తాడేపల్లి: చంద్రబాబు సీఎంగా 2014-19 మధ్యలో అధికారాన్ని దుర్వినియోగం చేసి కోట్లాధి రూపాయల ప్రజాధనంను కొల్లగొట్టిన వైనంపై నమోదైన అవినీతి కేసులను ఈ రాష్ట్రం వెలుపల విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ నెల్లూరు పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ..సీఎం హోదాలో తనపైన గతంలో నమోదైన అవినీతి కేసులను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. గతంలో ఈ కేసులను నిస్పక్షపాతంగా విచారించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిన అధికారులపై నేడు సీఎంగా చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్లాన్ ప్రకారం బాబు అవినీతి కేసులు నిర్వీర్యం చంద్రబాబు సీఎంగా పాలించిన అయిదేళ్ళ కాలంలో రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాంల ద్వారా కోట్లాధి రూపాయల ప్రజాధనంను దోచుకున్నాడు. ముఖ్యమంత్రిగా ప్రజలకు మంచి పాలనను అందించాల్సిన చంద్రబాబు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడ్డాడు. దీనిపై వైయస్ఆర్ సిపి ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో పలు అక్రమాలు ఎపి సిఐడి, అలాగే కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లు వెలుగులోకి తీసుకువచ్చాయి. ఈ కేసుల్లో కొన్నింటిపైన న్యాయస్థానాల్లో ఇప్పటికే చార్జిషీట్ లు దాఖలయ్యాయి. మరికొన్నింటిపైన సమగ్ర ఆధారాలతో చార్జిషీట్లు దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే తన అవినీతి కేసులపై దృష్టి సారించారు. తనకు ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తన అవినీతి కేసులను ఒక ప్రణాళిక ప్రకారం నిర్వీర్యం చేస్తున్నాడు. రాష్ట్రంలో విధ్వంసకర పాలనకు చంద్రబాబు శ్రీకారం ఎపిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవస్థలన నిర్వీర్యం చేసింది. మరోవైపు సీఎం చంద్రబాబు విద్వంసకరమైన పాలనకు శ్రీకారం చుట్టాడు. దుష్ట సంప్రదాయాలను ప్రవేశపెట్టాడు. గత చంద్రబాబు తన పాలనలో అనేక అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డాడు. వాటిపై దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయి. ఈ రోజు అదే చంద్రబాబు సీఎంగా అధికారంలో ఉండటంతో తనపైన నమోదైన ఆ కేసులను ఎత్తివేయాలని చూస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్న వారు తన అవినీతిని ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులను బనాయించే దుష్ట సంప్రదాయాన్ని అమలు చేస్తున్నాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపైన ఉన్న కేసులు ఏ విధంగా నీరుగార్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కేసుల్లో ఆధారాలను తారుమారు చేసి, వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు అవినీతి బాగోతానికి ఇవిగో ఆధారాలు గతంలో సీఎంగా చంద్రబాబు చేసిన అవినీతిపై ఆధారాలను ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వివరిస్తున్నాం. చంద్రబాబు పాలనలో స్కిల్ డెవలప్ మెంట్, రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం, రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణాలపై వచ్చిన పలు అవినీతి ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా గత ప్రభుత్వం సిఐడిని ఆదేశించింది. సిఐడి వాటిపై కేసులు నమోదు చేసి విచారిస్తోంది. చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. తాజాగా చంద్రబాబు గతంలో తనపైన నమోదైన కేసులను నిర్వీర్యం చేస్తూ, వాటి నుంచి తప్పించుకునేందుకు, ఆ కేసుల్లో ఎక్కడ శిక్ష పడుతుందోనన్న భయంతో ఆధారాలను రూపుమాపుతున్నాడు. దీనికోసం ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని ఆనాడు విచారణాధికారులుగా ఉన్న వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. ఆ అధికారులపై తప్పుడు కేసులు బనాయించి, వారిని సస్పెండ్ చేయడం ద్వారా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాడు. అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్, మార్గదర్శి వంటి స్కాంలను విచారించిన వారిపై కక్షసాధింపులు ప్రారంభించారు. దానిలో భాగంగా డీజీ స్థాయిలో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులును సస్సెండ్ చేశారు. ఆనాడు సిఐడి చీఫ్ గా ఉన్న సంజయ్ పైన, మార్గదర్శి కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిన రామకృష్ణపైన కూడా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అనుకూలైన అధికారులను నియమించుకుంటున్నారు చంద్రబాబు తన పాత్ర ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందు ఆ కేసులతో సంబంధం ఉన్న శాఖల్లో తనకు అనుకూలమైన వారిని ముందుగా నియమించుకుంటున్నాడు. వారి ద్వారా ఆ ఫైళ్ళను ఆధారాలను ధ్వంసం చేస్తున్నాడు. ఈ కేసుల్లో ఎవరైనా న్యాయస్థానంకు వెళ్లినా, అక్కడ కూడా చుక్కెదురు కాకుండా ఈ రోజు ఢిల్లీ నుంచి ఒక లాయర్ను తీసుకువచ్చి, ఈ కేసులను ఎలా నీరుగార్చాలి, భవిష్యత్తులో దీనిపై ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎలా ఆధారాలను ధ్వంసం చేయాలనే దానిపై వ్యూహరచన చేశాడు. ఇదిప్రజాస్వామిక వ్యవస్థలో మంచిది కాదు. చంద్రబాబు బెయిల్ పై ఉన్నాడు. గతంలో అరెస్ట్ అయినప్పుడు ఎన్నోరకాల మాటలు మాట్లాడారు. జైలులో దోమలు కుడుతున్నాయి, తనకు తీవ్రమైన చర్మవ్యాదులు ఉన్నాయి, గుండె సంబంధ ఇబ్బందులు ఉన్నాయి, కంటికి ఆపరేషన్ చేయించుకోవాలంటూ ఎల్లో మీడియాలో రకరకాలు కథనాలు రాయించుకున్నారు. తరువాత బెయిల్ పై బయటకు వచ్చారు. ఆనాడు సాక్ష్యాలను తారుమారు చేయకూడదు, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదనే షరతులపైనే న్యాయస్థానం చంద్రబాబుకు ముందు తాత్కాలిక బెయిల్, ఆ తరువాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను గౌరవించకుండా ఈ రోజు ఆయన ప్రధాన నిందితుడుగా ఉన్న స్కిల్ స్కాం, ఇన్నర్ రోడ్ అలైన్ మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం, రాజధానిలో అసైన్డ్ ల్యాండ్ స్కాం లను చార్జిషీట్ ల దశలోనే నిర్వీర్యం చేయడం, కోర్ట్ లో ఆధారాలు లేకుండా దాఖలు చేసేలా తన అధికారంను దుర్వినియోగం చేస్తున్నాడు. ఆధారాలు లేకుండా చార్జిషీట్లు వేయాలని అధికారులపై వత్తిళ్ళు సాధారణంగా న్యాయస్థానం కాగ్నిజెన్స్ లోకి తీసుకునే ముందు కేసుకు సంబంధించి ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మళ్ళీ రికార్డులను సిఐడికి పంపి, పూర్తిస్థాయిలో చార్జిషీట్ ను వేయామని సూచిస్తాయి. దీనిపై దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలు అడిగిన అన్ని అంశాలను కూడా చార్జిషీట్ లో పొందుపరిచి, తిరిగి న్యాయస్థానంకు సమర్పించడం జరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబుపై ఉన్న కేసులకు సంబంధించి న్యాయస్థానం నుంచి అదనపు వివరాల కోసం వచ్చిన రికార్డ్స్ కు ఎటువంటి ఆధారాలను జోడించకుండా జాప్యం చేస్తూ, ఏదో ఒక విధంగా వాయిదాలు వేస్తున్నారు. చార్జ్ షీట్ లు వేయకుండా తప్పించుకుంటున్నారు. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలి మరోవైపు సుప్రీంకోర్ట్ లో 2023 డిసెంబర్ లో మా ప్రభుత్వం చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని పిటీషన్ వేసింది. కోర్ట్ ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారంటూ కోర్ట్ కు చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం మారగానే ఆ పిటీషన్ కు కూటమి ప్రభుత్వం ఎక్కడా సహకరించకుండా రాష్ట్ర ప్రభుత్వ తరుఫు న్యాయవాది వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నారు. ఈ మధ్య కూడా సుప్రీంకోర్ట్ దానిపైన తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. చివరికి