లిక్కర్‌ స్కాంలో అసలు దోషి చంద్రబాబే 

మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియతో మాట్లాడిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌.

ఆధారాలతో సహా చంద్రబాబు సీఐడీకి దొరికారు

సీఎం కాగానే కేసు దర్యాప్తును అడ్డుకున్నారు

ప్రివిలేజ్‌ ఫీజు రద్దుతో బార్లకు మేలు చేసిన చంద్రబాబు

క్యాబినెట్‌కే తెలియకుండా చంద్రబాబు నిర్ణయం

ఇంకా నాలుగైదు డిస్టిలరీలకే 69 శాతం ఆర్డర్లు 

2012 ఎక్సైజ్‌ పాలసీ సవరణతో భారీ దోపిడీ 

మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ వెల్లడి

రాజకీయ ప్రతీకారంతోనే లిక్కర్‌ కుంభకోణం సృష్టి

అవినీతికి ఆధారాలే లేవు.. తప్పుడు వాంగ్మూలాలు తప్ప

వాటి ఆధారంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు

వైయస్‌ జగన్‌ లక్ష్యంగా ఆయన సన్నిహితులకు వేధింపులు 

ప్రెస్‌మీట్‌లో సాకే శైలజానాథ్‌ స్పష్టీకరణ

తాడేపల్లి: లిక్కర్‌ స్కాంలో అసలు దోషి చంద్రబాబే అని, ఆధారాలతో సహా సీఐడీకి దొరికిన ఆయన, సీఎం కాగానే కేసు దర్యాప్తును అడ్డుకున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ ఆక్షేపించారు. ప్రివిలేజ్‌ ఫీజు రద్దుతో బార్లకు మేలు చేసిన చంద్రబాబు, చివరకు క్యాబినెట్‌కు కూడా తెలియకుండా ఆ నిర్ణయం తీసుకున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలిపారు.

సాకే శైలజానాథ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

తప్పుడు వాంగ్మూలాలతో అక్రమ అరెస్టులు:
    నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తొలి ముఖ్యమంత్రి దేశంలో చంద్రబాబు ఒక్కేడేనేమో!. తీరా ఓటేయించుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ముందుబాబులను కూడా వంచించాడు. రేట్లు తగ్గించకపోగా పెంచేసి జేబులు ఖాళీ చేస్తున్నాడు. వైయ‌స్ఆర్‌సీపీని, వైయస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు తప్పుడు కేసులతో వేధించాలని చూస్తున్నారు. లిక్కర్‌ కుంభకోణం జరగకపోయినా జరిగినట్టు వాంగ్మూలాలు సృష్టించి మాజీ ఐఏఎస్‌ కె.ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి కృష్ణమోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేశారు. 
    వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో ఎలాంటి అక్రమాలు జరగకపోయినా, బెవరేజెస్‌ కార్పొరేషన్‌లో కొందరు ఉద్యోగులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. లిక్కర్‌ స్కాంపై కూటమి ప్రభుత్వం వేసిన ‘సిట్‌’ లో కొనసాగలేనని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు బయటకు వెళ్లారంటేనే కేసుల వెనుక డొల్లతనం బయటపడుతుంది.  

