కాకినాడ: కాకినాడ పోర్ట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పర్యటన సందర్భంగా మాట్లాడిన మాటలు ఆయన అసహాయతను, చేతకానితనంను చాటుతున్నాయని మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ పోర్ట్ కు వచ్చేందుకు గత ఆరు నెలలుగా తాను చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని డిప్యూటీసీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంలో ఆయన పరిస్థితిని తెలియచేస్తున్నాయని అన్నారు. ఆయను ఎవరు అడ్డుకుంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లయిస్ సీజ్ చేసిన బియ్యం విదేశీ నౌకలో ఎలా చేరింది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం రవాణాపై తనిఖీలు నిర్వహించారు. దాదాపు 54 వేల టన్నుల బియ్యాన్ని సీజ్ చేసినట్లు ప్రకటించారు. దీనిలో పేదలకు పంపిణీ చేయాల్సిన 1400 టన్నుల పీడీఎస్ బియ్యం ఉందని కూడా ఆయన మాట్లాడారు. ఈ బియ్యంను సివిల్ సప్లయిస్ విభాగం స్వాధీనంలోకి తీసుకుందని కూడా మంత్రి వెల్లడించారు. ఇదే క్రమంలో తాజాగా జిల్లా కలెక్టర్ విదేశాలకు తరలించేందుకు సిద్దం చేసిన ఒక నౌకలో ఉన్న బియ్యంలో 640 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఈ 640 టన్నుల బియ్యం కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీల సందర్భంలో సివిల్ సప్లయిస్ విభాగం సీజ్ చేసిన బియ్యమేనని కూడా కలెక్టర్ చెప్పారు. అంటే సివిల్ సప్లయిస్ విభాగం సీజ్ చేసిన బియ్యమే మళ్ళీ విదేశాలకు తరలి పోయేందుకు ప్రభుత్వమే వీలు కల్పించిందా? పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు? మరో వైపు అధికారులు మాట్లాడుతూ... సీజ్ చేసిన బియ్యాన్ని బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి రిలీజ్ చేశారని చెబుతున్నారు. బియ్యాన్ని రిలీజ్ చేసినప్పుడు సివిల్ సప్లయస్ శాఖ ఏదైనా షరతులు విధించిందా..? పేదలకు చెందాల్సిన బియ్యం విదేశాలకు ఎలా ఎగుమతి చేస్తున్నారు, దీని వెనుక ఎవరు ఉన్నారో బయటపెట్టాలి. ఎవరి మధ్య అవగాహనతో ఈ దందా నడుస్తుందో బయటపెట్టాలి. పోర్ట్ లోకి వచ్చే బియ్యంను తనిఖీ చేసేందుకు రెండు చెక్ పోస్ట్ లు ఉన్నాయి. వీటిని దాటి పీడీఎస్ బియ్యం ఎలా పోర్ట్ లోకి వస్తోంది? కాకినాడ పోర్ట్ లో భద్రతా వైఫల్యంకు మీదే బాధ్యత: రాష్ట్రప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈ పోర్ట్ లో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా... దానిని అరికట్టలేకపోవడం ఎవరి చేతకానితనం? మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారత భద్రతకు కాకినాడ పోర్ట్ నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. ఉగ్రవాదులు ఈ పోర్ట్ ద్వారా దేశంలోకి చొరబడతారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భద్రతా వైఫల్యంకు రాష్ట్రప్రభుత్వంది బాధ్యత కాదా? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కాకినాడ తీరప్రాంత బ్రాండ్ ఇమేజ్ కు విఘాతం కలిగిస్తున్నాయి: ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం రాష్ట్రప్రభుత్వ ఆధీనంలోని కాకినాడ పోర్ట్ లోని భద్రతా లోపాలపై అనుమానాలు వ్యక్తం చేయడంను చిన్న అంశంగా చూడలేం. ఇది కాకినాడ తీరప్రాంత బ్రాండ్ ఇమేజ్ కే విఘాతం కలిగిస్తుంది. స్టెల్లా ఎల్1 నౌక లోకి స్వయంగా జిల్లా కలెక్టర్ వెళ్లి పరిశీలించిన ఫొటోలు వీడియోలు చూశాం. అలాంటిది ఆ షిప్‌లోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్‌ని