కూటమి దుర్మార్గపు ఏడాది పాలనకు 'తొలి అడుగు'

బాబు ష్యూరిటీ కాస్తా మోసం గ్యారెంటీగా మారింది

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం

సుపరిపాలనపై సీఎం నిర్వహించిన సమావేశానికి 56 మంది డుమ్మా

వీరిలో 15 మంది ఎమ్మెల్యేలు విదేశీ విహారం

చంద్రబాబు పాలనపై సొంతపార్టీలోనే ఏవగింపు

ప్రజా వ్యతిరేకత పెరిగితే కూటమి ఓటమి పాలు కాక తప్పదు

మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు

తాడేపల్లి: కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సుపరిపాలన కాదు, దుర్మార్గమైన పాలనకు పడిన తొలి అడుగు అని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకత పెరిగితే, కూటమి సైతం రానున్న రోజుల్లో ఓటమి పాలు కాక తప్పదని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 'బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ' కాస్తా నేడు చంద్రబాబు చేసిన దగాతో 'వెన్నుపోటు గ్యారెంటీ' అని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఇంటింటికీ వెళ్ళే కూటమి నాయకులకు త్వరలోనే ఇది అర్థమవుతుందని అన్నారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఏడాది పాలనలో చేసిన పనులను గురించి ప్రజలకు వివరించాలని ఇటీవల  చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగానే జూన్ 23న ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. జూన్ 29న ఒక సమావేశాన్ని నిర్వహించి, ఇది చాలా సీరియస్ విషయంగా తీసుకోవాలని పార్టీశ్రేణులను ఆదేశించారు. ఈ సమావేశంపై ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలను చూస్తేనే చాలా పేలవంగా జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ నేతల నుంచే దీనిపై స్పందన రాలేదని అర్థమవుతోంది. నిన్న జరిగిన సమావేశంలో 56 మంది నేతలు గైర్హాజరు అయితే, వీరిలో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది విదేశాల్లో విహరిస్తున్నారు. చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చి, వారితో రూ.50 కోట్ల మేరకు ఖర్చు చేయించారు. దీనివల్ల వారంతా తాము ఖర్చు చేసిన మొత్తాలను వసూలు చేసుకునేందుకు మద్యం, ఇసుక, గంజాయి వ్యాపారం, అక్రమ బియ్యం రవాణా, బదిలీలకు ముడుపులు తీసుకునే పనిలోనే తలమునకలు అయి ఉన్నారు. ప్రజల గురించి ఆలోచించే పరిస్థితిలో వారు లేరు. అయినా కూడా చంద్రబాబు తన పాలన మంచి పాలన, మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. 

మంచి ప్రభుత్వం కాదు - ముంచే ప్రభుత్వం

ఎన్నికలకు ముందు బాబు ష్యురిటీ-భవిష్యత్ గ్యారెంటీ అని చెబుతూ ఇంటింటికీ ఊదరగొట్టారు. ఏడాది పాలన తరువాత ఇది కాస్తా బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీగా మారిపోయింది. జనం ఇది మంచి ప్రభుత్వం కాదు, హామీలిచ్చి ముంచిన ప్రభుత్వమని చెప్పుకుంటున్నారు. ఏదైనా అబద్దాన్ని పదేపదే చెప్పి ప్రజలను నమ్మించవచ్చనేది చంద్రబాబు సిద్దాంతం. ఎల్లో మీడియా బలంతో ఆ అబద్దాన్ని నిరంతరం నిజంగా ప్రజల్లోకి తీసుకువెళుతుంటారు. ప్రజలు కూడా దీనిని క్రమంగా గ్రహిస్తున్నారు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోలేక పోవడం వల్లే ఓడిపోయామంటూ ఒక సిద్దాంతాన్ని ఆయన సూత్రీకరించారు. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన వాటిల్లో ప్రధానమైన హామీ రైతురుణమాఫీ. దీనికింద రూ. 87,612 కోట్లు మాఫీ చేసేస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే డ్వాక్రా మహిళ రుణమాఫీ అన్నారు. వీటిల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం వల్లే తుక్కుతుక్కుగా ఓడిపోయారు. ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేశాను. ఇదే విషయం ఇంటింటికీ వెళ్ళి చెప్పమంటున్నారు. 

