అమరావతి: మేనిఫెస్టోను వంద శాతం అమలు చేయడం జవాబుదారితనం కాదా? అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాన కార్యక్రమంలో కన్నబాబు మాట్లాడారు. ఏం చేశారని టీడీపీ నేతలు ప్రజల వద్దకు వెళ్తారని ప్రశ్నించారు. మేం చేసింది చెప్పేందుకు గడప గడపకూ ధైర్యంగా వెళ్తున్నామన్నారు. చంద్రబాబుకు ఏ ఒక్క పథకం ఇది నాదే అని చెప్పుకునేందుకు ఏదీ లేదన్నారు. మా ప్రభుత్వం చేస్తున్న మంచిని ఒక్క రోజైనా ఎల్లో మీడియా చూపించిందా?
వైయస్ జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఎల్లోమీడియా కలలు కంటోంది. ఎన్ని అబద్ధాలు, ఎన్ని అవాకులు. మొన్ననే టీడీపీ నేత పట్టాభీ అనే నాయకుడు అవాస్తవాలు సృష్టిస్తే..ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. పాత ఫోటోలు పేపర్లో వేసి కొత్తగా చిత్రహింసలు పెట్టినట్లు చిత్రీకరించి భంగపడ్డారు. తెల్లవారగానే సవరణ ఇచ్చారు. ఎల్లోమీడియాకు మా నాయకుడు వైయస్ జగన్ మాత్రమే తట్టుకోగలరు. ఏం రాతలు రాస్తారో, ఏం బురద జల్లుతారో..కోవిడ్ సమయంలో నెగిటివ్‌గా ప్రచారం చేశారు. నిన్న, మొన్న ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్ అవార్డు వచ్చింది. అందరం సంతోషపడ్డాం. కేబినెట్‌లో కూడా అభినందించారు. నాటు నాటు పాటకు అవార్డు వచ్చింది. జయం జయం చంద్రన్న పాట ఆస్కార్‌కు నామినేట్ కాకపోవడం వల్లే నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చింది. తెల్లారి లేచి నటనలు, భజనలతో కాలం వెల్లదీసి..ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
పాలిటిక్స్‌లో జవాబుదారీతనం ఉండాలని ఒక నాయకుడు అంటున్నాడు. మూడేళ్లు గడవక ముందే మేనిఫెస్టోను 98 శాతం అమలు చేయడం జవాబుదారీతనమా?. మేనిఫెస్టోను దాచి మడత పెట్టిన పార్టీకి అకౌంటుబులిటీ ఉందా?. రుణమాఫీ ఎగ్గొట్టడం జవాబుదారీతనమా? రైతు భరోసా కింద చెప్పిన దానికంటే ఎక్కువ సాయం ఇవ్వడం జవాబుదారీతనమా? ఆలోచన చేయాలి. అక్కచెల్లెమ్మల బ్యాంకుల్లో బంగారం ఇంటికి తెప్పిస్తానని చివరికి పసుపుకుంకుమ రాయడం జవాబుదారీతనమా? అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పొదుపు రుణాలు మాఫీ చేస్తూ వైయస్‌ఆర్ ఆసరా ఇవ్వడం జవాబుదారీతనమా?. మీ ఊర్లో ఎవరికైనా పింఛన్ కావాలంటే పక్కింటి వారిలో ఎవరో ఒకరు చనిపోవాలని ఎదురుచూడటమా? అర్హత ఉంటే చాలు ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వడం జవాబుదారీతనమా?. ఎన్నికల హామీలు అమలు చేయడం జవాబుదారీతనం కాదా? జవాబుదారీతనం కోసం మాట్లాడుతున్న వారికి ఇవన్నీ ఎందుకు అర్థం కావడం లేదు. నిన్న జరిగిన ఓ మీటింగ్లో కులాల చక్రంలో ఇరికించారని ఓ నాయకుడు మాట్లాడారు. 1983 తరువాత కులాల చక్రంలో ఇరికించారా? 2019 తరువాత ఇరికించారా? సామాజిక న్యాయం అన్నది నినాదం కాదు..దాన్ని వాస్తవ రూపంలోకి తీసుకువచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం ఇచ్చారు. అన్ రిజర్వ్ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలను కూర్చోబెట్టడం జవాబుదారీతనం కాదా అని కన్నబాబు ప్రశ్నించారు.