ఎక్సైజ్‌ పాలసీ సవరణలో అవకతవకలు:
    2014–19 మధ్య జరిగిన లిక్కర్‌ స్కాంలో చంద్రబాబు నిందితుడు. 2012 ఏపీ ఎక్సైజ్‌ పాలసీకి సవరణ పేరుతో అవకతవకలు పాల్పడ్డారు. బార్లకు ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేసి, వాటి యజమానులకు దాదాపు రూ.1300 కోట్ల లాభం చేకూర్చారు.
    2014లో చంద్రబాబు సీఎం అయిన ఏడాదిలోనే, బార్లపై ఉన్న ప్రివిలేజ్‌ ఫీజు పది రెట్లు పెంచాలంటూ ఎక్సైజ్‌ కమిషనర్‌ సీఎంకు ప్రతిపాదనలు పంపారు. క్యాబినెట్‌లో దాని గురించి ఎటువంటి చర్చ జరగలేదు. ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఆ లోగానే విషయాన్ని లీక్‌ చేసి బార్‌షాప్‌ల యజమానుల నుంచి భారీగా వసూళ్లు దండుకున్నారు. వెంటనే ఆ సాయంత్రం అదే కమిషనర్‌ ప్రివిలైజ్‌ ఫీజు రద్దు చేస్తూ మరో ప్రతిపాదన ప్రభుత్వానికి పంపడంతో పాటు, సర్క్యులర్‌ కూడా ఇచ్చేశారు.
    ఈ మొత్తం ప్రక్రియ నిబంధనలకు విరుద్దమని ఐఎఎస్‌ అధికారులు చెప్పడంతో సర్క్యులర్‌ ఇచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని సమర్థించుకునేందుకు ప్రివిలైజ్‌ ఫీజు తగ్గించాలంటూ బార్ల  యజమానుల నుంచి విజ్ఞాపన పత్రాలు రాయించుకున్నారు. వాటిని పరిగణలోకి తీసుకుంటూ ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేస్తూ, జీఓ జారీ చేశారు. దానికి సంబంధించిన ఫైళ్ళపై అప్పటి ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర 3.12.2015న సంతకం పెడితే ఆ మరుసటి రోజైన 4.12.2015న ర్యాటిఫికేషన్‌ ఫైల్‌పై చంద్రబాబు సంతకం పెట్టారు.
    లిక్కర్‌ విషయంలో చంద్రబాబు ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడ్డాడనేందుకు ఇవీ ఆధారాలు. ఇటువంటి తప్పుడు ఆదేశం కూటమి ప్రభుత్వం చెబుతున్న ఈ లిక్కర్‌ స్కామ్‌లో ఉందా?

డిస్టిలరీలకు పర్మిషన్‌ ఇచ్చింది చంద్రబాబే:
    మద్యం కుంభకోణం గురించి మాట్లాడుతున్న తెలుగుదేశం నాయకులు కీలకమైన విషయాల గురించి మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. మద్యం షాపులను ప్రభుత్వం నడిపిస్తే ఆదాయం వస్తుందా?  ప్రైవేటువ్యక్తులకు అప్పగిస్తే ఆదాయం వస్తుందో చెప్పాలి. ఏపీలో ఉన్న అన్ని డిస్టిలరీలకు అనుమతులిచ్చింది చంద్రబాబే. 
    ఎస్పీవై ఆగ్రోస్, విశాఖ డిస్టిలరీ, పీఎంకే డిస్టిలరీలకు చంద్రబాబే పర్మిషన్‌ ఇచ్చారు. అంతేకాకుండా 69 శాతానికి పైగా ఆర్డర్లు నాలుగైదు డిస్టిలరీలకే ఇచ్చారు. ఇదంతా స్కాం కాదా? కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం నడిపే మద్యం షాపులను తిరిగి ప్రైవేటు వ్యక్తులకే అప్పగించారు. మద్యం షాపుల నోటిఫికేషన్‌ నుంచి డిస్టిలరీలకు ఆర్డర్లు, మద్యం షాపుల్లో అక్రమాల వరకు అడుగడుగునా భారీ అవినీతి జరుగుతోంది. 2024 ఎన్నికల ముందు బెల్ట్‌ షాపులే లేని పరిస్థితి ఉండగా, ఇప్పుడు వీధివీధికి బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. 

వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే:
    ఏడాది పాలనతో తీవ్రంగా వైఫల్యం చెందిన చంద్రబాబు, తన పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు అరెస్టుల పేరుతో డైవర్షన్‌ పాలిటిక్స్‌కి పాల్పడుతున్నారు. వైయస్‌ జగన్‌ను అభిమానించే వారు ఎవరూ ఉండకూడదనేది చంద్రబాబు లక్ష్యం. ప్రభుత్వ వైఫల్యాలను గొంతులు నొక్కడమే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. చంద్రబాబు పాలనపై పట్టు కోల్పోయారు. ఏడాది పాలనలోనే అన్ని వ్యవస్థలు గాడి తప్పాయి. అనుభవజ్ఞడినని చెప్పుకునే చంద్రబాబుకి సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయడం చేతకావడం లేదు. అడ్డగోలు అబద్ధాలు, మాయమాటలతోనే ఏడాది గడిపేశారు.
    కూటమి ప్రభుత్వం వద్ద ఒక్క మంచి పని కూడా లేదు. ప్రజల్లో భయాందోళనలు çసృష్టించడం ద్వారా దావరా వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలనుకుంటే అంతకన్నా అవివేకం ఇంకోటి ఉండదు. ఏడాది పాలనతోనే దేశంలో ఏ ప్రభుత్వానికీ రానంత వ్యతిరేకత కూటమి ప్రభుత్వంపై వచ్చిందని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ గుర్తు చేశారు.

Back to Top