చంద్రబాబు మాటలకు పాలనకు పొంతన లేదు

కూటమి ప్రభుత్వ ఏడాది కాలం పాలన పూర్తయ్యింది, ఈ ఏడాదిలో ఏం చేశారు? చేసిన పనులు పదేపదే చెప్పాలని చంద్రబాబు ఇంటింటికీ వెళ్ళి చెప్పాలని చంద్రబాబు దిశానిర్ధేశం చేస్తున్నారు. చేయని పనులు ఎందుకు చేయలేదో కూడా చెప్పాలని సూచిస్తున్నారు. అంటే తాను చేయలేని పనులకు ఖనాజా ఖాళీ అయ్యిందని, గత ప్రభుత్వం వల్లే ఇది జరిగిందంటూ మరోసారి వైయస్ జగన్‌పై బురదచల్లాలనే వ్యూహంతో చంద్రబాబు పనిచేస్తున్నాడు. మరోవైపు వైయస్ఆర్‌సీపీ నాయకులపై కక్షసాధింపుల్లో భాగంగా అక్రమ కేసులు బనాయించి, జైలుకు పంపాలన్న ధ్యేయంతో చంద్రబాబు ఉన్నారు. మరోవైపు ఆయన కుమారుడు లోకేష్ పూర్తిగా దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ ధనార్జనలో తలమునకలు అయి ఉన్నారు. క్యాష్ తీసుకోవడం, సూట్ కేసులు సర్ధడంలో మునిగిపోయారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనూ అమరావతి పేరుతో ఎంతో అవినీతికి పాల్పడ్డారు. గతంలో 55 వేల ఎకరాలు పూలింగ్ చేశారు. ఇప్పుడు మరో 45 వేల ఎకరాలు పూలింగ్ పేరుతో లాక్కుంటున్నారు. ఇవి కాకుండా రాజధాని నిర్మాణం పేరుతో రూ.52 వేల కోట్ల అప్పులు. నిర్మాణ సంస్థల నుంచి కమీషన్లు దండుకోవడం చేస్తున్నారు. బెల్ట్‌షాప్‌లు పెడితే బెల్ట్ తీస్తాను... గంజాయి అమ్మితే నడ్డి విరుస్తా... మహిళలపై చేయి పడితే, అదే వారి చివరి రోజు... అంటూ చంద్రబాబు పెద్దపెద్ద డైలాగ్‌లు చెప్పారు. చంద్రబాబుకు వంతపాడే మీడియా, ఆయన తాబేదారులు వీటికి సమాధానం చెప్పగలరా? రాష్ట్రంలో బెల్ట్‌షాప్‌లు లేని గ్రామాలు ఉన్నాయా? గంజాయి దొరకని ప్రాంతం ఈ రాష్ట్రంలో ఎక్కడుందీ? నిత్యం మహిళలపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. సాక్షాత్తు చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఒక మహిళలన చెట్టుకు కట్టేసి హింసించారు. అంటే ఆయన మాటలకు, జరుగుతున్న పాలనకు ఎక్కడైనా పొంతనా ఉందా?  చంద్రబాబు మాటలను ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. 

