ఎన్టీఆర్ జిల్లా: ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైయస్ఆర్‌సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క హామీనీ పూర్తిగా అమలు చేయలేదని, మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ జూన్ 4న 'వెన్నుపోటు దినం' పేరుతో నిరసనలు చేపట్టి చంద్రబాబు కళ్ళు తెరిపిస్తామన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు యన్.టి.ఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 4వ తేదీన జరిగే "వెన్నుపోటు దినం పోస్టర్ ను పార్టీ నేతలతో కలిసి జోగి రమేష్ ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన 'వెన్నుపోటు దినం' కార్యక్రమం జయప్రదం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా జోగి రమేష్ ఏమన్నారంటే.. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ, అరాచక విధానాలను పరిచయం చేసింది. కూటమి పార్టీలు మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి జూన్ 4వ తేదీకి ఏడాది అవుతోంది. ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, అడ్డంగా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దానిని ప్రశ్నించకుండా రాష్ట్రంలో ప్రభుత్వమే భయోత్పాతాన్ని సృష్టించిన చరిత్ర కూడా ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు. అధికారంలో వచ్చిన తొలిరోజు నుంచే ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ, ఏడాదిలోనే తొంబై తొమ్మిదిశాతం అమలు చేసిన ఘనత వైయస్ జగన్ గారిది. అలాగే విప్లవాత్మక వ్యవస్థలను సృష్టించి, ఆచరణలోకి తీసుకువచ్చి, ప్రజల వద్దకే సుపరిపాలనను తీసుకువెళ్ళి అందించి చరిత్ర సృష్టించారు. దానికి భిన్నంగా ఆ వ్యవస్థలను విధ్వంసం చేస్తూ, అరాచక పాలనను ఏడాదిలోనే చంద్రబాబు ప్రజలకు చవి చూపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి దారుణాలకు పాల్పడవచ్చో కూడా చంద్రబాబు నిరూపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఆనాడే వైయస్ జగన్ స్పందిస్తూ, వాటిని అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదని, ప్రజలను మోసం చేయడానికే ఇటువంటి హామీలు ఇస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం చాలా కష్టమని చెబుతున్నారు. సంపద సృష్టిస్తానని, పేదల బతుకుల్లో వెలుగులు తీసుకువస్తానంటూ మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు పీ-4 అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. పేదరికంను నిర్మూలించే బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి మోసం బహుశా ఎక్కడా మనకు కనిపించదు. 1995లో సొంత మామనే వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తరువాత 1999, 2014, 2024లోనూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. గతంలొ హామీలను అమలు చేస్తానంటూ అబద్దాలు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు బరితెగించి, హామీలను అమలు చేయడం కుదరదంటూ అడ్డంగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు సీఎంగా తొలి ఏడాదిలోనే రూ.1.49 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆ సొమ్ము దేనికి వినియోగించారో తెలియదు. ఆనాడు మామకు వెన్నుపోటు పొడిస్తే, ఈ రోజు నేరుగా తనను నమ్మి ఓటు వేసిన ప్రజలకే వెన్నుపోటు పొడిచారు. దీనిని ప్రశ్నిస్తూ వైయస్ఆర్‌సీపీ వెన్నుపోటు దినంను నిర్వహిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు ర్యాలీలుగా వెళ్ళి స్థానికంగా ఉన్న అధికారులకు మెమోరాండంలు సమర్పించనున్నాం. ఎన్నికల హామీలను అమలు చేయాలని, ఈ ఏడాది కాలంగా ప్రజలకు ఇస్తామన్న అన్ని పథకాల లబ్ధిని దానిని తక్షణం విడుదల చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు మోసపోయిన ప్రజలు కూడా పాల్గొని, ప్రభుత్వాన్ని నిలదీయాలి.