నెల్లూరు: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగంను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచక పాలనకు తెగబడిందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ పీఏసీ మెంబర్ పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు. చంద్రబాబుకు తెలిసిందల్లా రాజకీయ కక్ష సాధింపు, ప్రతిపక్షంపై అక్రమ కేసులు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల అరెస్టులు మాత్రమేనని ధ్వజమెత్తారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా డీజీ ర్యాంకు అధికారి సహా మాజీ ఐఏఎస్‌లను కూడా వదలకుండా అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున దుర్మర్గపు పాలనను చూస్తున్నామని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. రాష్ట్రంలో ప్రతిపక్షంను అణిచివేయడానికి, తప్పుడు కేసులతో భయపెట్టడానికి చంద్రబాబు చేస్తున్న దిగజారుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం కక్షసాధించాలనే లక్ష్యంతోనే, సంబంధం లేని అధికారులకు కూడా అవినీతి బురద అంటిస్తున్న చంద్రబాబు దాష్టికాన్ని ప్రజలు ఏవగించుకుంటున్నారు. సీఎంఓలో పనిచేసిన మాజీ ఐఎఎస్ అధికారి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిల అక్రమ అరెస్ట్ నేడు ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి ప్రత్యర్థులను వేధింవచ్చని చంద్రబాబు మాకు నేర్పుతున్నారు. రాజకీయ నాయకులకే పరిమితమైన కేసులను అధికారుల మీద కూడా నమోదు చేసి ఏపీలో పనిచేయాలంటేనే బ్యూరోక్రాట్స్ భయపడేలా చేస్తున్నారు. రెడ్ బుక్ పరిపాలన చూడటానికేనా ఓటేసింది అని ప్రజలిప్పుడు ఆవేదన చెందుతున్నారు. మైనింగ్ మాఫియాను పెంచి పోషిస్తున్న చంద్రబాబు నెల్లూరు జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు మైనింగ్ మాఫియాను పెంచి పోషిస్తున్నారు. ఈ మాఫియా కారణంగా నెల్లూరులో మైనింగ్ నిలిచిపోయి వేలాది కుటుంబాలు ఉపాధి లేక అల్లాడిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో దాదాపు 180 మైన్లు ఉంటే అందులో కేవలం 25 నుంచి 30 మాత్రమే నడుస్తున్నాయి. అది కూడా ఫైన్లు వేసిన మైన్స్ ఓపెన్ చేసి, మైనింగ్ చేస్తున్నారు. ఎటువంటి జరిమానాలు లేకపోయినా అనేక క్వారీలు ఇంకా మూతపడే ఉన్నాయి. దీనికి కారణం ఆయా క్వారీ యజమానులు ఎంపీ వేమిరెడ్డ మైనింగ్ మాఫియాను అంగీకరించకపోవడమే. వీటిని గతంలోనే అన్ని అధారాలతో సహా మీడియా ముందు చూపించడం జరిగింది. వీటిపై వారం రోజుల్లో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరినా, ఇప్పటి వరకు ఎటువంటి స్పందనా లేదు. వేమిరెడ్డి చేస్తున్న మైనింగ్ మాఫియాపై మాట్లాడితే ఆయన కంపెనీ పెట్టుకోవడం తప్పా అంటూ టీడీపీ నాయకుడు బీదా రవిచంద్రయాదవ్ వత్తాసుగా మాట్లాడారు. తాను తప్ప ఇంకెవరూ మైనింగ్ వ్యాపారాలు చేసుకోకూడదన్న ఎంపీ దురాశ కారణంగా నెల్లూరు జిల్లాలో దాదాపు 10 వేల మంది ఉపాధి కోల్పోతున్నా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించక పోవడం దుర్మార్గం కాదా? 260 మందికి పైగా క్వార్ట్జ్ ఎగుమతిదారులుంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన కంపెనీ ఒక్కటే వ్యాపారం చేయడం వెనుక మతలబు ఏంటని అడుగుతుంటే సమాధానం లేదు. ఎవరైనా ఎక్స్‌పోర్ట్ చేసుకుందామని పోతే వారిని బెదిరిస్తున్నారు. రూ.7 కోట్లు ఫైన్లున్న భరత్ బాబు చౌదరి, 30 వేల టన్నులు అక్రమ మైనింగ్ చేశాడని మాల్యాద్రి నాయుడు మీద ఈ ప్రభుత్వం రూ. 3 కోట్లు ఫైన్ వేసింది. ఇలాంటి వ్యక్తులతో మేము సంతోషంగా మైనింగ్ చేసుకుంటున్నామని మాట్లాడించడం హాస్యాస్పదం. ఈ మైన్లన్నీ ఓపెన్ చేస్తే ప్రభుత్వానికి రూ. 