తాను ఢిల్లీలో లేను, వర్చ్యువల్ విధానంలో హాజరవుతానంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. నేరుగా హాజరుకాకుండా వర్చ్యువల్ గా హాజరుకావడం సరికాదని కూడా సుప్రీంకోర్ట్ పదేపదే చెబుతోంది. ఎవరు ఎన్ని చెప్పినా న్యాయస్థానాలపైనా, ప్రజాస్వామ్యం పైనా చంద్రబాబుకు గౌరవం లేదు. చంద్రబాబు కోసమే నిబంధనలకు విరుద్దంగా అధికారులు పనిచేస్తున్నారు. చంద్రబాబుబెయిల్ రద్దు పిటీషన్ పై సుప్రీంకోర్ట్ విచారణను జనవరి రెండో వారంకు వాయిదా వేసింది. అడుగడుగునా అధికార దుర్వినియోగం స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబుకు సహకరించిన నిందితులను టిడిపి ఆఫీస్ లో కూర్చోబెట్టి తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పెండ్యాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయనకు డబ్బు సంచులు మోసిన వ్యక్తిగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆయన ఖాతాలకు జమ అయిన డబ్బులను డ్రా చేసి ఇచ్చారని సిఐడీ ఆధారాలను సేకరించింది. పెండ్యాల శ్రీనివాస్ విచారణకు హాజరైతే ఎక్కడ వాస్తవాలు బయటకు వస్తాయోనని అమెరికాకు పారిపోయాడు. వైయస్ఆర్ సిపి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏకంగా చంద్రబాబు సీఎం హోదాలో పెండ్యాల శ్రీనివాస్ పై ఎటువంటి విచారణ లేకుండా సస్పెన్షన్ ను ఎత్తివేయడంతో పాటు, పోస్టింగ్ కూడా ఇచ్చారు. ఇది అధికార దుర్వినియోగంకు పరాకాష్ట కాదా? ఇదిగో స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అవినీతికి ఆధారాలు... రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రూ.371 కోట్లు స్కాంకు పాల్పడ్డాడు. సీమెన్స్ ప్రాజెక్ట్ రూ.3300 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ తో రాష్ట్రంలో స్కిడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం పదిశాతం వాటాను భరిస్తే సరిపోతుందంటూ కొన్ని ఒప్పందాలను చేసుకున్నాడు. సీమెన్స్ నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఒక్క రూపాయి రిలీజ్ చేయకపోయినా, చంద్రబాబు మాత్రం ప్రభుత్వం తరుఫున పదిశాతం చెల్లింపులో భాగంగా రూ.371 కోట్లు రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ చేసిన సొమ్ము షల్ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబు వద్దకే వచ్చింది. ఇదంతా ఎపి సిఐడి ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. స్కిల్ స్కాంకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇడి ఇప్పటికే సీమెన్స్ కంపెనీకి సంబంధించి ముంబై, ఢిల్లీ, పూనే లోని ఆ సంస్థ కార్యాలయాల నుంచి రూ. 23 కోట్ల రూపాయల ఆస్తులను ఎటాచ్ చేసింది. ఇదే కేసులో ఎపి సిఐడి దర్యాప్తులో నకిలీ ఇన్వాయిస్ లు తయారు చేసి, దాని ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లుగా చూపించారని బయటపడింది. ఈ స్కాంలో జరిగిన ఒప్పందాలను చూస్తే ఏ విధంగా ప్రజాధనంను చంద్రబాబు స్వాహా చేశారో అర్థమవుతుంది. మీడియా ద్వారా వాటిని ప్రజల ముందు పెడుతున్నాం. ఈ స్కాంలో సుమన్ బోస్ అనే వ్యక్తి అప్పటి సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై, ఫైల్స్ పై రకరకాలుగా సంతకాలు చేశాడు. ఒక్కో ఒప్పందంపైన ఒక్కోరకంగా ఆయన సంతకం ఉందంటేనే ఈ ఒప్పందాల వెనుక ఉన్న అవినీతి బాగోతం అర్థమవుతోంది. ఈ రికార్డులను ఒకసారి పరిశీలిస్తే... ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండి, డిజైన్ టెక్, సీమెన్స్ ల మధ్య జరిగిన ఒప్పందాలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి అనే దానిలో కనీసం తేదీలు కూడా వేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది నిలువెత్తు స్కాం అనేదానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? ఇవ్వన్నీ ప్రభుత్వంలో ఉన్న రికార్డులు. సిఐడి తన దర్యాప్తులో గుర్తించిన ఆధారాలు. ఈ స్కాంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీఓ 90 లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ప్రస్తావించారు. కానీ ఒప్పందంలో మాత్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదాన్నే తీసేశారు. ఎంత అవినీతి దీనిలో జరిగిందో దీనిని బట్టి అర్థమవుతోంది. డిజైన్ టెక్ ను అడ్డం పెట్టకుని దోపిడీ సీమెన్స్ తో స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చేసుకున్న ఒప్పందం ప్రకారం థర్డ్ పార్టీకి ఈ కాంట్రాక్ట్ ను అప్పగించకూడదు అనే షరతు ఉంది. కానీ హటాత్తుగా డిజైన్ టెక్ అనే కంపెనీని తీసుకువచ్చి దానిని ఈ ఒప్పందాల్లో ఎలా భాగస్వామిని చేస్తారు? ఈ ఒప్పందానికి సంబంధించి సాక్ష్యులు కూడా లేకుండా, వారి సంతకాలు లేకుండానే అంత డబ్బు ఎలా విడుదల చేశారు? అంటే చంద్రబాబు చొరవతోనే ఈ డబ్బు విడుదల చేశారు, కాబట్టే కనీస నియమనిబంధనలను పాటించలేదు. రెండు బ్యాంక్ అకౌంట్ ల ద్వారా ప్రభుత్వం డిజైన్ టెక్ అనే కంపెనీకి డబ్బు విడుదల చేసింది. అక్కడి నుంచి షెల్ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబుకు చెందిన మనుషులకు చేరింది. దానిలో కీలకమైన వ్యక్తులు ఎలా డబ్బును మార్చుకుంటూ పోయారో సిఐడి దర్యాప్తులో గుర్తించింది. తరువాత సీమెన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ తో మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ దర్యాప్తు అధికారులకు లిఖితపూర్వకంగా వాగ్మూలం ఇచ్చారు. న్యాయస్థానం ముందు కూడా వాగ్మూలం ఇచ్చారు. అంటే చంద్రబాబు సీమెన్స్ కంపెనీని అడ్డం పెట్టుకుని ఎలా అవినీతికి పాల్పడ్డారో అర్థమవుతోంది. ఇదే కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా ఆస్తులను అటాచ్ చేసింది అంటేనే ఈ కేసులో ఉన్న తీవ్రత అర్థమవుతుంది. ఈ అవినీతి బాగోతం బయటపడకుండా మత్తం ఫైళ్ళను మాయం చేశారు. చివరికి ఫైనాన్స్ విభాగం దీనిపైన చేసిన అభ్యంతరాలను కూడా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ కేసులో ప్రస్తుతం సీఎంగా చంద్రబాబు తన అధికారంను వాడుకుని ఈ కేసులను నీరుగార్చాలని గతంలో సిఐడి చేసిన ఫోరెన్సిక్ ఆడిట్ ను పక్కకు పెట్టించి, తనకు అనుకూలమైన సంస్థతో ఆడిట్ చేయిస్తున్నాడు. ఫైబర్ నెట్ లోనూ చంద్రబాబు అవినీతి ఫైబర్ ఫ్రాడ్ లోనూ సీఎంగా చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఎపి సిఐడి తేల్చింది. తనకు సన్నిహితుడైన వేమూరు హరికృష్ణకు సంబంధించిన టెర్రా సాఫ్ట్ కంపెనీకి రూ.2000 కోట్ల ప్రాజెక్ట్ అప్పగిస్తూ, మొదటిదశలో రూ.333 కోట్ల పనులకు నిధులను విడుదల చేయించారు. దీనిని సిఐడి వెలుగులోకి తీసుకువచ్చింది. దానికి సంబంధించిన వివరాలను కూడా మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నాం. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ ను ఐటి శాఖ చేపట్టాల్సి ఉంది. కానీ విద్యుత్, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ద్వారా దీనిని చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ఎందుకంటే విద్యుత్, మౌలికవసతుల కల్పన శాఖ చంద్రబాబు ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి గుట్టుచప్పుడు కాకుండా తన ఆధీనంలోనే ఉన్న శాఖల ద్వారా దీనిని డీల్ చేయాలని అనుకున్నారు. దీనిలో చంద్రబాబు అవినీతి హస్తం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. వేమూరు హరికృష్ణకు చెందిన టెర్రాసాఫ్ట్ కు ఇవ్వాలని ముందే నిర్ణయించారు. ఇందుకోసం పక్కాగా కథ నడిపించారు. ఎపి ఈ-గవర్నింగ్ కౌన్సిల్ లో హరికృష్ణను ముందుగా సభ్యుడిని చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఫైబర్ నెట్ కు సంబంధించిన టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడుగా