచుకునే బరితెగింపు ఈనాడులో కనిపిస్తోంది. 

చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ఈమధ్య కాలంలో రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ క్రమంలో కొంతమీద నాయకులను తయారు చేసుకునే పనిలో పడ్డారు. అందులో పట్టాభిరాం అనే వ్యక్తి ప్రమోట్‌ చేస్తున్నారు. టీడీపీ ప్రతిపక్షంలోకి వెళ్లినప్పటి నుంచి పట్టాభిని జాకీలు వేసి లేపుతున్నారు. పట్టాభి అనే వ్యక్తి గన్నవరం వచ్చి డ్రామా చేస్తే ఈనాడు పత్రిక చాలా దారుణంగా పట్టాభిని ముసుగులు వేసుకొని కొట్టేశారని ప్రచారం చేస్తోంది. నిన్న ఈనాడు పత్రికలో పేజీల కొద్ది వార్తలు వండివార్చారు. పట్టాభిని కొట్టిన దృశ్యాలు, రక్తం కారుతున్న కాళ్లు, చేతులు అని పెద్ద పెద్ద కథనాలు ఇచ్చారు. ఇవి ఎల్లో మీడియా రోజులు కాదు.. సోషల్‌ మీడియా రోజులు. ఒకప్పుడు ఎల్లోమీడియా ఏది రాస్తే అదే వార్త.. వారు ఏది చెబితే అదే ప్రవచనం అన్నట్టుగా నడిచింది. సోషల్‌ మీడియా గమనించి.. 2021 నాటి పట్టాభి ఫొటోలు వాటిని గన్నవరం ఘటనకు ఏ విధంగా ఆపాదిస్తారని ప్రశ్నిస్తే.. తప్పని పరిస్థితుల్లో తప్పు జరిగింది ఈనాడు ఒప్పుకుంది.. ఈ వార్తలోని ఫొటోలను నెట్‌ ఎడిషన్‌లోంచి కూడా తొలగించామని సింగిల్‌కాలమ్‌ సవరణను ఈనాడు పత్రిక వేసింది. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద బురదజల్లేందుకు బ్యానర్‌ కథనాలు వండి పేజీలకు పేజీలు నింపుతారు. అదే తప్పు జరిగిందంటే ఆ సవరణ ఫస్ట్‌ పేజీలో పైన వేయాలనే ఇంగితం మరిచారు. ఆ సవరణను వెతికి చదివే పరిస్థితి ఉండదు. మీ అబద్ధం అబద్ధంలాగే జనంలో ప్రచారం జరగాలి.. నిజాలు మరుగునపడిపోవాలి.. పాఠకులను క్షమించమని అడిగినట్టుగా ఉండాలనే ఈనాడు కొత్త విధానం. 

తప్పు చేసి సవరణలు అలాగేనా వేసేది. సవరణలు లోపలి పేజీల్లో చిన్న ముక్కలు వేసి.. బురదజల్లేటప్పుడు మాత్రం హింసాత్మకంగా కథనాలు రాస్తున్నారు. రాత్రికి రాత్రే సీఎం వైయస్‌ జగన్‌ను దించేసి.. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనేది ఎల్లో మీడియా కోరిక. లోకేష్‌ను రాజకీయాల్లో బాహుబలిగా చూపించాలని ఎల్లో మీడియా తపన. లోకేష్‌ను పులి అని ఎల్లోమీడియా అనుకుంటుంటే.. పులకేశి అని జనం అనుకుంటున్నారు. 

చంద్రబాబు, టీడీపీ మీద సానుభూతి రావాలని, వైయస్‌ఆర్‌ సీపీపై బురదజల్లాలని ఎల్లో మీడియా మూడున్నరేళ్లుగా చేస్తున్న కుట్ర ఇంకా పరాకాష్టకు చేరింది. నేరుగా అబద్ధాలనే ప్రింట్‌ చేస్తున్నారు. నెట్‌ ఎడిషన్‌ నుంచి ఫొటోలు తీసేశారు.. మరీ సర్క్యులేట్‌ అయిన పేపర్‌లో తప్పును ఇంటింటికి వెళ్లి ఎవరు చెబుతారు..? కేడర్‌ను ఉత్తేజంగా ఉంచేందుకు ఏడుస్తాడు.. ఏడ్చినట్టుగా ఫొటోలు వేయించుకుంటాడు. ఎన్టీఆర్‌ గతంలోనే చెప్పారు.. నన్ను మించిన మహానటుడు నా అల్లుడు అని చెప్పారు. ఈ నటనలు చూడలేకపోతున్నాం. ఈనాడు నిన్నటితో దినపత్రిక కాదు.. చంద్రబాబు కరపత్రిక అని పట్టాభి ఉదంతంతో పూర్తిగా తేటతెల్లం చేసుకుంది. పట్టాభి అనే వ్యక్తి జాతీయ నాయకుడిగా జాకీలు వేసి లేపుతున్నారు. టీడీపీ, ఎల్లో మీడియా చేష్టలకు జనం నవ్వుకుంటున్నారు. 

ఈరాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అగ్రస్థానం ఇచ్చి.. ఎమ్మెల్సీలను సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు. మొత్తం ఎమ్మెల్సీ స్థానాల్లో సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు, ఎప్పుడూ చట్టసభల గడపతొక్కని కులాలకు ప్రాతినిథ్యం కల్పించారు. దీని నుంచి డైవర్షన్‌ చేయాలనే కుట్రతో గన్నవరం స్టంట్‌ స్టార్ట్‌ చేశారు. గన్నవరం, గుడివాడలో వంశీకి, కొడాలి నానికి దీటుగా అభ్యర్థులను అదే కమ్యూనిటీ నుంచి వెతుక్కునే పనిలో పడ్డారు. పట్టాభిని గన్నవరం నుంచి అభ్యర్థిగా ఫోకస్‌ చేయాలని చూస్తున్నారు. ఆ క్రమంలోనే ఇదంతా చేస్తున్నారు. టీడీపీలో భజన బృందాలు, తప్పెటగుళ్లు, గరగ నృత్యాల బ్యాచ్‌లు ఉన్నాయి. దున్నపోతు ఈనిందంటే దూడెను కట్టేయండి అనే రాజకీయాలు చేస్తున్నారు. 

సీపీఐ నారాయణ స్టేట్‌మెంట్‌ ఈనాడు పత్రికలో వేశారు.. పట్టాభి చాలా మంచోడు ముసుగువేసి కొట్టొచ్చా.. అని మాట్లాడుతున్నాడు. పట్టాభిని ఎవరూ కొట్టలేదని పోలీస్‌ అధికారులు చెబుతుంటే.. వైద్య పరీక్షల్లో ఎప్పుడో 36 గంటల క్రితం చేతికి చిన్న గాయం ఉందని వైద్యులు సర్టిఫై చేశారు. కాళ్లు, చేతులకు గాయాలేమీ లేవని చెబుతున్నారు. వైద్యులు, పోలీసులు చెబుతుంటే దాన్ని పక్కనబెట్టి కొట్టేశారని ప్రచారం చేస్తున్నారు. 

నారాయణ లాంటి వారి స్టేట్‌మెంట్లు, సర్టిఫికెట్లు మాకు తెలుసు. చంద్రబాబుతో సీపీఐ, సీపీఎంను ఎప్పుడో కలిపేసినట్టుగా ప్రజలకు అర్థం అయ్యింది. సీపీఐని పూర్తిగా చంద్రబాబు పార్టీగా నడుపుతుంటే మీరు ఈ మాటలు కాకుండా ఏ మాటలు మాట్లాడుతారు.. పట్టాభి అనే టీడీపీ నాయకుడు మాట్లాడిన భాష తప్పుగా అనిపించడం లేదా..? ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ని, సీఎం సతీమణిని నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లో ఉన్నంత పాపాన ఇళ్లలో ఉన్న మహిళలను బూతులు తిడతారా..? సీఎం సతీమణిని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి విమర్శలు చేస్తుంటే నారాయణకు తప్పు అనిపించలేదా..? ఇష్టానుసారంగా మాట్లాడి.. మేం చెప్పిందే వేదం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తుంది కాబట్టి అదే ప్రజల్లోకి వెళ్తుంది అనుకుంటే పొరపాటు.. ఇది సోషల్‌ మీడియా రోజులు. ఎల్లో మీడియా రోజులు పోయాయి. అబద్ధాలు, వండివార్చిన కథనాలు నమ్మడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరు. 

Back to Top