ఎందుకు అనుమతించలేదు..? అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది...? కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యథేచ్ఛగా రేషన్ బియ్యం దందా జరుగుతోంది. గత ప్రభుత్వాల్లో ఏదో జరిగినట్టుగా ఇంతకాలం అపోహలు సృష్టించారు. కానీ వాస్తవానికి కూటమి ప్రభుత్వంలోనే యథేచ్చగా అక్రమాలు జరుగుతున్నాయని నిన్న పవన్ కళ్యాన్ పర్యటనతో తేటతెల్లమైంది. ప్రభుత్వం వద్దనున్న బియ్యాన్నే విదేశాలకు ఎగుమతి చేసే నౌకలోకి చేర్చారంటే, వ్యవస్థలోనే లోపాలున్నట్టు స్పష్టంగా అర్థం అవుతోంది. పవన్ కళ్యాన్ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి: కాకినాడ పోర్ట్ ద్వారా అక్రమంగా రవాణా అవుతున్న పీడీఎస్ బియ్యం, పోర్ట్ భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. దీనిలో అసలు అక్రమార్కుల గురించి అధికారులు బయటకు చెప్పలేక పోతున్నారు. విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: రానున్న రోజుల్లో రాష్ట్రప్రజలపై పెద్ద ఎత్తున విద్యుత్ చార్జీల భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. జనవరి నుంచి వెయ్యి రూపాయలు విద్యుత్ బిల్లు వచ్చే వారికి రూ.రెండు వేల వరకు బిల్లు పెరిగే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ భారం మోపుతున్నారు. పైగా గత ప్రభుత్వం వల్లే చార్జీలు పెంచుతున్నామని సమర్థించుకోవడం దారుణం. మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచము, ట్రూఅప్ చార్జీలు ఎత్తివేస్తానంటూ చంద్రబాబు అనేక హామీలు గుప్పించారు. ఇప్పుడు విద్యుత్ చార్జీలను పెంచుతూ, ప్రజలపై భారం మోపేందుకు సిద్దమయ్యారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యేనాటికి మొత్తం డిస్కంలకు ఉన్న బకాయిలు రూ.29 వేల కోట్లు. 2019లో ఆయన దిగిపోయే నాటికి అది రూ.86వేల కోట్లకు చేరింది. కానీ ఈ నెపాన్ని వైయస్ జగన్ గారి మీదకు నెడుతున్నారు. విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయంను ఉపసంహరించుకోవాలి. తెలుగుదేశం పార్టీ కోసమే పురందరేశ్వరి మాట్లాడుతున్నారు: అదానీపై అమెరికన్ సంస్థలు చేసిన ఆరోపణల్లో ఏ నాయకుడు పేరు ప్రస్తావించలేదు. ఇదే విషయాన్ని విదేశాంగ మంత్రి కూడా స్పష్టం చేశారు. కానీ బిజేపి నేత, చంద్రబాబు వదినగారు పురందేశ్వరి మాత్రం జగన్ గారికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా మాట్లాడటంను ఎలా అర్థం చేసుకోవాలి? పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉండి తెలుగుదేశం కోసం మాట్లాడుతున్నారని అందరికీ అర్థమవుతోంది. హెరిటేజ్ నుంచి మనం పాలు కొంటున్నామంటే ఆ సంస్థ ఎవరి దగ్గర కొంటున్నదో మనం అడుగుతామా..? అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి విద్యుత్ కొంటున్నామంటే వారు ఎవరితో ఒప్పందం చేసుకున్నారో ప్రభుత్వానికి అవసరమా? ఎక్కువ రేట్లతో చంద్రబాబు చేసుకున్న ఒప్పందాల్లోనే అవినీతి: చంద్రబాబు రూ.4.63లకు విద్యుత్ ఒప్పందం చేసుకుంటే, అంతకు తక్కువగానే వైయస్ జగన్ గారు రూ.2.49 లకు ఒప్పందం చేసుకున్నారు. తక్కువ ధరకు విద్యుత్ ను కొనుగోలు చేస్తే అవినీతి జరిగిందని ఎలా చెబుతారు? యూనిట్ రూ.4.63లకు కొన్న చంద్రబాబు ఒప్పందంలో ఎంత అవినీతి జరిగిందో వెల్లడించాలి. అదానీని సీఎం గా ఉన్న సీఎం వైయస్ జగన్ కలిస్తే అవినీతి చేసేందుకే అని, సీఎంగా చంద్రబాబు కలిస్తే మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పుకోవడం దుర్మార్గం కాదా?