నియమించారు. ఎవరైనా ఎక్కడైనా ప్రాజెక్ట్ కు బిడ్ లు దాఖలు చేసే వారు, ఆ టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదు. నిబంధనలు అంగీకరించవు. కానీ నిబంధనలను తుంగలో తొక్కి ఆయననే సభ్యుడుగా పెట్టి, ఆయన కంపెనీకే టెండర్లు ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ లోని పరికరాలను నాణ్యత, మార్కెట్ సర్వే లేకుండా, ఎక్కువ రేట్లతో కొనుగోళ్ళు చేశారు. వేమూరి హరికృష్ణ, ఆనాడు ఫైబర్ నెట్ ఎండి కోగంటి సాంబశివరావు దీనిపై కీలకపాత్ర పోషించారని సిఐడి నిర్ధారించింది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న సంస్థకు ప్రాజెక్ట్ టెండర్లు టెర్రాసాఫ్ట్ ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియ నాటికి బ్లాక్ లిస్ట్ లో ఉంది. సివిల్ సప్లయిస్ లోని ఈ-పాస్ విధానంలో ఈ సంస్థ ఫెయిల్ అయ్యింది. దానికి చంద్రబాబు స్పెషల్ ప్రివిలైజ్ కింద వారి మీద ఉన్న బ్లాక్ లిస్ట్ ను తొలగించి, పోటీ లో ఉన్న మరో రెండు కంపెనీలను రకరకాల సాంకేతిక కారణాలతో అడ్డం తొలగించారు. కేంద్రప్రభుత్వ సంస్థలను కూడా రానివ్వకుండా, దానిని అభ్యంతరం పెట్టిన అధికారులను మార్చేసి, వేమూరు హరికృష్ణకు ఈ టెండర్లు ఇచ్చారు. దీనిద్వారా షెల్ కంపెనీలకు డబ్బును కట్టబెట్టారు. వాటి ద్వారా తిరిగి చంద్రబాబుకు ఈ డబ్బు చేరింది. 284 కోట్లు ఫైబర్ నెట్ ద్వారా షెల్ కంపెనీలకు, వాటి ద్వారా తిరిగి చంద్రబాబుకు చేరింది. కేసు నీరుగార్చేందుకు అనుకూలమైన అధికారులకు పోస్టింగ్స్ ఫైబర్ నెట్ లో తన అనుకూల మనుషులను నియమించుకుని, గతంలో సిఐడి ఇచ్చిన రిపోర్ట్ ను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. గతంలో అన్నీ సక్రమంగా జరిగాయనే విధంగా రిపోర్ట్ లు తయారు చేయించుకుంటున్నారు. చార్జిషీట్ లు దాఖలు చేయించకుండా జాప్యం చేయిస్తున్నారు. గతంలో స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్ కూడా దర్యాప్తు చేసిన ఈ కేసులో చార్జిషీట్ లోని అభియోగాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ లో భూమాయ రాజధాని ప్రాంతంలో తన బినామీ లింగమనేని రమేష్ కు మేలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడింది. ఈ కేసుపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విజయవాడ ఎసిబి కోర్ట్ లో చార్జిషీట్ దాఖలు చేశాయి. ఈ కేసును విచారించిన అధికారులపై నేడు చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు దిగాడు. ఇదే కేసులో లింగమనేని రమేష్ తో పాటు, ఆనాడు హెరిటేజ్ లో డైరెక్టర్ గా ఉన్న నారా లోకేష్ పైన కూడా దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేశాయి. గతంలో చంద్రబాబు సీఆర్డిఎ చైర్మన్ గా, నారాయణ వైస్ చైర్మన్ గా ఉన్న సమయంలో ఈ కుంబకోణం జరిగింది. ప్రారంభంలో రాజధానిలో ఉన్న లింగమనేని భూములకు మార్కెట్ విలువ రూ. 177 కోట్లు ఉంది. రాజధాని ప్రకటన తరువాత దాని విలువ రూ.877 కోట్లకు చేరింది. లింగమనేని భూములకు పెద్ద ఎత్తున మార్కెట్ విలువ పెంచేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చిన తరువాత ఇదే భూముల విలువ రూ.2130 కోట్లకు చేరింది. ఇది దోపిడీ కాదా? ఈ కేసులను మూసేందుకు తమకు అనుకూల అధికారులను నియమించుకుని, స్టేట్ మెంట్లను తయారు చేయించుకుంటున్నారు. గతంలో వేసిన చార్జిషీట్ లను నీరుగార్చడం, కొత్తగా చార్జిషీట్ వేయాల్సి ఉంటే, ఆధారాలను మాయం చేసి, కేసులు తేలిపోయేలా నివేదికలను సిద్దం చేసుకుంటున్నారు. అందుకే ఈ కేసులపై విచారణ ఎపిలో జరగకూడదని వైయస్ఆర్ సిపి డిమాండ్ చేస్తోంది. ప్రజాధనంను దోచుకున్న దొంగలకు శిక్ష పడాలంటే రాష్ట్ర వెలుపలే ఈ కేసులను విచారించాలి. గతంలో పలు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులను పక్క రాష్ట్రాల్లో విచారించాయి. దీనిపై వైయస్ఆర్ సిపి న్యాయపోరాటం చేస్తుంది.