సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ

నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటాయి.

తల్లికి వందనం, రైతు భరోసా ఒక్కరికైన ఇచ్చారా.

ఖరీఫ్ ముగుస్తున్నా ఒక్క పైసా రైతు ఖాతాల్లో పడలేదు.

విశాఖపట్నం: సూపర్‌సిక్స్‌ హామీల అమలుకు ముహూర్తం ఎప్పుడని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్ర‌శ్నించారు. ఎన్నికల హామీల అమలును కూటమి ప్రభుత్వం విస్మరించింది. సూపర్‌ సిక్స్‌ హామీల అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో సామాన్యులకు ఇసుక దొరకడం లేదు. విశాఖలో రూ.10వేలు, విజయనగరంలో రూ.7 వేలకు ఇసుక దొరకాలి. ఇప్పుడు దొరుకుతోందా? ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందిపడుతున్నారని బొత్స మండిపడ్డారు. శనివారం విశాఖ‌లో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. 

బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇంకా ఏమన్నారంటే..

రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక, మద్యం మాఫియాలు పని చేస్తున్నాయని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం సరైన కసరత్తు చేయకుండానే ఇసుక, మద్యం పాలసీలు ప్రకటించిందని, అందుకే ఆ రెండింటి అమలులో పిల్లిమొగ్గలు వేస్తోందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని ఏయే మద్యం బ్రాండ్స్‌ తొలగించారు?. అలాగే మద్యం ధరలు ఎంతెంత తగ్గించారో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ అంతులేని దోపిడి, ఎమ్మెల్యేల అరాచకాలు కొనసాగుతున్నాయని, నిత్యావసరాల ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని ఆక్షేపించారు.
  

విజయనగరం జిల్లా గుర్ల మండలంలో కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డయేరియాకు 11 మంది బలయ్యారని బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. గ్రామంలోని నీటి సరఫరా పనులను గుప్పిట్లో పెట్టుకోవడం కోసం స్థానిక కూటమి పార్టీల నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే మంచినీరు కలుషితం అయిందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రామాల్లో మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని, వ్యాధితో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందజేయాలని బొత్స సత్యనారాయణ కోరారు. 
    

ఉచిత ఇసుక అని ప్రకటించి రోజుకో రకంగా ప్రజలు, నిర్మాణ రంగ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పుడు సీనరేజ్‌ రద్దు అని ఆర్భాటంగా ప్రకటించినా, దాని వల్ల కలిగే ప్రయోజనం పదుల రూపాయల్లోనే అని గుర్తు చేశారు. ఇసుక ధర వేలల్లో ఉండగా, ఊరట పదుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక విక్రయాల వల్ల ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చిందన్న ఆయన, ఇప్పుడు ఆ ఆదాయం పోగా, ఇసుక ధర కూడా దారుణంగా పెరిగిందని గుర్తు చేశారు. లారీ ఇసుక రూ.9 వేలలోపు ఎప్పుడందిస్తారో చెప్పాలని కోరారు.
  

 మద్యం విక్రయాలపై వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై దారుణ విమర్శలు చేసిన టీడీపీ కూటమి, అధికారంలోకి వచ్చిన తర్వాత అవే బ్రాండ్లను, అదే ధరకు అమ్ముతోందని మండలి విపక్షనేత ప్రస్తావించారు. నిత్యావసరాల ధరలు మండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్ధం కావడం లేదని అన్నారు.
  

 ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించాల్సి ఉన్నప్పటికీ, గ్రామాల్లో ఎక్కడా ఆ పరిస్థితి లేదని, ప్రైవేటు దుకాణాల్లో ఎక్కువ ధరలకు రైతులు కోనుగోలు చేయాల్సిన దుస్థితిని రాష్ట్రానికి తెచ్చారని బొత్స మండిపడ్డారు. తల్లికి వందనం సహా సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
  

 కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఆరు నెలలు వరకు వేచి చూసి ప్రశ్నిద్దామనుకున్నామని, కానీ ఇప్పుడు పరిస్థితులు చూశాక, మూడు నెలలకే కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టామని  మండలి విపక్ష నేత స్పష్టం చేశారు. ఐదేళ్లు పాలించే అవకాశం లేదని, రెండున్నరేళ్ల తర్వాత జమిలీ ఎన్నికలు వచ్చే వీలుందని సీఎం చంద్రబాబు తన పార్టీ నేతల సమావేశంలో వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాము కూడా బాధ్యత గల విపక్షంగా ఆరు నెలల గడువును కుదించి, మూడు నెలలకే హామీల అమలుపై నిలదీయాలని నిర్ణయానికి వచ్చామని ఆయన వెల్లడించారు.

Back to Top