తాడేపల్లి: రాష్ట్రంలో గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ధాన్యంను కొనుగోలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. కమీషన్ల కక్కుర్తితో ధాన్యం కొనుగోళ్ళను పూర్తిగా దళారీల పాల్జేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తుండటంతో ధాన్యం పండించిన రైతుల గోడు అరణ్యరోదనగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. నాడు పారదర్శకంగా కొనుగోళ్లు: – రైతులే దేశానికి వెన్నెముక అని భావించిన వైయస్ జగన్ గారు తన పాలనలో అన్నదాతలకు అండగా నిలిచారు. ధాన్యం కొనుగోళ్ళకు అత్యంత పారదర్శకమైన విధానాన్ని అమలు చేశారు. ప్రతి సీజన్‌కు ముందుగానే వ్యవసాయ, పౌర సరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించి, అధికార యంత్రాంగాన్ని పూర్తిగా సన్నద్ధం చేసే వారు. – ఈ–క్రాప్ ద్వారా శాస్త్రీయంగా లెక్కలు సేకరించి, రైతుల కల్లాల నుంచి ధాన్యం మిల్లుకు చేరే వరకు అధికారులు పర్యవేక్షించే వారు. రైతుల నుంచి శాంపిళ్ళ సేకరణ, గన్నీబ్యాగులు, రవాణా వాహనాలను అందుబాటులో ఉంచడం, హమాలీలు, వారికి చెల్లించే ఛార్జీలు, రైతులకు చెల్లించే ధర ఇలా ప్రతి ఒక్కటీ ప్రణాళిక ప్రకారం అమలయ్యేది. – ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తే, ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలకు ఆ సొమ్ము జమ చేసేది. అలా ఎక్కడా దళారీలు లేని వ్యవస్థను మా ప్రభుత్వం అమలు చేసింది. కూటమి పాలనలో రైతుల దీనస్థితి: – కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దీనంగా మారింది. గన్నీ బ్యాగులు, హామాలీలు, రవాణా వాహనాలు అన్నీ కూడా దళారీల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. – మేం అమలు చేసిన ఈ–క్రాప్ విధానాన్ని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. పంట నష్టానికి ఇచ్చే బీమా కూడా ఇవ్వడం లేదు. ధాన్యం కొనుగోళ్లు పర్యవేక్షించాల్సిన పౌర సరఫరాల అధికారులు దేన్నీ పట్టించుకోవడం లేదు. దీంతో ఎక్కడికక్కడ కల్లాల్లో ధాన్యం గుట్టలుగా కనిపిస్తోంది. గిట్టుబాటు ధరకు ధాన్యం అమ్ముకోలేక రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. – జగన్ గారి ప్రభుత్వంలో పంట వేసుకోవడానికి ముందే తమకు రైతు భరోసా డబ్బు జమ అయ్యేదని, వర్షాల వల్ల పంట దెబ్బ తింటే, ఆ సీజన్ ముగియక ముందే పరిహారం లభించేందని రైతులు గుర్తు చేస్తున్నారు. నాడు ధాన్యం కొనుగోళ్ళకు రూ.65,225 కోట్లు: – టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య 17.94 లక్షల రైతుల నుంచి 2.65 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.40,236 కోట్లు చెల్లించారు. – అదే గత మా ప్రభుత్వ హయాంలో 37.70 లక్షల రైతుల నుంచి 3,40,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.65,225 కోట్లు చెల్లించాం. అంటే దాదాపు రెట్టింపు కొనుగోళ్లు, చెల్లింపులు జరిగాయి. – నేడు కూటమి ప్రభుత్వంలో బస్తాకు రూ.1720 ధర కూడా దక్కని దారుణమైన పరిస్థితి ఏర్పడింది. రైతుల సాక్షాత్తూ పౌర సరఫరాల శాఖ మంత్రిని కలిసి కన్నీళ్ళతో గోడు వెళ్లబోసుకున్నా, ప్రభుత్వంలో చలనం లేదు. (అంటూ ఆ వీడియో ప్రదర్శించిన మాజీ మంత్రి) – రైతుల కడగండ్లపై చివరకు ఎల్లో మీడియాలో కథనాలు వస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ, పలు కథనాలు చూపారు. జియో ట్యాగ్ ఎందుకు తీసేశారు?: – ధాన్యం తరలించే వాహనాలు దారి మళ్లకుండా దేశంలోనే తొలిసారిగా వాటిని జియో ట్యాగింగ్ చేశాం. దీని వల్ల బ్లాక్‌మార్కెట్‌కు అవకాశం లేకుండా పోయింది. – కూటమి ప్రభుత్వం రాగానే జియో ట్యాగ్ ఎందుకు తీసేశారు? పది శాతం కమీషన్ల కోసం రైతులను బలి చేస్తున్నారు. దళారీల వల్ల 75 కేజీల బస్తాకు రూ.325 రైతులు నష్టపోతున్నారు. – ఖరీఫ్ సీజన్ లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ అంటున్నారు. దీని ద్వారా దళారుల జేబుల్లోకి రూ.1,480 కోట్లు పోయాయి. మీ పాలన రైతులకు మేలు చేయడానికా? దళారీ వ్యవస్థను పెంచి పోషించడానికా? ఆ పీడీఎస్ బియ్యం ఏమైంది?: – తాము అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నామని, ఏకంగా 47 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకున్నామని కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. – మరి ఇప్పుడు ఆ బియ్యం ఏమైంది? ఆ బియ్యం అక్రమ రవాణాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రెండ్రోజులు కాకినాడలో హడావిడి, హంగామా తర్వాత బియ్యం అక్రమ రవాణా నిల్చిపోయిందా?. – ఇటీవలే సముద్రంలో బియ్యంతో కూడిన భారీ నౌక పట్టుబడిందని అధికారులు చెప్పారు. అసలు ఏం జరుగుతోంది?. – నిజానికి కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. మా ప్రభుత్వంలో పేదలకు నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ఏటా రూ.1800 కోట్ల వ్యయంతో సార్టెక్స్ బియ్యం సరఫరా చేశాం. కూటమి ప్రభుత్వం దానికి కూడా మంగళం పాడింది. – ఇప్పుడు ఏ మాత్రం నాణ్యత లేని బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇంకా మా హయాంలో రేషన్ షాపుల్లో బియ్యం, పంచదారతో పాటు, గోధుమపిండి, రాగిపిండి పంపిణీ చేశాం. ఇప్పుడు వాటిని కూడా కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గోధుమపిండి, రాగిపిండి తిరిగి సరఫరా చేయాలని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కోరారు.