కృష్ణా: చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా గుంటూరు సభలో దారుణ సంఘటన చోటుచేసుకుందని, కానుకలిస్తామని చెప్పి ముగ్గురు మహిళల ప్రాణాలను బలితీసుకున్నాడని మాజీ మంత్రి, గుడివాడ వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజమెత్తారు. గుంటూరు ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 420 చంద్రబాబు చనిపోయిన మహిళల కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. గుంటూరు తొక్కిసలాట ఘటనపై కొడాలి నాని స్పందిస్తూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో సభలకు జనాన్ని తీసుకువచ్చి వారి ప్రాణాలు తీస్తున్నారని, ఇరుకు సందులు చూసుకుని డ్రోన్ కెమెరాలతో షూటింగ్ చేసుకుంటూ అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నాడని మండిపడ్డారు. మొన్న కందుకూరులో 8 మంది ప్రాణాలను బలిగొన్నారన్నారు. కందుకూరు ఘటనకు చంద్రబాబు, లోకేష్, రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడిలను బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు. కానుకలిస్తామని పదిరోజుల నుంచి ప్రచారంతో ఊదరగొట్టారని, ఒక్కో మహిళకు మూడు చీరలిస్తామని చెప్పి 30 వేల టోకెన్లు పంచారన్నారు. కానుకలు, చీరలను ఇస్తామని దొంగమాటలు చెప్పి ముగ్గురిని బలితీసుకున్నారని కొడాలి నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన స్పీచ్ కోసం 2:30 గంటల నుంచి జనాన్ని నిలబెట్టారని, నలుగురికి చీరలు పంచి హడావుడి చేశారు. తొక్కిసలాట కారణంగా ముగ్గురు చనిపోయారన్నారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. చనిపోయిన వారి కుటుంబాల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుందన్నారు. చంద్రబాబుకి సిగ్గు, శరం లేదని, అధికారంలోకి రావడానికి ఎవరెలా చచ్చినా చంద్రబాబుకి అవసరం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. శనికి మరో రూపమే చంద్రబాబు. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడంతా నాశనమేనని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.