ప్రజాశ్రేయస్సు కోసమే జీవో నంబర్‌ 1 తీసుకొచ్చాం

మాజీ మంత్రి కురసాల కన్నబాబు

విశాఖలమైన ప్రదేశాల్లో సభలకు అనుమతి ఉంది

జీవో 1 చీకటి జీవో ఏ విధంగా అవుతుందో ప్రతిపక్షాలు చెప్పాలి

రోడ్‌షోను, ర్యాలీని నిలుపుదల చేస్తామని జీవోలో ఎక్కడా లేదు

పోలీసు యాక్ట్‌కు లోబడే ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది

ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్డుపై సభలు కరెక్ట్‌ కాదు

కాకినాడ: ప్రజాశ్రేయస్సు కోసమే జీవో నంబర్‌ 1 తీసుకొచ్చామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రోడ్‌షోలు ఆపుతామని, ర్యాలీలు ఆపుతామని ఎక్కడా పేర్కొనలేదన్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రధాన రహదారులపై సభలు నిర్వహించవద్దని జీవో తెచ్చామన్నారు. జీవోలో ఏముందో తెలుసుకుని ప్రతిపక్షాలు మాట్లాడాలని హితవు పలికారు. పార్టీలను కట్టడి చేసేందుకు జీవో తెచ్చినట్లుగా చిత్రీకరిస్తున్నారు. కాకినాడలో శనివారం కన్నబాబు మీడియాతో మాట్లాడారు.

జీఓ నెం:1పై దుష్ప్రచారం:
    ప్రజల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం జీఓ నెం:1 జారీ చేస్తే, దానిపై రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతోంది. అది తనను అడ్డుకోవడానికే అని విపక్ష నేత చంద్రబాబు ఆరోపిస్తుండగా, ఆయనకు వత్తాసు పలుకుతున్న ఎల్లో మీడియా కూడా అదే ప్రచారం చేస్తోంది. ఆ విధంగా చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం.

జీఓ ఒక్కసారి చదవండి:
    ప్రజలను కాపాడడం ప్రభుత్వ కనీస బాధ్యత. అందు కోసమే జీఓ జారీ చేస్తే, చంద్రబాబునాయుడు తనను అణగదొక్కడానికే అని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఆ జీఓలో ఏముంది అన్నది ఒక్కసారి చంద్రబాబు, ఎల్లో మీడియా చూడాలి. చదవాలి. జీఓలో ఏముంది?. ఎక్కడా రోడ్ల మీద తిరగొద్దని, ర్యాలీలు నిర్వహించొద్దని, రోడ్‌షోలు వద్దని లేదు. కేవలం రహదారులు, వాటి పక్కల, మార్జిన్లలో బహిరంగ సభలు, సమావేశాలు నిషేధిస్తూ జీఓ జారీ చేశారు. అంతే కానీ ర్యాలీలు నిర్వహించొద్దని, పరిమితికి మించి ప్రజలు వెళ్లకూడదని, వాహనాలు వెళ్లకూడదని ఎక్కడా లేదే?.

కక్ష సాధింపు కాదు:
    కానీ చంద్రబాబుతో పాటు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎల్లో మీడియా కూడా జీఓపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. దాన్ని చీకటి జీఓ అని అభివర్ణిస్తున్నారు. కానీ చంద్రబాబు వైఖరి, ఆయన చేసిన పని వల్ల కందుకూరులో 8 మంది బలయ్యారు. ఆ తర్వాత గుంటూరులోనూ అదే జరిగింది. అక్కడ ముగ్గురు బలయ్యారు. ప్రజలను కాపాడడానికి, వారికి భద్రత కల్పించడం కోసమే జీఓ జారీ చేశారు తప్ప, ఎవరిపైనా కక్ష సాధింపు కాదు. 

కందుకూరులో అదే జరిగింది:
    జాతీయ రహదారులు.. రాష్ట్ర రహదారులు.. మున్సిపల్‌ రోడ్లు, పంచాయతీ రోడ్లు.. ఏవైనా ప్రజల రాకపోకలు, వాహనాలు రాకపోకలు, సరుకుల రవాణా కోసం వినియోగిస్తారు. వేగంగా గమ్యస్థానం చేరేలా రోడ్లు ఉంటాయి. వాటిపై బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తే రవాణాపై ప్రభావం ఉంటుంది. అంతే కాకుండా ఇరుకైన రోడ్ల మీద సభల వల్ల ప్రజల ప్రాణాలకు హాని కూడా కలుగుతోంది. కందుకూరులో జరిగింది అదే. కానీ ఆ జీఓను పూర్తిగా వక్రీకరించి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం.