లోకేష్‌ చేతుల్లో చంద్రబాబు కీలుబొమ్మ

చంద్రబాబు పాలనలో ప్రభుత్వ శాఖలు సైతం నిర్వీర్యమయ్యాయి. లోకేష్ చేతుల్లోని విద్యాశాఖలో పదోతరగతి పరీక్షలు, మూల్యాంకనంను చూస్తే ఆయన సమర్థత అర్థమవుతుంది. తన శాఖను నడిపించడం చేతకాని లోకేష్ మిగిలిన హోంశాఖ, ఆర్థికశాలతో పాటు అన్ని శాఖల్లోనూ వేలు పెడుతుంటాడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని కూడా దాటిపోయి లోకేష్ పెత్తనం సాగుతోంది. సీఎం చంద్రబాబును కలవాలన్నా, ముందుగా లోకేష్‌ అనుమతిస్తేనే సాధ్యమవుతుంది. ఇటువంటి పాలనను సాగిస్తూ దీనిని సుపరిపాలనగా ఎలా చెప్పుకుంటున్నారు? ఇక చంద్రబాబు ఏ సమావేశంలో పాల్గొన్నా సరే తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం, మాజీ సీఎం వైయస్ పై విమర్శలు చేయడం మాత్రమే చేస్తున్నారు. వైయస్ జగన్ అంటే విపరీతమైన భయం, ఈర్షతో ఉన్నారు. వైయస్ జగన్ ఈ రాష్ట్రంలో ఎక్కడా తిరగకూడదనే అభధ్రతాభావంతో ఉన్నారు. 

చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది

చంద్రబాబు చేయిస్తున్న సర్వేల్లో తన పార్టీ ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందని లీకులు ఇస్తున్నారు. కానీ అదే టీడీపీ ఎమ్మెల్యేలు తమదే కాదు సీఎం గ్రాఫ్ కూడా పడిపోతోందని చెప్పుకుంటున్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోతోందనే విషయాన్ని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ఏడాదిలో ఇంతగా ప్రజల్లో గ్రాఫ్‌ పడిపోయిన ప్రభుత్వం ఇదే. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా మృగ్యం. పోలీస్ వ్యవస్థను పూర్తిగా రాజకీయకక్ష సాధింపులకు, వైయస్ జగన్‌కు భద్రత కల్పించకుండా, ఆయన పర్యటనల్లో ప్రజలు రాకుండా అడ్డుకోవడానికే వాడుకుంటున్నారు. పోలీస్ బలంతోనే రాజకీయంగా మనుగడ సాధించే నీచమైన సంస్కృతిని తీసుకువచ్చారు. ఆయన కుమారుడు ఎర్రబుక్, ఎర్రిబుక్ అంటూ రాష్ట్రాన్ని దిగజార్చుతున్నారు. ఇంటింటికీ వెళ్ళే వ్యవస్థలను నాశనం చేశారు. వాలంటీర్లను రోడ్డున పడేశారు. రేషన్ బియ్యం పంపిణీని అడ్డుకున్నారు. చివరికి దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లను పెద్ద ఎత్తున తొలగించే కుట్ర చేస్తున్నారు.  

వైయ‌స్ జగన్‌కు పెరగతున్న ఆదరణ చూసి భయపడుతున్నారు

వైయస్ జగన్‌ను నెల్లూరులో అడుగు పెట్టనివ్వనూ, హెలీకాఫ్టర్ ఎలా దిగుతుందో చూస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? వైయస్ జగన్‌ను కారులోనూ, హెలికాఫ్టర్‌లోనూ రానివ్వమూ అంటే, ఆయన కాలినడకన వెళ్ళాలన్నదే వారి ఉద్దేశమా? జనం నుంచి వచ్చిన జగన్ అదే జనం కోసం అలా కూడా వెళ్ళేందుకు సిద్దమే. ఏడాది కాలంలోనే వైయస్ జగన్‌కు ప్రజల్లో 40 శాతం నుంచి 60 శాతంకు ఆదరణ పెరిగినందుకే కూటమి ప్రభుత్వం భయపడుతోంది. పారిశ్రామికవేత్తలు చేసుకుటున్న సర్వేల్లోనే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని తేలడంతో, తమను ప్రశ్నిస్తున్నారని నారా లోకేష్‌ అంగీకరిస్తున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 15 సంవత్సరాలు కలిసే ఉంటామంటూ ప్రకటించారు. చంద్రబాబుతోనే ఉంటామని, ఆయనకే ఊడిగం చేస్తానని పవన్ కళ్యాణ్ అంటుంటే, మాకేం అభ్యంతరం?

Back to Top