400 నుంచి రూ. 500 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఎంపీ మైనింగ్ అక్రమాలపై నేను ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత కొంతమందిని పిలిపించుకుని మాట్లాడుకున్నారని తెలిసింది. లోకల్ మైన్లన్నీ ఎంపీ కంపెనీకి చేయాలట. ఎక్స్‌పోర్టర్ చైనా కంపెనీకి అమ్ముకుంటామని వాళ్లతో చెప్పారు. ఇదంతా నిబంధనలకు విరుద్ధమైంది. ఇదే జరిగితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ కావడం తథ్యం. లీజు గడువు ముగిసిన మైన్స్‌లో అక్రమ మైనింగ్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఫ్యాక్టరీ పెడతానన్నాడు. ఎప్పుడు పెడతాడు. ఎక్కడ పెడతాడో చెప్పడం లేదు. ఫ్యాక్టరీకి ఇంకా శంకుస్థాపన చేయకుండానే వేల టన్నులు చైనాకి ఎక్స్‌పోర్టు చేస్తున్నాడు. చైనాలో ఫ్యాక్టరీ పెడతాడా? పది వేల టన్నులు ఎక్సపోర్ట్ చేస్తే రూ. 5 కోట్లు వస్తుంది. దానికోసం వేల మంది కార్మికులను, ఎక్స్‌పోర్టర్లను, మైనింగ్ వ్యాపారులను రోడ్ల పాలు చేస్తున్నాడా? అని ఆరాతీస్తే దీనివెనుక భారీ కుట్ర దాగి ఉందని తెలిసింది. సిద్ధివినాయక, కేఎస్సార్, శోభారాణి వంటి 50 ఏళ్లు పర్మిషన్ గడువు ముగిసిపోయిన ఏడెనిమిది మైన్స్, పట్టాభూములను తన గుప్పెట్లో పెట్టుకుని అక్రమంగా మైనింగ్ చేస్తున్నాడు. ఇలా ఏడాదికి రూ. 250 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ. వెయ్యి కోట్లకు పైనే దోపిడీకి స్కెచ్ వేశాడు. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాల్సిన ఈ మైన్స్ లో ఎంపీ ఇల్లీగల్ వ్యాపారం చేస్తున్నాడు. రూ. 5 కోట్లు మెషినరీ కొనుగోలు చేసి రూ. వెయ్యి కోట్లు దోచుకోవాలని భారీ స్కెచ్ వేశాడు. నేను చెప్పేవన్నీ అబద్ధాలే అయితే, ఈ మైన్స్‌తో తనకు సంబంధం లేదని, తాను నిజాయితీపరుడే అయ్యుంటే వారం రోజుల్లో సర్వే చేయించి ఈ లీజు ముగిసిన క్వారీల్లో ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టి స్వాధీనం చేసుకోవాలి. లీజు గడువు ముగిసిన భూముల్లో అక్రమ మైనింగ్ జరిగితే భవిష్యత్తులో పర్మిషన్ ఇవ్వకూడదని తెలిసి కూడా ఇష్టారాజ్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ మైనింగ్ చేస్తున్నారు. కాదని నిరూపిస్తే ఎంపీకి క్షమాపణలు చెప్పడానికి నేను సిద్ధం. వైయస్ఆర్‌సీపీ హయాంలో పారదర్శకంగా మైనింగ్ నేను ప్రెస్‌మీట్ పెట్టి మైనింగ్‌లో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చిన తర్వాత సైదాపురంలో మైన్ల చుట్టూ వందల మంది పోలీసులను మోహరించారు. అక్రమ మైనింగ్ చేస్తున్న ప్రాంతాల నుంచి వాహనాలను కూలీలను తరలించారు. దానికి సంబంధించిన డ్రోన్ ఫొటోలు వీడియోలు ఆధారాలున్నాయి. అక్రమ మైనింగ్ చేసిన మెటీరియల్ మొత్తం వేలం వేసినా ప్రభుత్వానికి దాదాపు రూ. 700 కోట్లు ఆదాయం వస్తుంది. అన్ని మైన్లకు అనుమతులిచ్చి వ్యాపారాలు చేసుకోనిచ్చి ఉంటే జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేది. వేల మందికి ఉపాధి దొరికేది. ఒకే ఒక్క వ్యక్తి కారణంగా అటు ప్రభుత్వానికి ఇటు నెల్లూరు ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతోంది. అందరికీ పనిదొరకాలి. అందరూ బాగుండాలి అనేదే నా విధానం. గత ప్రభుత్వంలో టీడీపీ వారి మీద కూడా ఎలాంటి ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛగా మైనింగ్ చేసుకోనిచ్చాం. ఎవర్నీ బెదిరించలేదు. మైన్స్‌ను బ్లాక్ చేయలేదు. ఎక్స్‌పోర్టర్లను ఆపలేదు. టాప్ టెన్ ఎక్స్‌పోర్టర్ల లిస్ట్ చూస్తే అందులో టీడీపీ వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. మా ప్రభుత్వ పారదర్శక విధానాలకు ఇంతకన్నా వేరే రుజువులు అవసరం లేదు.