నాడు చంద్రబాబు ఆంక్షలు విధించలేదా..:
    ఒకరేమో చీకటి జీఓ అంటున్నారు. మరొకరు బ్రిటిషర్లు తెచ్చిన పోలీస్‌ చట్టం అంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇవాళ దేశంలో అమలవుతున్న చట్టాలన్నీ పాతవే. కొత్తగా రూపొందించినవి కావు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు కూడా అవే చట్టాల ద్వారా ఆంక్షలు అమలు చేశారు. 2014–19 మధ్య తూర్పు గోదావరిలో ఇదే పోలీస్‌ చట్టంలోని సెక్షన్‌–30, 31ని చంద్రబాబు మూడేళ్లు నిర్బంధంగా అమలు చేశారు. అయినా ఇదే ఎల్లో మీడియా ఏనాడూ ప్రశ్నించలేదు. తప్పు పట్టలేదు. 
    కానీ అదే చంద్రబాబు ఇవాళ  జీఓ నెం:1ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఆయన నిర్బంధం అంటూ మాట్లాడుతున్నాడు. ఆయనకు తానా అంటే తందానా అనే కొన్ని పార్టీల వారూ అదే విమర్శిస్తున్నారు.

వీటికి సమాధానం చెప్పగలరా?:
    మేము ఒక విషయాన్ని సూటిగా అడుగుతున్నాం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక బలమైన కారణం కోసం ముద్రగడ పద్మనాభంగారు దీక్ష చేస్తే, ఏ చట్టం ప్రకారం ఆయనను నియంత్రించారు. 
ఆయనను పరామర్శించడానికి చిరంజీవి వస్తే, ఆయనను ఎందుకు అడ్డుకున్నారు. విశాఖలో జగన్‌గారిని ఎయిర్‌పోర్టులోనే ఎందుకు నిలువరించారు. అదే విధంగా అప్పటి ఎమ్మెల్యే, ఇవాళ్టి మంత్రి రోజాను జీపులో కుక్కి, ఎక్కడెక్కడో తిప్పి పంపించారు.
    కానీ అవేవీ ఇవాళ చంద్రబాబుకు వంత పాడుతున్న కొన్ని పార్టీలకు ఆనాడు కనిపించ లేదు. వారికి అవేవీ తప్పుగా అనిపించలేదు. దీనికి సమాధానం చెప్పగలరా?. ఆ ధైర్యం ఉందా?. అలాగే ఇప్పుడు జారీ చేసిన జీఓలో ఏం తప్పుంది? చంద్రబాబునాయుడు, ఆయనకు వంత పాడుతున్న పార్టీల నేతలు, ఎల్లో మీడియా సమాధానం చెప్పాలి.

సిగ్గు లేని చంద్రబాబు:
 ఇటీవలకాలంలో వరుసగా రెండు దుర్ఘటనల్లో 11 మందిని బలి తీసుకుని, ఇవాళ జీఓ జారీకి కారణం అయిన చంద్రబాబు, ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. దిక్కుమాలిన ప్రచారం చేస్తున్నారు. పనికిమాలిన రాతలు రాయిస్తున్నారు.
    గుంటూరు దుర్ఘటనలో ముగ్గురు చనిపోయినా, కనీసం పశ్చాతాపం కూడా వ్యక్తం చేయని చంద్రబాబునాయుడు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎన్నారైని సమర్థిస్తున్నాడు. ఆయనకు పదవి, అధికార దాహం తప్ప మరేమీ అవసరం లేదు. 
    కుప్పంలో ఆయనను అడ్డుకుంటున్నట్లు చెబుతున్నాడు. ఆయన కరోనా సమయంలో ఏపీలో కనిపించనే లేదు. గతంలో ఏనాడూ ఆయన ఇప్పటి మాదిరిగా కుప్పంలో పర్యటించలేదు. ప్రజలకు ఏవీ తెలియనట్లు చంద్రబాబు మాట్లాడుతున్నాడు. 

ఎల్లో మీడియా అన్నీ వదిలేసింది:
    చంద్రబాబుకు మనస్సాక్షి లేదు. చివరకు ఎల్లో మీడియాకు కూడా అది లేదు. మీకు జగన్‌గారిపై, వైయస్సార్‌సీపీపై ద్వేషం. కానీ ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు? వారి ప్రాణాలకు విలువ లేదా? చంద్రబాబును పూర్తిగా భుజాన వేసుకుని మోస్తున్నారు. ఆయన మోత కోసమే మీరు పని చేస్తున్నారు. సిగ్గు, శరం అన్నీ వదిలేశారు.
    జీఓ నెం:1 చీకటి జీఓ అయితే, మీరు 2014–19 మధ్య అమలు చేసిన చట్టాలే కదా మేము అమలు చేస్తోంది. నాటి పోలీస్‌ చట్టంలోని సెక్షన్‌–30ని చంద్రబాబు మూడేళ్లు నిర్బంధంగా అమలు చేశారు. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు. చంద్రబాబు ప్రచార దాహానికి గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయినా మీకు పశ్చాత్తాపం లేదు. ప్రజల ప్రాణాలంటే మీకు విలువ లేదు.

బాబు చేతకానితనం–ప్రభుత్వంపై బురద:
    కందుకూరులో ప్రభుత్వం కుట్ర చేసిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఆయనకు కనీసం సిగ్గు లేదు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. 14 ఏళ్లు సీఎం అంటాడు. ఆ ఘటనకు పూర్తిగా తానే బాధ్యుడు. అయినా సిగ్గు లేకుండా విమర్శలు. అంతలా ఆయన దిగజారాడు. చంద్రబాబు చేతకానితనాన్ని, ప్రభుత్వంపై బురద చల్లేందుకు ఎల్లో మీడియా ఉపయోగించుకుంటోంది. మీరు చంద్రబాబును ఎంతలా మోసినా, ఏ మాత్రం ప్రయోజనం ఉండదు.
    2014–19 మధ్య చంద్రబాబు అణిచివేత దారుణం. ఒక్క కాపుల మీదనే వందల కేసులు పెట్టారు. ఇవాళ కూడా చంద్రబాబు ప్రచార ఉన్మాదం వల్ల 11 మంది చనిపోయారు.

ఇకనైనా మారండి:
    ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలు గుర్తించాలి. ఎల్లో మీడియా పద్ధతి మార్చుకోవాలి. మీరు ఎన్ని కుట్రలు చేసినా, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రజల్లో రోజు రోజుకీ మరింతగా బలపడుతున్నారు. అందుకే 2024 ఎన్నికల్లో కూడా మళ్లీ ఆయనదే విజయం. కాబట్టి చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలి. ఆయన వంది మాగదులు కూడా వైఖరి మార్చుకోవాలి.
    చంద్రబాబు నిర్వాకం వల్లనే ఇది జరిగిందని, కొన్ని పార్టీలు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. కానీ ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం జీఓ జారీ చేస్తే, దాన్ని తప్పు పడుతున్నారు.

ప్రభుత్వం ఎలా కారణం?:
    కందుకూరు, గుంటూరు దుర్ఘటనలకు ప్రభుత్వ వైఫల్యం ఎలా కారణం? పోలీసులు ఎందుకు కారణం అవుతారు? ఇరుకు రోడులో మీటింగ్‌ పెట్టి, డ్రోన్‌ షాట్ల కోసం హంగామా చేశారు. తొక్కిసలాట జరిగి ప్రజలు చనిపోయారు. గుంటూరులో కానుకల పేరుతో పెద్ద ఎత్తున జనాల్ని పోగేశారు. కానీ అవి ఇవ్వకుండా వ్యవహరించడంతో దుర్ఘటన జరిగింది.

చంద్రబాబు–అబద్ధాల ఫ్యాక్టరీ:
    చంద్రబాబుకు రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒకటి హెరిటేజ్‌. రెండోది అబద్ధాల ఫ్యాక్టరీ. అందులో రోజూ అబద్ధాలు సృష్టిస్తాడు
ఆ అబద్ధాన్ని ప్రజల్లో వదులుతాడు. చంద్రబాబు సభల్లో ప్రాణాలు పోవడం వల్లనే.. ప్రజల భద్రత, రక్షణ కోసమే జీఓ నెం:1 జారీ చేశారు తప్ప, రోడ్లపై ర్యాలీలు, రోడ్‌షోల గురించి కాదని మాజీ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.

Back to Top